తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో 'దోస్త్‌' ద్వారా సీటు పొందిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్‌ చేసే గడువును పొడిగించారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ లింబాద్రి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ బుధవారం (జులై 26న) ఒక ప్రకటనలో తెలిపారు. మూడో విడతలో సీటు పొందిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిపోర్టింగ్‌ చేసుకునేందుకు జులై 28 వరకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. 


అలాగే మొదటి, రెండు, మూడో విడతలో సీటు పొంది.. ఆన్‌లైన్‌లో రిపోర్టింగ్‌ చేసిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో నేరుగా రిపోర్టింగ్‌ చేసుకోవడానికి జులై 28 వరకు అవకాశం కల్పించారు. డిగ్రీ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్‌ తరగతులు కూడా జులై 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు వారు బుధవారం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కళాశాలలో చేరిన వారు మరో బ్రాంచిలోకి మారేందుకు జులై 28 నుంచి 31 వరకు ఇంట్రా కాలేజ్‌ ప్రక్రియ జరుగనుంది. వారికి ఆగస్టు 1న సీట్లు కేటాయిస్తారు.


మొదటి విడత ఇలా..
దోస్త్ మొద‌టి విడత‌లో 73,220 మంది విద్యార్థులకు జూన్ 16న సీట్లు కేటాయించారు. సీట్లు పొందిన విద్యార్థుల్లో 44,113 మంది అమ్మాయిలు, 29,107 మంది అబ్బాయిలు ఉన్నారు. దోస్త్‌ ద్వారా ప్రవేశాలకు అందుబాటులో 889 కళాశాలలు ఉండగా.. వాటిల్లో  మొత్తం సీట్లు 3,56,258 సీట్లు ఉన్నాయి. ఇక 63 కళాశాలల్లో ఎలాంటి ప్రవేశాలు జరుగలేదు. డిగ్రీ కామ‌ర్స్ కోర్సుల్లో చేరేందుకే విద్యార్థులు సుముఖ‌త చూపించడం విశేషం. మొత్తం 33,251 మంది విద్యార్థులు కామ‌ర్స్ కోర్సుల‌ను ఎంపిక చేసుకున్నారు.


రెండో విడత ఇలా..
డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌- తెలంగాణ(దోస్త్‌) రెండో విడత సీట్ల కేటాయింపులో భాగంగా 49,267 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు.  రెండో విడతలో సీట్లు పొందిన వారిలో కామర్స్‌(బీబీఏ సహా)- 21,255, లైఫ్‌ సైన్సెస్‌- 11,944, ఫిజికల్‌ సైన్సెస్‌- 9,076, ఆర్ట్స్‌- 6,307, డేటా సైన్స్‌- 431, ఇతర కోర్సులో 81 మంది ఉన్నారు. తొలి విడతలో 73,220 మంది సీట్లు దక్కించుకున్నా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ 49 వేల మందే చేశారు. 


మూడో విడత ఇలా..
డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన 'దోస్త్‌' మూడో విడత సీట్లను జులై 20న అధికారులు కేటాయించారు. రెండో విడతలో మొత్తం 49,267 మందికి సీట్లను కేటాయించగా.. మూడో విడతలో 72,949 మందికి సీట్లు కేటాయించారు. మూడో విడతలో సీట్లు పొందినవారిలో 10,939 మంది ఆర్ట్స్‌ కోర్సును ఎంచుకోగా.. 32,209 మంది కామర్స్‌ కోర్సును ఎంచుకున్నారు. ఇక లైఫ్‌ సైన్స్‌ కోర్సును 16,859 మంది, ఫిజికల్‌ సైన్సెస్‌ కోర్సును 12,620 మంది ఎంచుకున్నారు. డిఫార్మసీ సీట్లు పొందిన వారు కేవలం 235 మంది మాత్రమే ఉన్నారు. ఇతర కోర్సులను ఎంచుకున్న వారు 87 మంది ఉన్నారు. 


'దోస్త్' మూడు రౌండ్ల సీట్లకేటాయింపు వివరాలు పరిశీలిస్తే.. మొత్తంగా 1,95,436 మంది విద్యార్థులకు అధికారులు సీట్లను కేటాయించారు. మొదటి విడతలో 73,220, రెండో విడతలో 49,267, మూడో విడతలో 72949 మందికి సీట్లు పొందారు. అయితే వీరిలో మొదటి విడతలో సీటు పొందినవారు.. రెండో విడతకు, రెండో విడతలో సీటు పొందిన వారు మూడో విడత కౌన్సెలింగ్‌లో ఉత్తమ కాలేజీ, కోర్సు కోసం కౌన్సెలింగ్‌లో పాల్గొంటూ ఉంటారు. ఈ క్రమంలో మొత్తం ఎన్ని సీట్లు భర్తీ అయినాయి తెలియాలంటే తుది విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ కూడా పూర్తి కావాల్సి ఉంది.


ఆగస్టు 1 నుంచి స్పెషల్‌ ఫేజ్‌ కౌన్సెలింగ్‌..
'దోస్త్' స్పెషల్‌ ఫేజ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఆగస్టు 1 నుంచి ప్రారంభం కానుంది. విద్యార్థులకు ఆగస్టు 16న సీట్లను కేటాయించనున్నారు. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..