వినుకొండలో గాల్లోకి కాల్పులు - ఇంటర్నెట్ నిలిపివేత


పల్నాడు జిల్లా వినుకొండలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ముదిరిన వివాదంలో సీఐ అత్యుత్సాహంతో గాల్లోకి కాల్పులు జరపడంతో రణరంగంగా మారింది. వినుకొండ పట్టణంలో ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. వినుకొండ నియోజకవర్గంలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారని టీడీపీ శ్రేణులు ఓ ర్యాలీ నిర్వహించారు. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించాలని పోలీసులు టీడీపీ నేతలపై కేసులు పెట్టారు.  ప్రజాస్వామ్య యుత నిరసనలపైనా కేసులు పెడతారా అని.. టీడీపీ నేతలు..  మరోసారి ర్యాలీ నిర్వహించారు. అయితే ఈ సారి పోలీసులు కాకుండా.. వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు ఎదురు వచ్చారు. వినుకొండ బస్టాండ్ సెంటర్ లో రెండు వర్గాలు ఎదురు పడ్డాయి. ఇంకా చదవండి


వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష


తెలంగాణలో విస్తారంగా కురుస్తున్న వర్షాలపై సీఎం చంద్రశేఖర్ రావు గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. భూపాలపల్లె మొరంచపల్లి గ్రామం మునకపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సాధారణ హెలికాఫ్టర్‌తో వెల్లడం కష్టమని అధికారులు వివరించారు. గ్రామంలో చిక్కుకున్న వారిని రక్షించడానికి ఆర్మీ అధికారులతో మాట్లాడుతున్నట్లుతెలిపారు. గతంలో ఎన్నడూ లేనంతగా వర్షాలు కురవడంతో మొరంచవాగు ఉప్పొంగింది. దీంతో గ్రామం నీటిలో చిక్కుకుంది. ప్రజలు ప్రాణాలు రక్షించుకోవడానికి చెట్లు, భవనాలు ఎక్కారు. ఒక్కరోజులోనే మొరంచపల్లెలో 62 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇంకా చదవండి


వనమా పిటిషన్ కొట్టేసిన హైకోర్టు


భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదన్న తీర్పు అమలును నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. తాను సుప్రీంకోర్టుకు వెళ్లాలనుకుంటున్నారని..  సుప్రీంలో అప్పీల్ చేసే వరకూ తీర్పును నిలిపివేయాలని బుధవారం హైకోర్టులో లంచ్​ మోషన్​ పిటిషన్​ దాఖలు చేశారు.  విచారణకు స్వీకరించిన సింగిల్​ బెంచ్​ జడ్జి ఇరు వైపులా వాదనలు విన్నారు. ఆ తర్వాత తీర్పును రిజర్వు చేశారు. గురువారం ఉదయం తీర్పు వెలువరించారు.  2018 ఎన్నికల అఫిడవిట్​లో తప్పుడు సమాచారం ఇచ్చారని జలగం వెంకట్రావు 2019లో హైకోర్టుకు వెళ్లారు. దీనిపై మూడేండ్లుగా వాదనలు జరిగాయి. జులై 25న (మంగళవారం) కోర్టు తీర్పు ఇచ్చింది. వనమా ఎన్నిక చెల్లదని, ఆయనపై అనర్హత వేటు వేయడంతోపాటు 5 లక్షల జరిమానా విధించింది. తీర్పు అమలును నిలిపివేసేందుకు నిరాకరించడంతో వనమా మాజీ ఎమ్మెల్యే అయినట్లుగానే భావిస్తున్నారు. ఇంకా చదవండి


జగనన్న విదేశీ విద్యాదీవెన రెండో విడత నిధులు విడుదల


జగనన్న విదేశీ విద్యాదీవెన రెండో విడత నిధులను ఏపీ సీఎం జగన్ విడుదల చేశారు. అర్హులైన 357 మంది లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా రూ.45.53 కోట్లను బటన్‌ నొక్కి మరీ జమ చేశారు. గడచిన ఆరు నెలల్లో జగనన్న విదేశీ విద్యాదీవెన కింద మొత్తంగా రూ. 65.48 కోట్లు విడుదల అయ్యాయి. దేవుడి దయతో నేడు రాష్ట్రంలో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని సీఎం జగన్ తెలిపారు. మంచి కాలేజీల్లో సీట్లు వచ్చిన వారికి, డబ్బు కట్టలేని పరిస్థితుల్లో ఉన్న రాష్ట్ర విద్యార్థులకు విదేశాల్లో చదువుల జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు. ఆ పథకం రాష్ట్ర విద్యార్థులకు వరంలా మారిందని అన్నారు. మొత్తంగా 357 మంది పిల్లలకు ఇవాళ రూ. 45.53కోట్లు జమ చేస్తున్నామన్నారు. నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తున్నామని పేర్కొన్నారు. అత్యంత పారదర్శకంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని, అవినీతికి, వివక్షకు తావులేకుండా చూస్తున్నామని స్పష్టం చేశారు. ఇంకా చదవండి


కడెం ప్రాజెక్టును సందర్శించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి


భారీగా కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్టు స్థాయికి మించి ప్రవహిస్తోంది. ఈ ప్రాజెక్టుకు 18 గేట్లు ఉన్నప్పటికీ నాలుగు గేట్లు పని చేయడం లేదు. దీంతో 14 గేట్లు మాత్రమే ఎత్తి దిగువకు నీటిని వదిలి పెడుతున్నారు. ఎగువ నుంచి భారీగా వరద నీరు రావడంతో గేట్ల పైభాగం నుంచి కూడా వరద నీరు ప్రవహిస్తోంది. అప్రమత్తమైన అధికారులు కడెం వాసులను ఖాళీ చేయించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాలకు తరలించారు. ఇంకా చదవండి