Bihar: ఇద్దరు విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో అక్షరాలా రూ.900 కోట్లు!.. ఎలా వచ్చాయో తెలుసా?
బిహార్‌లో ఇద్దరు పిల్లల అకౌంట్లో దాదాపు రూ.900 కోట్లు జమయ్యాయి. ఈ వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది.
రెండు అకౌంట్లు.. రూ.900 కోట్లు.. ఇద్దరు పిల్లలు..! ఏంటి ఈ స్టోరీ అనుకుంటున్నారా?. ఇది కథ కాదు. బిహార్‌లో ఇద్దరు స్కూల్ విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో అక్షరాలా రూ.900 కోట్లు జమయ్యాయి. స్కూల్ పిల్లలేంటి.. వాళ్ల అకౌంట్లో అంత డబ్బు జమవడమేంటి? అని డౌట్ కొడుతుందా? అయితే ఇది చదవాల్సిందే.
ఇదీ జరిగింది?
ఉత్తర బిహార్ గ్రామీణ ప్రాంతంలో ఇద్దరు పిల్లల బ్యాంకు ఖాతాలకు భారీ మొత్తంలో డబ్బు జమ అయింది. ఈ వార్త తెలిసి కుటుంబ సభ్యులే కాదు ఊరంతా షాకైంది. గురుచంద్ర విశ్వాస్, అసిత్ కుమార్ అనే ఇద్దరు విద్యార్థులు ఆరవ తరగతి చదువుతున్నారు. కటిహార్ జిల్లా బాగౌరా పంచాయితీలో పస్త్య గ్రామంలో ఈ పిల్లలు చదువుకుంటున్నారు.
పాఠశాల యూనిఫామ్‌ల కోసం రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో కొంత డబ్బు డిపాజిట్ చేసింది. ఈ పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల అకౌంట్లో డబ్బు గురించి తెలుసుకునేందుకు ఎస్‌బీఐ బ్యాంకుకు వెళ్లారు. కానీ, వారిద్దరి బ్యాంకు అకౌంట్లో రూ.900 కోట్ల నగదు ఉందని తెలిసి బ్యాంకు అధికారులతో సహా విద్యార్థుల తల్లిదండ్రులు షాకయ్యారు. ఇద్దరు విద్యార్థుల్లో ఒకరికి ఉత్తర బిహార్ గ్రామీణ బ్యాంకులో అకౌంట్ ఉంది. విశ్వాస్ అకౌంట్లో రూ. 60 కోట్లు ఉండగా.. అసిత్ కుమార్ అకౌంట్లో రూ. 900 కోట్లు ఉన్నాయట.
సాంకేతిక లోపం..
బ్రాంచ్ మేనేజర్ మనోజ్ గుప్తా వారి అకౌంట్లను పరిశీలించి ఆశ్చర్యపోయారు. వెంటనే డబ్బు విత్ డ్రా చేయకుండా అకౌంట్ ఫ్రీజ్ చేసేశారు. అలాగే కోట్ల రూపాయల నగదు వారి అకౌంట్లలోకి ఎలా క్రెడిట్ అయిందో విచారణకు ఆదేశించారు. విచారణలో సాంకేతిక లోపం వల్లే భారీ నగదు క్రెడిట్ అయినట్టు గుర్తించారు.