Presidential Polls Live: ముగిసిన రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్
Presidential Polls Live: రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ ప్రారంభమైంది. వివిధ రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎమ్మెల్యేలు ఓటింగ్‌లు పాల్గొంటున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. రాష్ట్రపతి ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణ అసెంబ్లీలో ఆయన ఓటు వేశారు.
కేంద్రమంత్రులు మన్సుఖ్ మాండవీయ, హర్దీప్ సింగ్ పురీ రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేశారు. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. రాష్ట్రపతి ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఎన్డీఏ తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్‌ఖడ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమలో ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్రమంత్రులు పాల్గొన్నారు.
రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌లో కేరళ సీఎం పినరయి విజయన్, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజ్యసభలో విపక్షాల ఆందోళన చేశాయి. దీంతో రాజ్యసభ మంగళవారానికి వాయిదా పడింది.
ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే రాష్ట్రపతి ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. పార్లమెంటులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ పార్లమెంటుకు వచ్చి రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్‌లో పాల్గొన్నారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ రాష్ట్రపతి ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయా రాష్ట్రాల అసెంబ్లీలలో రాష్ట్రపతి ఓటింగ్‌లో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్, ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గుజరాత్‌లోని గాంధీనగర్‌లో సీఎం భూపేంద్ర పటేల్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అసెంబ్లీలో తొలి ఓటు వేశారు.
పార్లమెంట్ ప్రాంగణంలో ఓటింగ్ మొదలైన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు వేశారు. ఆ తర్వాత పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సోమవారం ఉదయం ఏపీ అసెంబ్లీకి వచ్చిన జగన్ తన ఓటు వేశారు.
Background
Presidential Polls Live:
రాష్ట్రపతి ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓటర్లుగా ఉండే ఈ ఎన్నికలు, సాధారణ ఎన్నికలతో పోలిస్తే భిన్నంగా ఉంటాయి. ఆయా రాష్ట్రాల అసెంబ్లీలనే పోలింగ్ కేంద్రాలుగా మార్చి, రాష్ట్రపతిని బ్యాలెట్ పద్ధతిలో ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటారు. అయితే ఈ ఓటింగ్ ప్రక్రియ ఎలా జరగనుంది,ఎమ్మెల్యే, ఎంపీల ఓటు విలువ ఎంత? వారి ఓటును ఎలా గుర్తిస్తారనేది చాలా మందికి తెలియని విషయం. బ్యాలెట్ విధానంలో జరిగే ఈ ఎన్నికలో ఎమ్మెల్యేలు, ఎంపీలే ఓటర్లుగా ఉంటారు.
ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాన్ని బట్టి ఎమ్మెల్యేలు, ఎంపీలు విభిన్న ఓటు విలువ కలిగి ఉంటారు. ఎంపీలు, ఎమ్మెల్యేల ఓటును గుర్తించేందుకు వీలుగా రెండు రకాల బ్యాలెట్ పేపర్లలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకు అనుగుణంగా ఆకుపచ్చ, పింక్ రంగులతో బ్యాలెట్ పేపర్లు ఉంటాయి.
ఆకుప్చ, పింక్ పేపర్లు
ఆకుపచ్చ బ్యాలెట్ పేపర్లో ఎంపీలు, పింక్ పేపర్లో ఎమ్మెల్యేలు తమ ఓటును వేయనున్నారు. బ్యాలెట్ పేపర్ రంగు ద్వారా అది ఏ ప్రజాప్రతినిధిదో గుర్తించి వారికి ఉన్న ఓటు విలువ పరిగణలోకి తీసుకుంటారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీల ఓటు విలువలను 1971 జనాభా లెక్కల ప్రకారం నిర్థారిస్తారు. జనాభా, శాసనసభ స్థానాలను బట్టి ఆయా రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు విలువ మారుతుంటుంది. దీని ప్రకారం యూపీకి చెందిన సగటు ఎమ్మెల్యే ఓటు విలువ 208 కాగా ఝార్ఖండ్-తమిళనాడు రాష్ట్రాల ఎమ్మెల్యే ఓటు విలువ 176గా ఉంది. అలాగే మహారాష్ట్రలో 175, సిక్కిం 7, మిజోరాం 8, నాగాలాండ్‌లో 9గా ఎమ్మెల్యే ఓటు విలువ ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే ఓటు విలువ 159 కాగా, తెలంగాణ ఎమ్మెల్యే ఓటు విలువ 132గా ఉంది. సగటు ఎంపీ ఓటు విలువ 700గా ఉంది. దేశంలో ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎంపీల సంఖ్య 4,809 కాగా వారి ఓటు విలువ మొత్తంగా 10,86,431గా ఉంది. ఇందులో మెజారిటీ ఓట్లు సాధించిన అభ్యర్థి రాష్ట్రపతిగా ఎన్నికవుతారు.
అభ్యర్థులు
- ఎన్డీఏ (NDA) – ద్రౌపది ముర్ము
- విపక్షాలు – యశ్వంత్ సిన్హా
రాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారు?
- ఎలక్టోరల్ కాలేజీ ద్వారా రాష్ట్రపతిని ఎన్నుకుంటారు.
- ఇందులో లోక్‌సభ, రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు ఉంటారు.
- అలానే ప్రతి రాష్ట్ర అసెంబ్లీ, ఎన్సీటీ (దేశ రాజధాని ప్రాంతం) దిల్లీ, పుదుచ్చేరి అసెంబ్లీలకు ఎన్నికైన సభ్యులు ఉంటారు.
- ఈ ఎలక్టోరల్ కాలేజీలో నామినేటెడ్ సభ్యులు ఉండరు.
ఎలక్టోరల్ కాలేజీ:
మొత్తం ఎంపీ, ఎమ్మెల్యేలు | |
హౌస్ | సభ్యులు |
లోక్‌సభ (Lok Sabha) | 543 |
రాజ్యసభ (Rajya Sabha) | 233 |
ఎమ్మెల్యే (రాష్ట్ర అసెంబ్లీ, State Assembly) | 4,033 |
మొత్తం | 4,809 |
మొత్తం ఓట్ల విలువ
మొత్తం ఓట్ల విలువ | |||
హౌస్ | సభ్యులు | ఒక ఓటు విలువ | మొత్తం ఓట్ల విలువ |
లోక్‌సభ (Lok Sabha) | 543 | 700 | 3,80,100 |
రాజ్యసభ (Rajya Sabha) | 233 | 700 | 1,63,100 |
మొత్తం ఎంపీలు (లోక్+రాజ్యసభ) | 776 | 700 | 5,43,200 |
ఎమ్మెల్యే (రాష్ట్ర అసెంబ్లీ, State Assembly) | 4,033 | ఆయా రాష్ట్రల బట్టి తేడా ఉంటుంది | 5,43,231 |
మొత్తం | 4,809 | 10,86,431 |
- - - - - - - - - Advertisement - - - - - - - - -