Macherla Ex MLA Pinnelli Ramakrishna Reddy | అమరావతి: వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. సంక్రాంతి సెలవులు ముగిసేవరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. అదే సమయంలో విచారణకు సహకరించాలని పిన్నెల్లిని కోర్టు ఆదేశించింది. టీడీపీ కార్యాలయంపై దాడితో పాటు టీడీపీ నాయకులపై దాడులు, వారి వాహనాల ధ్వంసం కేసులలో దర్యాప్తునకు సహకరించాలని హైకోర్టు ఆదేశించింది. మూడో వారానికి తదుపరి విచారణ వాయిదా పడింది.


పోలీసులకు ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు


పల్నాడు జిల్లాలోని మాచర్లలో టీడీపీ ఆఫీసు తగులబెట్టడం, ఆ పార్టీ నేతలపై దాడి కేసులో సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం విచారించింది. పిన్నె్ల్లి అరెస్ట్‌ విషయంలో తొందరపాటు చర్యలు వద్దని, సంక్రాంతి సెలవులు ముగిసేవరకు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పిన్నెల్లి ఆధ్వర్యంలో వైసీపీ నేతలు టీడీపీ ఆఫీసుకు నిప్పు పెట్టారని, టీడీపీ నేతలపై సైతం దాడులకు పాల్పడ్డారని యర్రం అన్నపూర్ణమ్మ చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసులు నమోదు చేశారు. మాచర్ల పట్టణ పోలీసులు 2022 డిసెంబర్‌ 17న పిన్నెల్లి సహా పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిలు ఇవ్వాలని కోరుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జడ్జి  జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని ప్రస్తుతం అరెస్ట్ చేయవద్దని తీర్పు వెలవరించారు.


పిన్నెల్లి ప్రధాన అనుచరుడు కిశోర్‌ను విచారిస్తున్న పోలీసులు


మాచర్ల: వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ కృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు  తురకా కిషోర్ ను ఏపీ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. హైదరాబాద్ మల్కాజిగిరిలోని జయపురి కాలనీలో ఆదివారం నాడు మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ తురకా కిశోర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి ఏపీకి తరలించారు. వైసీపీ హయాంలో టీడీపీ నేతలపై దాడులు సహా పలు కేసులలో నిందితుడుగా కిశోర్ ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు బొండా ఉమా, బుద్ధా వెంకన్నలపై మాచర్లలో జరిగిన దాడి చేసిన కేసులో తురకా కిశోర్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. కిశోర్‌ను న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ఆపై పోలీసుల కస్టడీకి ఇవ్వగా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.


Also Read: PM Modi Vizag Tour: దేశానికే గేమ్‌ ఛేంజర్‌ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు- నేడు వైజాగ్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన