Breaking News Live: ఖబడ్దార్ కేసీఆర్.. నీ దొర పోకడలు సాగనివ్వను, మత్తుతో సీఎం మెదడు మొద్దుబారిందా?: షర్మిల
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 12న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన ఆరు నెలలకే ఆయన పాలన నచ్చక బయటికొచ్చిన ప్రజా గాయకుడు ఏపూరి సోమన్నను తుంగతుర్తి అభ్యర్థిగా వైఎస్ షర్మిల ప్రకటించారు. తుంగతుర్తి ప్రజల కోసం సోమన్న పని చేస్తాడని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ హామీ ఇస్తుందని షర్మిల చెప్పారు. రాజన్న బిడ్డ షర్మిలను ఆశీర్వదించాలని షర్మిల ప్రజలను కోరారు.
‘‘దళితులకు కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచింది. మొన్న మందక్రిష్ణ మాదిగ ఇంటికి వెళ్లా. ఇప్పటిదాకా ఎస్సీ వర్గీకరణ జరగలేదని.. మీ నాన్న ఉంటే జరిగిపోయేది అని ఆయన అన్నారు. దానికోసం పోరాటం చేస్తున్న మందక్రిష్ణ అన్నకు నా ధన్యవాదాలు. మాకు మద్దతు పలికినందుకు ధన్యవాదాలు చెబుతున్నా. వైఎస్ బిడ్డగా మేం పార్టీ పెట్టి 100 రోజులు కూడా కాలేదు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉందని మాటిస్తున్నా. దళిత ఉప కులాలందరికీ రిజర్వేషన్ ప్రయోజనాలు అందించడమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లక్ష్యం’’ అని షర్మిల హామీ ఇచ్చారు.
‘‘హుజూరాబాద్‌లో ఉప ఎన్నికలు వచ్చాయి కనుక దళిత బంధు పేరుతో అక్కడి దళితులకు రాష్ట్రంలో అందరు దళితులకు కేసీఆర్ పంచాయితీ పెట్టాడు. హుజూరాబాద్‌లో ఉప ఎన్నికలు ఉన్నాయని దళిత బంధు పెడుతున్నానని నిస్సిగ్గుగా చెప్పాడంటే.. ఈయనకు ప్రేమ ఉన్నది దళితుల మీదనా? ఎన్నికల మీదనా? అక్కడ తేలిపోతుంది. ఒక్కో దళిత కుటుంబానికి కేసీఆర్ రూ.60 లక్షలు బాకీ ఉన్నాడు. ఎలాగంటే.. మూడెకరాల భూమి, దానిపై వచ్చే పంట మొత్తం కలిపితే రూ.60 లక్షలు అవుతుంది. మీలో ఎవరికైనా దళిత బంధు కింద రూ.10 లక్షల సాయం అందిందా? రూ.10 లక్షలు ఇస్తే తీసుకోండి. అలాగే మిగతా డబ్బులు కూడా ముక్కు పిండి వసూలు చేస్కోండి. డబ్బులకు బదులు ఒక ఉద్యోగం ఇస్తే ఓ కుటుంబం స్థిరపడుతుంది. కళ్లముందే 1.9 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. అందులో 35 వేల మంది దళితులకు ఉద్యోగాలు వస్తాయి. అదే జరిగితే రాబోయే తరాలు ఎంతో బాగుంటాయి.’’ అని షర్మిల ప్రసంగించారు.
‘‘డబ్బులేని వారు చదువుకోవాలని వైఎస్ ఫీజు రీఎంబర్స్‌మెంట్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు పేదింటి బిడ్డలు చదువుకోవద్దని ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఆపేశాడు కేసీఆర్. మెస్ బిల్లులు ఇవ్వట్లేదు. ఖబడ్దార్ కేసీఆర్... నీ దొర పోకడలు ఇక సాగనివ్వను. మీ పాలనకు చావు డప్పు కొట్టే రోజు త్వరలోనే ఉంది.’’ అని షర్మిల తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.
