BWF World Championships Kidambi Srikanth Enters Final: తెలుగు తేజం, భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ అద్భుతం చేశాడు. తన కెరీర్‌లో తొలిసారిగా ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పైనల్ చేరుకున్నాడు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ టైటిల్ అందుకునేందుకు మరో అడుగు దూరంలో నిలిచాడు కిడాంబి శ్రీకాంత్. శనివారం రాత్రి హోరాహోరీగా సాగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో 17-21, 21-14, 21-17 పాయింట్ల తేడాతో మరో భారత ఆటగాడు లక్ష్య సేన్‌పై విజయం సాధించాడు.
తొలి గేమ్ కోల్పోయినా శ్రీకాంత్ వెనకడుగు వేయలేదు. తన అనుభవానికి నైపుణ్యం జత చేస్తూ వరుసగా రెండు గేమ్‌లు గెలిచి తన కెరీర్‌లో తొలిసారి బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరేందుకు ఇద్దరు ఆటగాళ్లు తలపడటంతో భారత అభిమానులకు అసలుసిసలైన పోరును వీక్షించారు. ఆదివారం జరగనున్న తుదిపోరులోనూ శ్రీకాంత్ విజయం సాధించాలని యావత్ భారతావని ఆకాంక్షిస్తోంది.
తొలి సెమీఫైనల్లో భారత క్రీడాకారులు శ్రీకాంత్, లక్ష్య సేన్ తలపడ్డారు. ఇద్దరు నువ్వానేనా అనేలా తలపడటంతో మొదట 4-4 వద్ద, ఆపై 7 పాయింట్ల వద్ద స్కోర్లు సమం అయ్యాయి. ఆ తరువాత లక్ష్య సేన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లగా.. శ్రీకాంత్ వరుస పాయింట్లు సాధించి 17-16కి చేరాడు. చివర్లో ఎలాంటి పొరపాట్లు చేయని లక్ష్యసేన్ వరుస పాయింట్లతో తొలి గేమ్ నెగ్గాడు. రెండో గేమ్‌లో శ్రీకాంత్ జోరు పెంచాడు. వరుస ర్యాలీలలతో లక్ష్య సేన్‌ను ఒత్తిడిలోకి నెట్టి రెండో గేమ్‌ను 21-14తో అవలీలగా గెలిచాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో 7 పాయింట్ల వద్ద, ఆపై 13 పాయింట్ల వద్ద స్కోర్లు సమం అయ్యాయి. శ్రీకాంత్ మూడు వరుస పాయింట్లు సాధించి ఆధిక్యంలోకి వెళ్లగా లక్ష్య కూడా దూకుడు ప్రదర్శించాడు. చివరి నిమిషాల్లో శ్రీకాంత్ క్రాస్ కోర్ట్ విన్నర్, ర్యాలీలతో ఆకట్టుకుని గేమ్‌తో పాటు మ్యాచ్ ముగించాడు.
Also Read: Year Ender 2021: ఈ ఏడాదీ యువరాజ్ దొరకలేదు..! ప్రపంచకప్పులు అందలేదు!
మూడో భారత ప్లేయర్..
వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరిన మూడో భారత ఆటగాడిగా శ్రీకాంత్ నిలిచాడు. అయితే సైనా నెహ్వాల్, పీవీ సింధు మహిళా ప్లేయర్లు కాగా, ఈ ఘనత సాధించిన తొలి పురుష బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్. సైనా నెహ్వాల్ 2015లో, పీవీ సింధు 2017, 2018, 2019లలో వరుసగా మూడు పర్యాయాలు ఫైనల్ చేరుకుంది. తొలి రెండు ప్రయత్నాల్లో సింధు రజతానికి పరిమితం కాగా, గత టోర్నీలో స్వర్ణం సాధించి తన కల సాకారం చేసుకుంది.
Also Read: Year Ender 2021: దిగ్గజాల నీడలోంచి వెలుగుతున్న సూరీడులా..! 'కెప్టెన్ రోహిత్' మర్చిపోలేని 2021