Morning Top News:


నేడే విశాఖలో ప్రధాని మోదీ పర్యటన


ఆంధ్రప్రదేశ్‌లో నేడు(బుధవారం) మోదీ పర్యటించనున్నారు. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. భారీగా భద్రతా బలగాలు మోహరించారు. మోదీ రెండు కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. రైల్వే జోన్ ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్న మోదీ... గ్రీన్ హైడ్రోజన్ పవర్ ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేస్తారు. ఈ రెండు ప్రాజెక్టులతో ఉత్తరాంధ్ర దశ మారుతుందని మంత్రులు, కూటమి నేతలు చెప్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


సంక్రాంతికి ఏపీ వ్యాప్తంగా గోకులాలు ప్రారంభం


ఏపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో భాగంగా గోకులాలను సంక్రాంతి ఉత్సవాలుగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీ నుంచి 12 వరకు ఏపీ వ్యాప్తంగా గోకులాలకు సంక్రాంతి సందర్బంగా ప్రారంభించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జనవరి 10వ తేదీన కాకినాడ జిల్లాలోని తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో నిర్వహించే కార్యక్రమానికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారని అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


కేటీఆర్‌కు మరోసారి ఈడీ నోటీసులు


ఫార్ములా ఈ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 16వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. కాగా.. కేటీఆర్ మంగళవారం ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా, విచారణకు హాజరయ్యేందుకు సమయం కోరిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ కేసులో ఈనెల 9న విచారణకు రావాలని ఏసీబీ అధికారులు కూడా నోటీసులిచ్చారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


హైకోర్టులో పిన్నెల్లికి ఊరట


 వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది. సంక్రాంతి సెలవులు ముగిసేవరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు.టీడీపీ కార్యాలయంపై దాడితో పాటు టీడీపీ నాయకులపై దాడులు, వారి వాహనాల ధ్వంసం కేసులలో దర్యాప్తునకు సహకరించాలని హైకోర్టు ఆదేశించింది. మూడో వారానికి తదుపరి విచారణ వాయిదా పడింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేటీఆర్


ఏసీబీ కేసులో మాజీ మంత్రి కేటీఆర్.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్‌ను మంగళవారం తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఏసీబీ కేసును మరింత దర్యాప్తు చేయాలని, పూర్తి ఆధారాలు లేకుండా కేసును క్వాష్ చేయలేమని హైకోర్టు తెలిపింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ కేటీఆర్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో తనపై పెట్టిన కేసును కొట్టేయాలంటూ సుప్రీం కోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


ఏపీ హైకోర్టులో జగన్ కు ఊరట


ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జగన్‌కు ఊరట లభించింది. ఆయనకు ఐదేళ్ల కాలపరిమితతో పాస్‌పోర్టు జారీ చేయాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. గతంలో ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టేసింది. తనకు రెగ్యులర్ పాస్‌పోర్టు ఇవ్వాలని జగన్ విజయవాడలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టును ఆశ్రయించగా కోర్టు  తిరస్కరించింది. ఈ ఉత్తర్వులపైనే హైకోర్టు ఆశ్రయించిన జగన్‌కు కాస్త ఊరట లభించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


తెలంగాణ కాంగ్రెస్ కు వైసీపీ గతే: ఏపీ నేత హెచ్చరిక


తెలంగాణ బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిపై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ తీవ్రంగా స్పందించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష నేతల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేసిన వైసీపీకి పట్టిన గతే.. తెలంగాణలో కాంగ్రెస్‌కు పడుతుందని హెచ్చరించారు. ప్రభుత్వాలు తమ విధి మర్చిపోయి ప్రజలపై దాడులకు పాల్పడుతున్నప్పుడు ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాల్సిన పరిస్థితి వచ్చినట్లే అన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


ఢిల్లీ ఎన్నికలు.. పూర్తి షెడ్యూల్ ఇదే


 ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. పోలింగ్ ఫిబ్రవరి ఐదో తేదీన జరుగుతుంది. ఎనిమిదో తేదీన కౌంటింగ్ జరుగుతుంది. మొత్తం 70 స్థానాలకు పోలింగ్ ఒకే విడతలో జరుగుతుంది. ఫిబ్రవరి 23తో ఢిల్లీ అసెంబ్లీ పదవీకాలం ముగియనుండడంతో ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. బీజేపీ, ఆప్‌, కాంగ్రెస్‌ ఇప్పటికే కొన్ని స్థానాల్లో తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించాయి.  పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


డొనాల్డ్ ట్రంప్‌నకు ఇచ్చి పడేసిన ట్రూడో


ఎట్టి పరిస్థితుల్లోనూ కెనడా అమెరికాలో విలీనం కాదని జస్టిన్ ట్రూడో స్పష్టం చేశారు. డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనపై ట్రూడో ఘాటుగా స్పందించారు. అమెరికా, కెనడాలోని ప్రజలు, కార్మికులు, వ్యాపారం సహా పలు రంగాల వారు సెక్యూరిటీ భాగస్వామ్యం ద్వారా లబ్ధి పొందుతున్నారని ట్రూడో తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. అమెరికాలో కెనడా విలీనం కావడం, 51వ రాష్ట్రంగా చేరాలన్న ట్రంప్ పిచ్చి ప్రతిపాదనను జస్టిన్ ట్రూడో ఘాటుగానే తిరస్కరించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


సీనియర్లపై వేటుకు రంగం సిద్ధం!


బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఘోరంగా విఫలమైన సీనియర్లపై వేటు వేసేందుకు బీసీసీఐ సిద్ధమైంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫైనల్ టెస్టు ఆడేశారనే చాలామంది అభిమానులు భావిస్తున్నారు. మెల్ బోర్న్ తోనే రోహిత్ టెస్టు కెరీర్ ముగిసిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే తాను రిటైర్మెంట్ ప్రకటించలేదని విశ్రాంతి తీసుకున్నానని రోహిత్ తెలిపాడు. బీసీసీఐ మాత్రం రోహిత్ వాదనను పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..