‘‘కేసీఆర్ సీఎం కాకముందు దళితులపై సంవత్సరానికి 270 దాడులు జరిగితే, కేసీఆర్ సీఎం అయ్యాక దళితులపై జరిగిన దాడులు 800 రెట్లు పెరిగాయి. నేరెళ్ల ఘటనలో ఏం జరిగిందో మీరంతా చూశారు. భువనగిరిలో దళిత మహిళను పోలీసులు హత్య చేశారు. ఆసిఫాబాద్‌లో దళిత మహిళను అత్యాచారం చేసి చేతి వేళ్లు నరికేశారు. అయినా కేసీఆర్ నోరు మెదపడం లేదు. ఎందుకు కేసీఆర్ నోరు మెదపట్లేదు? గుండె రాయిగా మారిందా? మత్తుతో మెదడు మొద్దుబారిపోయిందా?’’ అని షర్మిల నిలదీశారు.
‘‘వైఎస్ హాయాంలో సిద్దిపేట జిల్లాలో భూపంపిణీ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక కలెక్టరేట్ కట్టాలని దళితుల భూములను లాగేసుకున్నారు. రైతు వేదిక కట్టేందుకు కూడా దళితుడి భూమినే లాగేసుకున్నారు. కేసీఆర్ భూములు ఎందుకు ఇవ్వలేడు? ఇప్పుడు పేదలు, దళితుల భూములే ఎందుకు లాక్కుంటున్నారు ఇప్పుడు భూ బ్యాంకులు పెడుతున్నారు. వేల ఎకరాలు జమ చేయడమే భూ బ్యాంకు. పెద్ద దొర కేసీఆర్, చిన్న దొర కేటీఆర్ ఇలా భూములను జమ చేసి తమ బినామీలకు అప్పనంగా ఇచ్చేస్తున్నారు. మీరు ఎంత భూమి స్వాహా చేస్తే మీ కడుపు నిండుతుంది? మీ దురాశకు హద్దుల్లేవా? ఏం చేయాలనుకుంటున్నారు తెలంగాణను? దళితులకు భూములు ఇవ్వాలంటే.. భూసేకరణ ఉండాలి కదా? ఆ దిశగా ప్రయత్నాలు జరగడం లేదు.’’ అని షర్మిల అన్నారు.
తిరుమలగిరిలో వైఎస్ షర్మిల దళిత భేరి బహిరంగ సభ ప్రారంభమైంది. ఈ సభలో వైఎస్ షర్మిల మాట్లాడుతున్నారు.
గుజరాత్‌కు కొత్త ముఖ్యమంత్రిని ఖరారు చేశారు. భూపేంద్ర పటేల్‌ను ముఖ్యమంత్రిగా బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఘట్లోడియా నియోజకవర్గం నుంచి ఈయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మాజీ సీఎం విజయ్ రూపానీ భూపేంద్ర పటేల్ పేరును సూచించారని తెలుస్తోంది. చివరి వరకు నితిన్ పటేల్ రేసులో నిలిచినా ఆయనకు నిరాశే ఎదురైంది. మాజీ సీఎం విజయ్ రూపానీ శనివారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
హీరో సాయి ధరమ్ తెేజ్ కు కాలర్ బోన్ సర్జరీ చేసినట్లు అపోలో వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ప్రకటించారు. కోలుకుంటే వెంటిలేటర్ తీసేస్తామన్నారు. మరో 24 గంటలు వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతామని తెలిపారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సాయి ధరమ్ తేజ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయనకు జూబ్లిహిల్స్ అపోలో లో చికిత్స అందిస్తున్నారు.
