టీమ్‌ఇండియా టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మీడియా సమావేశం మరికొన్ని సందేహాలు లేవనెత్తింది! బీసీసీఐలో అంతా సవ్యంగానే సాగుతోందా? విభేదాలు ఆటగాళ్ల మధ్య ఉన్నాయా? లేదా బోర్డు, కెప్టెన్‌ మధ్య ఉన్నాయా అర్థమవ్వడం లేదు.


దక్షిణాఫ్రికా టెస్టు జట్టు ఎంపికకు గంటన్నర ముందు తనకు సెలక్టర్లు కాల్‌ చేశారని విరాట్‌ కోహ్లీ అంటున్నాడు. ఆపై వన్డే కెప్టెన్సీ నుంచి తొలగిస్తున్నట్టు చెప్పారని వెల్లడించాడు. టీ20 కెప్టెన్సీ వదిలేస్తానని చెప్పినప్పుడు బీసీసీఐ పెద్దలు ఆహ్వానించారని పేర్కొన్నాడు. తననెవరూ ఆపలేదన్నాడు. అయితే తాను వద్దని వారించానని గంగూలీ చెప్పిన మాటలకు ఇవి విరుద్ధంగా అనిపిస్తున్నాయి.


'డిసెంబర్‌ 8న టెస్టు జట్టు ఎంపికకు గంటన్నర నాకు కాల్‌ చేశారు. నేను టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని ప్రకటించిన రోజు నుంచి  ఇప్పటి వరకు (డిసెంబర్‌ 8) నన్నెవరూ సంప్రదించలేదు. టెస్టు జట్టు గురించి చీఫ్ సెలక్టర్‌ చేతన్‌ శర్మ నాతో చర్చించారు. మేమిద్దరం కలిసే నచ్చిన జట్టును ఎంపిక చేశాం. అయితే ఫోన్‌ పెట్టేసే ముందు వన్డే కెప్టెన్సీ నుంచి తొలగిస్తున్నామని చెప్పారు. అందుకు నేను సరే, మంచిదని బదులిచ్చాను. సెలక్షన్‌ కమిటీ సమావేశం తర్వాత మేమిద్దరం దాని గురించి కాస్త సంభాషించుకున్నాం. అంతే జరిగింది! అంతకు ముందు నాతో ఎలాంటి కమ్యూనికేషన్‌ లేదు' అని కోహ్లీ స్పష్టం చేశాడు.


టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని ప్రకటించినప్పుడు బీసీసీఐ అత్యున్నత బృందం ఆహ్వానించిందని విరాట్‌ తెలిపాడు. ఈ నిర్ణయాన్ని మరోసారి పరిశీలించుకోవాలని సూచించానన్న గంగూలీ వ్యాఖ్యలతో పోలిస్తే ఇవి భిన్నంగా ఉన్నాయి.


'టీ20 కెప్టెన్సీ వీడ్కోలు నిర్ణయం చెప్పినప్పుడు బీసీసీఐ ఆహ్వానించింది. నాకు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవ్వలేదు. మరోసారి ఆలోచించుకోవాలని ఎవరూ చెప్పలేదు. సరైన దిశలో వెళ్లేందుకు, ప్రగతిశీలతకు మంచిదని చెప్పారు. ఇబ్బందేమీ లేదనుకుంటే టెస్టు, వన్డే కెప్టెన్‌గా కొనసాగుతానని చెప్పాను. ఏం చేయాలనుకుంటున్నానో స్పష్టంగా చెప్పాను. తొలగించాలనుకుంటే ఆ ఆప్షన్‌ కూడా ఇచ్చాను. కమ్యూనికేషన్‌ పరంగా నేను స్పష్టంగా ఉన్నాను' అని విరాట్‌ అన్నాడు. 


బయట జరుగుతన్నవి, రాస్తున్నవి, వింటున్నవి బాధాకరమని కోహ్లీ తెలిపాడు. ఏం జరిగినా టీమ్‌ఇండియాకు ఆడాలన్న తపన, ప్రేరణ తనకు తగ్గవని వెల్లడించాడు. తననెవరూ పట్టాలు తప్పించలేరని పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికా వంటి పెద్ద పర్యటనకు వెళ్తున్నప్పుడు ఇలాంటివి సహజమేనన్నాడు. జట్టు కోసం మానసికంగా, శారీరకంగా పూర్తిగా సన్నద్ధమయ్యానని పేర్కొన్నాడు.


Also Read: Kohli Post on Dhoni: ధోనీ అంటేనే కింగ్‌! కోహ్లీ చేసిన ఈ ట్వీటే నంబర్‌ వన్‌!


Also Read: India's Test squad: షాక్‌..! కెప్టెన్‌గా ప్రమోషన్‌ పొందిన రోహిత్‌కు గాయం.. టెస్టు సిరీసు నుంచి ఔట్‌


Also Read: Virat Kohli: వన్డే సిరీస్ నుంచి కోహ్లీ అవుట్? కారణం అదే!


Also Read: Kohli Vs Rohit: ఒకళ్లుంటే మరొకళ్లు ఆడరా... ఇలా అయితే టీమిండియాకు కష్టమే!


Also Read: BBL: ప్చ్.. అయ్యయ్యో.. క్యాచ్ పట్టబోయిన అభిమాని తల పగిలింది.. రక్తం వస్తుందని అతడికే తెలియలేదు


Also Read: Kohli Press Conference: 'రోహిత్‌కు నాకు మధ్య విభేదాల్లేవు..' కెప్టెన్సీపై కోహ్లీ షాకింగ్ కామెంట్స్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి