Breaking News: రెండేళ్ల కన్న కొడుకును గొంతు కోసి హత్య చేసిన తండ్రి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 17న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 17 Sep 2021 06:53 PM
ఎవరికి భయపడుతున్నారు?: అమిత్ షా

తెలంగాణ విమోచన దినం ఎందుకు జరపరు. అటు మహారాష్ట్ర అధికారికంగా జరుపుకుంటోంది. కర్ణాటక కూడా జరుపుతోంది. కానీ తెలంగాణలో మాత్రం విమోచన దినం జరపడం లేదు. మీరు ఎవరికి భయపడుతున్నారు చెప్పండి? ముఖ్యమంత్రి గారూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన ఆదివాసీలు మీకు గుర్తు లేరా? వారి త్యాగం ఒట్టిగా పోదు. మేం 2024లో అధికారంలోకి వచ్చాక తెలంగాణ విమోచన దినం జరిపి తీరుతాం’’ అని అమిత్ షా ప్రసంగిస్తున్నారు.

బీజేపీ ప్రభుత్వం వచ్చాక అధికారికంగా విమోచన దినం: అమిత్ షా

‘‘తెలంగాణ ప్రజలందరికీ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ ప్రధాని మోదీ పుట్టిన రోజు కూడా. మన నినాదం నిర్మల్ నుంచి హైదరాబాద్ వరకూ వినిపించాలి. ఆపరేషన్ పోలో కూడా ఇవాళే సమాప్తమైంది. 13 నెలల తర్వాత ఆలస్యంగా తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చింది. 2021 తర్వాత తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఆ వెంటనే అధికారికంగా హైదరాబాద్ సంస్థానం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతాం. మజ్లిస్ పార్టీకి బీజేపీ పార్టీ భయపడదు. ఈరోజు సర్దార్ పటేల్ పరాక్రమం కారణంగా విమోచనం జరిగింది.’’ అని అమిత్ షా ప్రసంగించారు.

ఈటల రాజేందర్‌పై ప్రత్యేక మక్కువ చూపిన అమిత్ షా

నిర్మల్ బీజేపీ బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగం మొదలైంది. తొలుత రాష్ట్ర బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ సహా అందరి పేర్లను ప్రస్తావించిన అమిత్ షా.. ఈటల రాజేందర్ విషయంలో కాస్త ప్రత్యేకత చూపారు. ఆయన పేరు పలికే క్రమంలో ‘‘ఇలా రండి.. రాజేందర్ జీ.. రండి.. రండి.. మేరా భాయ్’’ అని అన్నారు.

నా వయసు మోదీ, అమిత్ షాకు ట్రాన్స్‌ఫర్ చేయాలని అమ్మవారికి మొక్కుకున్నా: బండి సంజయ్

‘‘మోదీ, అమిత్ షా లేని భారత దేశాన్ని ఎవరూ ఊహించలేరు. వారు నిర్మల్‌కు రావడం చాలా సంతోషం. నాకు ఒక్కసారి అమిత్ షాను ముట్టుకోవాలని అనిపిస్తుంది. ఆయన ధైర్యం నాకు రావాలని అనిపిస్తుంది. నాకు 55 సంవత్సరాలు. ఒకవేళ వయసు ట్రాన్స్‌ఫర్ చేసే ఛాన్స్ ఉంటే నా వయసును కూడా మోదీ, అమిత్ షాకే ఇవ్వాలని నేను అమ్మవారికి మొక్కుకున్నా’’ అని బండి సంజయ్ ప్రసంగించారు.

కేసీఆర్ అవినీతి చరిత్ర పాఠ్యాంశాల్లో చేరుస్తాం

‘‘సర్దార్ పటేల్ లేకుండా హైదరాబాద్ పాకిస్థాన్‌లో కలిసేది. ఆయనే లేకుంటే తెలంగాణ ఏర్పడేదే కాదు. కేసీఆర్‌కు ముఖ్యమంత్రి పదవే వచ్చేది కాదు. నా సర్దార్ పటేల్ చరిత్రను నువ్వు మరుగున పడేలా చేస్తాడా? వీరుల చరిత్రను తెరమరుగు చేయడమే సీఎం లక్ష్యం. తప్పకుండా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తాం. నీ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తాం. ముఖ్యమంత్రి నీచమైన చరిత్రను కూడా పాఠ్యాంశాల్లో చేరుస్తాం. ఇలాంటివాళ్లు ఉంటే తీవ్రమైన నష్టం. రాబోయేది తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం. అమిత్ షా నాయకత్వంలో తెలంగాణలో కాషాయ జెండాను ఎగరవేసే బాధ్యత మాది.’’ అని బండి సంజయ్ ప్రసంగించారు.

రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చండి

తెలంగాణ విమోచన దినం ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జెండా ఎగరేయకపోవడం ఏంటి? ఫాం హౌస్‌లో పడుకుంటారా? ఇదే అసెంబ్లీలో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్‌ను కేసీఆర్ అవమానించాడు. తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవాన్ని సీఎం ఎందుకు జరిపించడం లేదు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లారా? మీ ఒంట్లో నెత్తురు ప్రవహిస్తే ముందుకొచ్చి కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చండి. కర్ణాటక, మహారాష్ట్రలో విమోచన దినాన్ని చక్కగా జరుపుకుంటారు. కానీ, కేసీఆర్ తెలంగాణను మూడు ముక్కలు చేసి ఒవైసీకి, కొడుకుకు, అల్లుడికి ఇచ్చాడు’’ అని బండి సంజయ్ ఆవేశంతో మాట్లాడారు.

నిర్మల్‌లో అమిత్ షా

నిర్మల్‌లో జరుగుతున్న బీజేపీ బహిరంగ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నేతలు ప్రసంగిస్తున్నారు. బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణ విమోచన దినాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్వహించకపోవడాన్ని తప్పుబట్టారు. 

పాఠశాల పైకప్పు పెచ్చులూడి విద్యార్థికి గాయాలు

నాడు- నేడు కింద బడులను అభివృద్ధి చేసి నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతుంది. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని జెడ్పీ సెంట్రల్ హైస్కూల్ స్కూల్ పైకప్పు పెచ్చులుడి 10వ తరగతి చదువుతున్న జి. సాయి జశ్వంత్ తల మీద పడింది. దీంతో విద్యార్థి తలకు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అక్కడున్న ఉపాధ్యాయులు విద్యార్థిని హుటాహుటిన ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

తెలుగు రాష్ట్రాలకు కొత్త సీజేలు

తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు నూతన సీజేలను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు పంపింది. తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాను నియమించాలని సూచించింది. తెలంగాణ హైకోర్టు సీజేగా పనిచేసిన జస్టిస్‌ హిమా కోహ్లీ పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్లారు. ఆమె స్థానంలో తాత్కాలిక సీజేగా జస్టిస్‌ ఎం.ఎస్‌ రామచంద్రరావు బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ హైకోర్టుకు తాత్కాలిక సీజే ఉన్న నేపథ్యంలో పూర్తిస్థాయి సీజేగా జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మను నియమించేందుకు కొలీజియం సిఫార్సు చేసింది. ఏపీ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్‌ ఏకే గోస్వామిని ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టుకు బదిలీ చేసి ఆయన స్థానంలో ఛత్తీస్‌గఢ్‌ సీజే జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాను ఏపీకి నియమించాలని కొలీజియం సూచించింది.

చంద్రబాబుపై హత్యాయత్నం చేశారు : పట్టాభి

టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై జరిగిన దాడిపై టీడీపీ నేతల తీవ్రంగా స్పందించారు. టీడీపీ నేత పట్టాభి మాట్లాడుతూ చంద్రబాబుపై హత్యాయత్నం చేశారని ఆరోపించారు. ఈ ఘటనపై కేసు పెడతామని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ పెట్టిన పోస్టుపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. దాడి జరుగుతుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.  టీడీపీ నేతల ధర్నాలు చేస్తుంటే ముందస్తు అరెస్టులు చేసే పోలీసులు... దాడి జరుగుతుంటే ఎందుకు రాలేదని పట్టాభి ప్రశ్నించారు. 

కాకినాడ నగర పాలక మేయర్ పై అవిశ్వాస తీర్మానం

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నగరపాలక సంస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్న మేయర్ సుంకర పావనిపై 33 మంది కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం జిల్లా కలెక్టర్ సి. హరి కిరణ్ కు గురువారం అందించారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన వారిలో అత్యధికంగా టీడీపీ నుంచి ఎన్నికైన కార్పోరేటర్లు ఉండడం విశేషం. 2018లో 50 వార్డులకు 48 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించారు. వీరిలో 2017 లో ముగ్గురు మృతి చెందగా మరొకరు రాజీనామా చేశారు. దీంతో 44 వార్డులకు కార్పొరేటర్లు  ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో 2017 సెప్టెంబర్ 17న కాకినాడ మేయర్ గా సుంకర పావని ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నెల 17వ తేదీతో నాలుగేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో మేయర్ రాజీనామా చేయాలన్న వాదనలు వినిపించాయి. అయితే ఆమె రాజీనామా చేసేందుకు ముందుకు రాకపోవడంతో తాజాగా వైసీపీ నుంచి ఎనమండుగురు, ఇండిపెండెంట్లు ఇద్దరు,  బీజేపీ నుంచి మరో ఇద్దరు తో పాటు 21 మంది టీడీపీ కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానాన్ని కలెక్టర్ కు అందించారు.  డిప్యూటీ మేయర్-2 చోడపల్లి ప్రసాద్ నేతృత్వంలో కలెక్టర్ ను సంప్రదించిన బృందానికి కలెక్టర్ నుంచి నిర్దిష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు. కాగా త్వరలోనే ప్రిసైడింగ్ అధికారిని ఏర్పాటు చేసి ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారని తెలిపారు. 

వైసీపీ నేతలకు పోలీసులు వత్తాసు పలికారు : బుద్ధా వెంకన్న

సమాచారం లేకుండా వైసీపీ నేతలు ఆందోళనకు వచ్చారని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. వైసీపీ నేతలు తమపై దౌర్జన్యం చేశారన్నారు. వైసీపీ నేతలు తనపై దాడి చేశారన్నారు. జగన్‌ సర్కారు దౌర్జన్యానికి ఇది పరాకాష్ఠ అని ఆరోపించారు.  పోలీసులు వైసీపీ నేతలకే వత్తాసు పలికారన్నారు.  

ఉండవల్లిలో ఉద్రిక్తత... జోగి రమేష్ ను అదుపులో తీసుకున్న పోలీసులు

వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉండవల్లిలో చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. అయ్యన్న పాత్రుడు సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలపై జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన తెలిపేందుకు చంద్రబాబు ఇంటి వద్దకు వచ్చేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో అక్కడ ఉన్న టీడీపీ నేత బుద్ధా వెంకన్న, జోగి రమేష్ మధ్య తోపులాట జరిగింది.

చంద్రబాబు ఇంటి దగ్గర ఉద్రిక్తత... టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

గుంటూరు జిల్లా ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు ఇంటిని ముట్టడించేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నించాయి. దీంతో టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట జరిగింది. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ మధ్య వాగ్వాదం జరిగింది. అయ్యన్నపాత్రుడు సీఎం జగన్ పై చేసిన కామెంట్స్ పై జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్న క్షమాపణ చెప్పాలని జోగి రమేష్ డిమాండ్ చేశారు. ఇరువర్గాలకు సర్ధిచెప్పేందుకు పోలీసులు పరిశీలిస్తున్నారు. టీడీపీ, వైసీపీ నేతలు కర్రలతో దాడులు చేసుకున్నారు. చంద్రబాబు పిరికిపందలా దాక్కొన్నారని జోగి రమేష్ ఆరోపించారు. చంద్రబాబును రాష్ట్రం నుంచి తరిమేస్తామని ఆయన అన్నారు. చంద్రబాబు ఇంట్లో ఉన్నట్లు తెలుస్తోంది. 