గణేశ్ విగ్రహాల నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు ఆంక్షలపై రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రివ్యూ పిటిషన్ వేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. హైకోర్టు పెద్ద మనసు చేసుకొని ఈ ఏడాదికి యథావిధిగా నిమజ్జనం చేసేలా అవకాశం కల్పించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణను రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుందన్నారు. నిమజ్జనం అనంతరం 48 గంటల్లో వ్యర్థాలు తీసేస్తామని తెలిపారు. వినాయక చవితి పండుగకి ముందు రోజు నిమజ్జనాలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని తలసాని అన్నారు. అప్పటికే విగ్రహాలు మండపాలకు చేరిపోయాయన్నారు. ఇప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అసాధ్యమని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో కుంటల ఏర్పాటు ఇబ్బందన్న ఆయన. హైకోర్టు క్షేత్రస్థాయి పరిస్థితిని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
సీనియర్ నేత కొలను హన్మంత్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. ఈ నెల 17న గజ్వేల్ సభలో కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు హన్మంత్ రెడ్డి వెల్లడించారు. ఈనెల 17న రేవంత్ రెడ్డి సభకు హాజరుకానున్నట్లు సమాచారం. హన్మంత్ రెడ్డి 2014లో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీలో చేరారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆదివారం కాకతీయ గేట్ నుంచి పాత గాజువాక వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో అఖిలపక్షాలు, కార్మిక, నిర్వాసిత సంఘాలు, స్థానికులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి పాదయాత్రను ప్రారంభించారు
వంట నూనె ధరలపై కేంద్రం తీపి కబురు చెప్పింది. పండగల సీజన్‌లో వంట నూనెల ధరలను కట్టడి చేసేందుకు, వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా నిర్ణయం తీసుకుంది. దిగుమతి సుంకాన్ని తగ్గించింది. శనివారం నుంచి అమలులోకి వచ్చిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తాజా నిర్ణయంతో ముడి పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని 10 శాతం నుంచి 2.5 శాతాని తగ్గించింది. ముడి సోయాబీన్, పొద్దుతిరుగుడు నూనెలపై 7.5 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించింది. దీంతో దిగుమతి సుంకం సహా అన్ని రకాల పన్నులు కలిపి ఈ మూడు రకాల ముడి నూనెలపై 24.75 శాతానికి, రిఫైన్డ్ ఆయిల్ రకాలపై 35.75 శాతానికి పరిమితం చేసింది. దీంతో ఒక్కో లీటరు నూనె ధర రూ.4 నుంచి రూ.5 వరకు తగ్గే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం దాదాపు రూ.1100 కోట్ల ఆదాయాన్ని కోల్పోతుందని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది.
తిరుమల శ్రీవారిని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో అరూప్ గోస్వామి దంపతులు స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. దర్శనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం చేయగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేెశారు..
గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తన పదవికి రాజీనామా చేయడంతో ఆ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. వచ్చే ఏడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో సీఎం పదవికి విజయ్ రూపానీ రాజీనామా రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. శనివారం మధ్యాహ్నం గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌కు విజయ్ రూపానీ తన రాజీనామా లేఖను పంపారు. అయితే కేంద్రమంత్రులు ప్రహ్లాద్ జోషి.. తోమర్ ఇవాళ గుజరాత్ రానున్నారు. ఎమ్మెల్యేలతో సమావేశ కానున్నట్టు తెలుస్తోంది.
యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్ లో 18 ఏళ్ల బ్రిటిష్ యువకెరటం ఎమ్మా రదుకాను చరిత్ర సృష్టించింది. ఫైనల్స్ లో 19 ఏళ్ల లెలా ఫెర్నాండెజ్‌ను (కెనడా) 6-4, 6-3 తేడాతో వరుస సెట్లలో ఓడించింది. ఎమ్మా రదుకాసు తన తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను గెలుచుకుంది.
Background
గుంటూరు జిల్లా బాపట్లలో కారు ప్రమాదం జరిగింది. కాలువలోకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో కారులో ఎనిమిది మంది ఉన్నట్లు తెలుస్తోంది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -