KTR News: విధ్వంసం, మోసం, అటెన్ష్ డైవర్షన్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తన కేసుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిందన్నారు కేటీఆర్. కక్ష పూరితంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా తనను రేవంత్ రెడ్డి ఏం చేయలేరని అన్నారు. ఫార్ములా ఈ కేసులో పస లేదని మరోసారి పునరుద్ఘాటించారు. న్యాయపోరాటంలో విజయం సాధిస్తామన్నారు. హైకోర్టు క్వాష్ పిటిషన్ మాత్రమే కొట్టేసిందన్నారు. తాను భారతీయ పౌరుడిగా ఎన్ని కోర్టుల్లోనైనా పోరాటం చేస్తామన్నారు. రాజకీయ ప్రేరేపిత కేసు మాత్రమే అన్నారు. దీనిపై అసెంబ్లీలో చర్చ పెడదామంటే పారిపోయిన వ్యక్తి అని రేవంత్‌రెడ్డిపై విమర్శలు చేశారు. ఇప్పటికైనా ఆయన నివాసం ఉండే జూబ్లీహిల్స్‌లో ఉన్న ఆయన నివాసంలో అయినా మీడియా సమక్షంలో చర్చకు సిద్ధమని ప్రకటించారు.
లొట్టపీసు కేసు గురించి చర్చ వద్దు
అంబేద్కర్ రాజ్యాంగంపై తనకు గౌరవం ఉందన్న కేసీఆర్.... కచ్చితంగా ఈడీ, ఏసీబీ విచారణకు హాజరవుతానని అన్నారు. ఏడాది అయినా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాని ప్రభుత్వం లొట్టపీసు కేసు పట్టుకొని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వాటిపై న్యాయంగా పోరాడతామన్న కేటీఆర్... పార్టీ నాయకులు మాత్రం ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉండాలని సూచించారు. ఉదయం నుంచి తనను కలిసేందుకు వచ్చిన ప్రతి నాయకుడికీ ఇదే చెప్పానని అన్నారు. ప్రభుత్వం ట్రాప్‌లో పడొద్దని రైతు భరోసా నుంచి తులం బంగారం వరకు అన్ని గ్యారంటీలపై నిలదీయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
అవినీతిలో కూరుకుపోయిన వారికి ప్రతి అంశంలో అవినీతి కనిపిస్తుందన్నారు కేటీఆర్. అందుకే అసలు ఏం లేని ఫార్ములా ఈ రేసింగ్‌లో ఏదో ఉందని అబద్దం ప్రచారం చేస్తున్నారని అన్నారు. అన్నింటినీ పటాపంచలు చేసేందుకు తాను ఏసీబీ ఆఫీస్‌కు వెళ్తే అక్కడ తన లాయర్లను అనుమతి ఇవ్వలేదని అందుకే వెనక్కి వచ్చేశాను అన్నారు. కచ్చితంగా తనకు న్యాయ స్థానాలపై గౌరవం ఉందని న్యాయవాదుల సమక్షంలో విచారణ జరగాలని కోర్టు తలుపుతడుతామన్నారు. ఇందులో తప్పేముందని ప్రశ్నించారు.
నికృష్ణ ఆలోచన లేదు
తెలంగాణ ప్రతిష్టను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో తాను ఫార్ములా ఈ రేస్ పెట్టామని తమకు ఉత్కృష్టమైన ఆలోచనగా చెప్పుకొచ్చారు కేటీఆర్. కాంగ్రెస్ నేతల్లా తమకు నికృష్టమైన ఆలోచనలు లేవని విమర్శలు చేశారు. పైసా అవినీతికి పాల్పడలేదు కాబట్టే తాను ఎలాంటి విచారణకైనా సిద్ధమని మరోసారి స్పష్టం చేశారు. క్విడ్‌ప్రోకో ఆలోచనలు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు కేటీఆర్. కొడంగల్ ప్రాజెక్టును మెగా కృష్మారెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పంచుకున్నారని ఆరోపించారు. దీన్నే అసలైన క్విడ్ ప్రోకో అంటారని వివరించారు. ఫార్ములా వన్‌లో పాల్గొన్న కంపెనీ తమతోపాటు అన్ని పార్టీలకు ఫండ్ ఇచ్చిందని అంటే అందరితో కూడా క్విడ్ ప్రోకో ఉన్నట్టేనా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు కావు
ప్రెస్‌మీట్ సందర్భంగా మీడియాపై కూడా కేటీఆర్ సెటైర్లు వేశారు. ప్రభుత్వం చెప్పే విషయాలనే కాకుండా ప్రజల సమస్యలు, రైతుల ఇబ్బందులు, హైడ్రా బాధితుల కష్టాలు చెప్పాలని సూచనలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు కావాని విమర్శించారు కేటీఆర్. ప్రభుత్వానికి అవసరమైనప్పుడు రక్షణ కవచంగా మారుతోంది బీజేపీ అని ఆరోపించారు.