పంచాయతీ సిబ్బందిపై పెట్రోల్ తో దాడి

అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలో పంచాయతీ సిబ్బందిపై పెట్రోల్ దాడి జరిగింది. సర్పంచ్ భర్త శ్రీ రాములు, ఉప సర్పంచ్ కాసా   చంద్రమోహన్, పంచాయతీ సిబ్బందిపై పందుల యజమానులు పెట్రోల్ తో దాడి చేశారు. ఈ ఘటనపై పంచాయతీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు... తాజాగా 34 వేల కొత్త కేసులు

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 34,403 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 3.33 కోట్లకు చేరింది. 3.25 కోట్ల మందికిపైగా కరోనా నుంచి కోలుకున్నారు. నిన్న ఒక్కరోజే 37,950 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. నిన్న 320 మంది కరోనా వల్ల మరణించారు. దీంతో  ఇప్పటివరకు 4.4 లక్షల మందికి పైగా చనిపోయారు

ఈడీ విచారణకు హాజరైన నటుడు తనీష్

హైదరాబాద్‌ లో ఈడీ విచారణకు నటుడు తనీష్ హాజరయ్యారు. మనీలాండరింగ్‌ కేసులో తనీష్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. తనీష్ బ్యాంకు ఖాతాల లావాదేవీలు ఈడీ పరిశీలించనుంది. 

పెద్దఅంబర్ పేట్ అగ్నిప్రమాదం.. కెమికల్ గోదాములో భారీగా మంటలు

రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. స్వాల్ కార్పొరేషన్ లిమిటెడ్ పరిశ్రమ గోదాములో మంటలు చెలరేగాయి. గోదాము నుంచి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. 

మద్యం మత్తులో ఘర్షణ.. ఒకరు మృతి

మద్యం మత్తులో ఇద్దరు యువకుల మధ్య చెలరేగిన ఘర్షణలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గుడివాడ రైల్వే స్టేషన్ వద్ద చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన రాపానీ యేసు, బత్తుల సాయికుమార్​ అనే ఇద్దరు యువకులు నిన్న రాత్రి మద్యం సేవించారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మాటలతో మొదలైన గొడవ.. ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో సాయికుమార్‎పై యేసు గొడ్డలితో దాడి చేశాడు. దీంతో సాయికుమార్‎కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. సాయికుమార్ మరణించాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన

తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం యాదాద్రిలో ప‌ర్య‌ట‌ించనున్నారు. చిన్న జీయర్ స్వామితో కలిసి యాదాద్రిలో పర్యటించనున్నారు.  ఈ ఏడాది అక్టోబ‌ర్, న‌వంబ‌ర్ మాసాల్లో యాదాద్రి పుణ్యక్షేత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం ఉండే అవ‌కాశం ఉందని తెలుస్తోంది. ఇటీవ‌ల దిల్లీ ప‌ర్యట‌న‌కు వెళ్లిన సీఎం కేసీఆర్ యాదాద్రి ఆల‌య ప్రారంభోత్సవానికి రావాల‌ని ప్రధాని మోదీని ఆహ్వానించారు. ఇవాళ్టి పర్యటనలో యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహా స్వామి వారి ఆలయ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసేలా అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. 

ముంబయి బాంద్రాలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్

ముంబయి బాంద్రాలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కుప్పకూలింది. ఈ ఘటన జరిగిన సమయంలో కొంత మంది కూలీలు అక్కడ ఉన్నట్లు తెలుస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున 4.40 గం.లకు ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన 9 మంది కూలీలను స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. 

Background

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 17న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.