Manipur Issue:
నినాదాలు ఇవ్వకూడదని నిర్ణయం..!
మణిపూర్ విషయంలో విపక్షాలు పార్లమెంట్‌లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. ప్రధాని మోదీ మాట్లాడాల్సిందేనని తేల్చి చెబుతున్నాయి. ఈ క్రమంలోనే తమ పోరాట వ్యూహాన్ని మార్చినట్టు తెలుస్తోంది. ఇప్పటి నుంచి బీజేపీ మంత్రులెవరైనా మాట్లాడే సమయంలో నినాదాలు చేయకూడదని నిర్ణయించుకున్నట్టు సమాచారం. కేవలం కొందరు మంత్రులు మాట్లాడే సమయంలోనే సంయమనం పాటించేలా ప్లాన్ చేసుకున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా నితిన్ గడ్కరీ మాట్లాడే సమయంలో నినాదాలు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాయి. అలా అని విపక్షాలూ పూర్తిగా సైలెంట్ అయ్యే అవకాశాల్లేవు. ఇప్పటి వరకూ నినాదాలతో పార్లమెంట్‌ని హోరెత్తించినా...ఇకపై శాంతియుతంగానే నిరసన చేపట్టాలని విపక్షాలు భావిస్తున్నాయి. మణిపూర్ విషయంలో కేంద్రాన్ని ఇరకాటంలో నెట్టడమే విపక్షాల లక్ష్యం అని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అంతే కాదు. ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడే వరకూ తమ ఆందోళనను వీడే ప్రసక్తే లేదని కొందరు ఎంపీలు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విపక్షాలు..రాజ్యసభలోనూ దీనిపై చర్చకు డిమాండ్ చేస్తున్నాయి.
అంతకు ముందు పార్లమెంట్‌లో అమిత్‌షా ప్రసంగిస్తుండగా విపక్ష ఎంపీలు మణిపూర్...మణిపూర్ అంటూ పెద్దగా నినాదాలు చేశారు. ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఈ కారణంగా సభలో గందరగోళం తలెత్తింది. దీనిపై అమిత్‌షా అసహనం వ్యక్తం చేశారు. ఇలా నినాదాలు చేసే వాళ్లకు ప్రభుత్వానికి సహకరించే ఉద్దేశమే లేదని మండి పడ్డారు.
"ఇలా నినాదాలు చేసే వాళ్లెవరైనా సరే...ప్రభుత్వానికి సహకరించే ఉద్దేశమే లేదని అర్థమవుతోంది. అంతే కాదు. వాళ్లకు దళితులు, మహిళల అభివృద్ధిపైనా ఎలాంటి ఆసక్తి లేదు. రెండు సభల ఎంపీలకు నేను ఇప్పటికే లెటర్ రాశాను. మణిపూర్ అంశంపై సుదీర్ఘ చర్చకు సిద్ధమే అని చెప్పాను"
- అమిత్‌షా, కేంద్ర హోం మంత్రి
అవిశ్వాస తీర్మానమే అస్త్రం..
మణిపూర్ హింసాకాండపై భగ్గుమన్న విపక్షాలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలైనప్పటి నుంచి ఆందోళనలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. INDIA గా పేరు మార్చుకున్న విపక్ష కూటమి పూర్తి స్థాయిలో దీనిపై పోరాటం చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే నో కాన్ఫిడెన్స్ మోషన్‌ని ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్, BRS ఎంపీ నామా నాగేశ్వరరావు ఈ తీర్మానాన్ని అందజేశారు. లోక్‌సభలోని కాంగ్రెస్ విప్ మాణికం ఠాగూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంపై పోరాడడానికి చివరి అస్త్రం ఇదే అని తేల్చి చెప్పారు. ఈ అవిశ్వాస తీర్మానానికి స్పీకర్ ఆమోదం తెలిపారు. ఈ అవిశ్వాస తీర్మానంపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ స్పందించారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కేంద్రం చర్చించేందుకు సిద్ధంగా ఉందని తేల్చి చెప్పారు.