Rahul Gandhi: రాహుల్ గాంధీకి తిరిగి అదే బంగ్లా కేటాయిస్తారా! పార్లమెంట్ హౌసింగ్ కమిటీని కోరనున్న నేత
Rahul Gandhi: తుగ్లక్ రోడ్ లో గతంలో ఆయన నివాసం ఉన్న ఇంటిని తిరిగి కేటాయించాల్సిందిగా రాహుల్ గాంధీ పార్లమెంట్ హౌసింగ్ కమిటీని కోరనున్నారని తెలుస్తోంది.
రాహుల్ గాంధీపై అనర్హత వేటు తొలగిపోవడంతో గతంలో ఆయన నివాసం ఉన్న ఇంటిని తిరిగి కేటాయించాలని కోరుతూ పార్లమెంట్ హౌసింగ్ కమిటీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రంజన్ చౌదరి లేఖ రాశారు. దీంతో ప్రస్తుతం రాహుల్ గాంధీకి ఏ ఇల్లు కేటాయిస్తారో అనే అంశంపై చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మోదీ ఇంటి పేరు వివాదానికి సంబంధించిన పరువునష్టం కేసులో అనర్హత వేటు తొలగిపోవడంతో ఆయన సోమవారం లోక్ సభ లో తిరిగి అడుగు పెట్టారు. లోక్ సభకు హాజరైన ఆయన సభలో హుషారుగా కనిపించారు. మంగళవారం పార్లమెంట్లో అవిశ్వాసంపై చర్చ జరగనుంది. మణిపుర్ అంశం కావడం... పైగా అక్కడ రాహుల్ గాంధీ పర్యటించి ఉండటంతో వాస్తవాల ఆధారంగా కేంద్రాన్ని ఆయన నిలదీస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
ఎంపీగా ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించిన క్రమంలో గతంలో ఆయన ఖాళీ చేసిన ఇంటిని తిరిగి ఆయనకు అప్పగిస్తారా? లేదా? అనేదానిపై సందిగ్దత నెలకొంది. రాహుల్ పై అనర్హతను ఎత్తివేస్తూ లోక్ సభ సచివాలయం నోటిఫికేషన్ జారీ చేసిన సందర్భంగా తుగ్లక్ రోడ్ లో గతంలో ఆయన నివాసం ఉన్న ఇంటిని తిరిగి కేటాయించాల్సిందిగా రాహుల్ గాంధీ తరపున కాంగ్రెస్ నేత నేత అధీర్ రంజాన్ చౌదరి పార్లమెంటు హౌసింగ్ కమిటీకి లేఖ రాశారు. కానీ నిబంధనల ప్రకారం... రాహుల్ గాంధీ స్వయంగా లేఖ రాస్తేనే ఇంటిని కేటాయించే అంశాన్ని పరిశీలిస్తామని పార్లమెంటు హౌసింగ్ కమిటీ సూచించినట్లు సమాచారం.
అసలు ఏం జరిగిందంటే....
పరువు నష్టం కేసులో సూరత్ సెషన్స్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. పార్లమెంటు నిబంధన ప్రకారం లోక్ సభ సెక్రటేరియట్ ఆయనపై మార్చి 4న అనర్హత వేటు వేసింది. ఈ క్రమంలో ఇటీవల ఆయన అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి 10 జన్ పథ్ రోడ్డులోని తన తల్లి సోనియా గాంధీ ఇంట్లో ఉంటున్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీకి అండగా నిలిచి కేంద్రంపై ఆరోపణలతో విరుచుకుపడ్డారు. అయితే రాహుల్ మాత్రం నిబంధనలకు అనుగుణంగా తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి అధికారులకు అప్పగించారు. రాహుల్ ఆ ఇంటిని ఖాళీ చేసిన తర్వాత ఇప్పటివరకు దానిని ఎవరికి కేటాయించలేదు. తిరిగి రాహుల్ గాంధీకి ఆ ఇంటిని ఇస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కానీ ఈ విషయంలో ప్రభుత్వ వర్గాల నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ప్రస్తుతం సందిగ్ధత నెలకొంది. రాహుల్ గాంధీ గతంలో తాను నివాసం ఉన్న బంగ్లా తిరిగి తనకు కేటాయించాలని మంగళవారం పార్లమెంటు హౌసింగ్ కమిటీని కోరే అవకాశం ఉంది. కమిటీ సూచన మేరకు స్వయంగా లేఖ ద్వారా కొన్ని రోజుల కిందట తాను ఖాళీ చేసిన అధికారిక నివాసాన్ని కేటాయించాలని రిక్వెస్ట్ చేయనున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే మంగళవారం అవిశ్వాసం తీర్మానంపై చర్చలకు ఇండియా కూటమి అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంది. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ పై ప్రశ్నల వర్షం కురిపించాలని, అందులోనూ కీలక సమయంలో రాహుల్ సభకు రావడంతో కాంగ్రెస్ నేతల్లో జోష్ కనిపిస్తోంది.