తెలంగాణలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజల పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. అసలే వరద, చిత్తడితో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ మరో పిడుగులాంటి వార్త చెప్పింది. మరో మూడ్రోజుల పాటు ఇలాగే భారీగానే వర్షాలు కురుస్తాయని శాఖ తెలిపింది. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరోవైపు.. హైదరాబాద్‌లో పగలు రాత్రి తేడా లేకుండా వాన కురుస్తూనే ఉంది.
వర్షాకాలంలో వాహనదారుల అవస్థలు చెప్పతరం కాదు. ఏదైనా పని మీద బయటకు వెళ్లినప్పుడు వర్షం దాటికి మొరాయిస్తూ ఉంటాయి. తీవ్ర ట్రాఫిక్ జామ్‌లో ఆగిపోయి ఇబ్బంది పెడతాయి. కొన్ని సార్లు బయటకు వెళ్లిన వాహనదారులు వర్షంలో ఇంటికి రాలేక మధ్యలోనే ఆగిపోవాల్సి వస్తుంది. ఇంటికి వెళ్తూ మార్గమధ్యలో వర్షానికి ఇబ్బంది పడే వారి కోసం సైబరాబాద్ పోలీసులు గుడ్ న్యూస్ చెప్పారు. వినూత్న కార్యక్రమంతో ముందుకు వచ్చారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నడిరోడ్డుపై వాహనాలు మొరాయిస్తే, ట్రాఫిక్ జామ్ సమస్య పరిష్కరించేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వినూత్నంగా ఆలోచించారు. ఇందుకోసం ఒక ప్రత్యేక ఫోన్ నంబర్‌ను ఏర్పాటు చేశారు. వర్షానికి బండి ఆగిపోతే వెంటనే 83339 93360 నెంబర్‌కు వాట్సప్ కాల్ చేస్తే సైబరాబాద్ పోలీసులు సాయం చేస్తారు. అయితే ఇది వేలం సైబరాబాద్ కమిషనరేట్ పరిధి వరకు మాత్రమే. వినియోగదారులు ఈ విషయాన్ని గుర్తించాలని పోలీసులు కోరారు.
ఇక వర్షాల విషయానికి వస్తే మరో రెండు రోజుల పాటు భాగ్యనగరంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. బుధవారం రాత్రి నుంచి హైదరాబాద్‌లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొన్ని సార్లు అత్యంత వేగంగా జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల నుంచి 21 డిగ్రీల మధ్య ఉంటాయని చెప్పింది. ఉపరితల గాలులు గంటకు 10 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని చెప్పింది. అత్యవసరం అయితేనే బయటకు రావాలంటూ అధికారులు సూచించారు.
నిన్నటి నుంచి హైదరాబాద్ లో ముసురు పడుతోంది. బుధవారం రాత్రి చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు కాలనీల్లోకి వరద చేరింది. ఇప్పటికే కొన్ని కాలనీలు వరదలోనే ఉన్నాయి. భారీ వర్షాలతో రోడ్లన్నీ దెబ్బతినడంతో.. భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. సిటీ శివారు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. భారీ వర్షాలతో హైదరాబాద్ పురానాపూల్ దగ్గర మూసీ నది ఉప్పొంగుతోంది. దీంతో మూసీ ఒడ్డున ఉన్న ఆలయాలు వరదలో మునిగిపోయాయి. దోబీ ఘాట్ ను బంద్ చేశారు. రెండు రోజులుగా మూసీ నదిలో వరద ప్రవాహం పెరుగుతోందని స్థానికులు తెలిపారు. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో మూసీ పరివాహక ప్రాంతాల్లోని పబ్లిక్ లో టెన్షన్ నెలకొంది. ఇప్పటికే మూసీ రివర్ పరివాహక ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.