Vanama :  భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదన్న తీర్పు అమలును నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. తాను సుప్రీంకోర్టుకు వెళ్లాలనుకుంటున్నారని..  సుప్రీంలో అప్పీల్ చేసే వరకూ తీర్పును నిలిపివేయాలని బుధవారం హైకోర్టులో లంచ్​ మోషన్​ పిటిషన్​ దాఖలు చేశారు.  విచారణకు స్వీకరించిన సింగిల్​ బెంచ్​ జడ్జి ఇరు వైపులా వాదనలు విన్నారు. ఆ తర్వాత తీర్పును రిజర్వు చేశారు. గురువారం ఉదయం తీర్పు వెలువరించారు.  2018 ఎన్నికల అఫిడవిట్​లో తప్పుడు సమాచారం ఇచ్చారని జలగం వెంకట్రావు 2019లో హైకోర్టుకు వెళ్లారు. దీనిపై మూడేండ్లుగా వాదనలు జరిగాయి. జులై 25న (మంగళవారం) కోర్టు తీర్పు ఇచ్చింది. వనమా ఎన్నిక చెల్లదని, ఆయనపై అనర్హత వేటు వేయడంతోపాటు 5 లక్షల జరిమానా విధించింది. తీర్పు అమలును నిలిపివేసేందుకు నిరాకరించడంతో వనమా మాజీ ఎమ్మెల్యే అయినట్లుగానే భావిస్తున్నారు. 


తీర్పు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్న జలగం వెంకట్రావు             


మరో వైపు జలగం వెంకట్రావు తనను ఎమ్మెల్యేలగా గుర్తించాలని.. ప్రమాణస్వీకారం చేయించాలని అధికారులను , బీఆర్ఎస్ పెద్దలను కలుస్తున్నారు.  బుధవారం రాష్ట్ర శాసనసభ కార్యదర్శి వీ నర్సింహాచార్యులను కలిశారు. కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వర్‌రావు ఎన్నిక చెల్లదని మంగళవారం  హైకోర్టు ఇచ్చిన 84 పేజీల తీర్పు కాపీని అసెంబ్లీ కార్యదర్శికి అందజేసి అమలు చేయాలని కోరారు.  త్వరలో స్పీకర్‌నూ కలిసేందుకు నిర్ణయించారు.  ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి తీర్పు కాపీలు అందజేశారు.  తాను బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని, పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నానని ఆయన చెబుతున్నారు.   త్వరలో సీఎం కేసీఆర్ ను కలుస్తానని చెప్పారు.    


ఇద్దరూ బీఆర్ఎస్ నేతలే  !            


ఇద్దరూ బీఆర్ఎస్‌కు చెందిన వారే కావడంతో ఈ విషయం బీఆర్ఎస్ నేతలకు ఇబ్బందికరంగా మారింది.  వనమా  వెంకటేశ్వరరావు కాంగ్రెస్ తరపున గెలిచినప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అప్పట్నుంచి అక్కడ జలగం వెంకట్రావుకు ప్రాధాన్యత తగ్గింది. దీనిపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. పెద్దగా కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. కానీఈ తీర్పు వచ్చిన తర్వతా తాను పార్టీకి విధేయుడినేనని చెబుతున్నారు. కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాల్సింది స్పీకరే. స్పీకర్ జలగంతో ప్రమాణం చేయిస్తే..  తీర్పు అమలు చేసినట్లవుతుంది. వనమా పదవిని కోల్పోతారు. నిజానికి హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం చూస్తే వనమా ఎన్నికయినప్పటి నుండి అనర్హుడే. ఈ తీర్పు అమలు చేయడం కూడా క్లిష్టమైనదేనని భావిస్తున్నారు. 


పదవి కాలం మరో నాలుగు నెలలే     


సుప్రీంకోర్టుకు వెళ్లాలని వనమా వెంకటేశ్వరరావు భావిస్తున్నారు. అయితే ఇంతా చేసి ఎమ్మెల్యే పదవి కాలం మూడు నెలలే ఉంది. ఇప్పుడు జలగం వెంకట్రావుతో ప్రమాణస్వీకారం చేయిస్తే ... హైకోర్టులో విచారణ జరిగే సరికి మూడు , నాలుగు నెలలు పూర్తయిపోతుంది. అందుకే వనమా కనీసం తీర్పుపై స్టే ఇస్తే.. ఈ మూడు, నాలుగు నెలల సమయాన్ని కూడా పూర్తి చేసుకోవచ్చనుకున్నారు. కానీ అలాంటి అవకాశం కూడా లేకుండా హైకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.