Vinukonda Tension : పల్నాడు జిల్లా వినుకొండలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ముదిరిన వివాదంలో సీఐ అత్యుత్సాహంతో గాల్లోకి కాల్పులు జరపడంతో రణరంగంగా మారింది. వినుకొండ పట్టణంలో ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. వినుకొండ నియోజకవర్గంలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారని టీడీపీ శ్రేణులు ఓ ర్యాలీ నిర్వహించారు. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించాలని పోలీసులు టీడీపీ నేతలపై కేసులు పెట్టారు. ప్రజాస్వామ్య యుత నిరసనలపైనా కేసులు పెడతారా అని.. టీడీపీ నేతలు.. మరోసారి ర్యాలీ నిర్వహించారు. అయితే ఈ సారి పోలీసులు కాకుండా.. వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు ఎదురు వచ్చారు. వినుకొండ బస్టాండ్ సెంటర్ లో రెండు వర్గాలు ఎదురు పడ్డాయి. అదే సమయంలో అక్కడకు వచ్చిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కారు దిగి టీడీపీ కార్యకర్తలపై దూసుకెళ్లడంతో పరిస్థితి ఒక్క సారిగా మారిపోయింది. పోలీసులు ఎమ్మెల్యేలను సర్ది చెప్పి పంపేశారు కానీ.. రెండు వర్గాల మధ్య ఘర్షణ మాత్రం ఉద్రిక్తతకు దారి తీసింది.
సీఐ తొందరపడి కాల్పులు జరిపారా ?
టీడీపీ, వైసీపీ కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్న సమయంలో పోలీసులు తీవ్ర చర్యలకు దిగారు. సీఐ .. వెంటనే.. గాల్లోకి కాల్పులు జరిపారు. పరిస్థితి తీవ్రంగా మారడంతో ఇంటర్నెట్ నిలిపివేశారు. దాంతో ఎంత మంది గాయపడ్డారు.. పట్టణంలో ప్రశాంతత ఎలా ఉందన్నదానిపై సమాచారం బయటకు రాకుండా కట్టడి చేశారు. ఈ ఘటనలో పదిహేను మందికిపైగా టీడీపీ నేతలకు గాయాలయినట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఉద్దేశపూర్వకంగా టీడీపీ శ్రేణుల నిరసన వద్దకు వచ్చిన బొల్లా బ్రహ్మనాయుడు ?
ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఉద్దేశపూర్వకంగానే టీడీపీ నేతలు చేస్తున్న ర్యాలీ దగ్గరకు రెచ్చగొట్టారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తన ఆవుల ఫారంకి అక్రమంగా మట్టి తరలించాలని జీవీ ఆంజనేయులు రెండు రోజుల క్రితం ఆందోళన కార్యక్రమం చేపట్టారు. అయితే ఇలా ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న వారిపై ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తన ఆవుల ఫారం నుంచి నట్లు బోల్టులు దొంగిలించారని కేసులు పెట్టించారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై శుక్రవారం ఉదయం టిడిపి శ్రేణులు ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు ర్యాలీగా ఆర్టీసీ బస్టాండ్ వద్దకు రాగానే ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తన అనుచరులతో టిడిపి ఆందోళనకారుల వద్దకు వచ్చి పరుష పదజాలంతో దూషించడమే కాక ఘర్షణ వాతావరణంలో సృష్టించారని అందుకే పరిస్థితి దిగజారిందని టీడీపీ నేతలు అంటున్నారు.
వినుకొండలో ఉద్రిక్తంగా మారుతున్న రాజకీయం
వినుకొండలో రాను రాను రాజకీయం ఉద్రిక్తంగా మారుతోంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు, వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మధ్య పరస్పర ఆరోపణలు చోటు చేసుకుంటున్నాయి. బ్రహ్మనాయుడు భారీ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు చేస్తున్నారు. లకోర్టుల్లో కూడా పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ వ్యవహారం రాను రాను రెండు పార్టీ మధ్య ఉద్రిక్తతకు దారి తీస్తోంది. దాడుల వరకూ రావడం.. సంచలనంగామారింది