KTR News: ప్రభుత్వ శ్వేతపత్రం తప్పుల తడక, అబద్ధాల పుట్ట: కేటీఆర్, స్వేదపత్రం విడుదల
BRS News: కోట్లమంది చెమటతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్న తీరును వివరించేందుకే ప్రస్తుతం 'స్వేద పత్రం' విడుదల చేస్తున్నామని కేటీఆర్ ఆన్నారు.
KTR in Telangana Bhavan: ప్రభుత్వ శ్వేతపత్రం తప్పుల తడక అని, అది అబద్ధాల పుట్ట అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. కోట్లమంది చెమటతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్న తీరును వివరించేందుకే ప్రస్తుతం 'స్వేద పత్రం' విడుదల చేస్తున్నామని కేటీఆర్ (KTR) ఆన్నారు. తొమ్మిదిన్నరేళ్ల పాలనపై ‘స్వేదపత్రం’ పేరిట తెలంగాణ భవన్ లో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. "కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పాలనను బద్నాం చేసేలా కొంత ప్రయత్నం చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం చేసిన ఆరోపణలకు, విమర్శలకు దీటుగా సమాధానం చెప్పాం. మాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చివరకు వాయిదా వేసుకుని పోయారు. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం తప్పుల తడక.. అబద్ధాల పుట్ట" అని కేటీఆర్ (KTR) విమర్శించారు.
తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పాటు అయిన తర్వాత పాలన విధ్వంసం నుంచి వికాసం వైపు మళ్లిందని కేటీఆర్ (KTR) అన్నారు. అంతకుముందు అన్ని రంగాల్లో తెలంగాణపై వివక్ష నెలకొని ఉంటే.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక దాన్ని పారద్రోలామని అన్నారు. ఎన్నో పోరాటాల తర్వాత ప్రత్యేక రాష్ట్రం కల సాకారమైందని.. ఇప్పుడు కొందరు కాంగ్రెస్ నేతలు తమ వల్లే తెలంగాణ వచ్చిందని చెప్తున్నారని అన్నారు. తొలినాళ్లలో ఉన్న సవాళ్లను గురించి కేటీఆర్ (KTR) గుర్తు చేశారు. రాష్ట్ర స్థూల రుణం రూ.3.17 లక్షల కోట్లు కాగా.. దీన్ని కాంగ్రెస్ నేతలు రూ.6.70 లక్షల కోట్లుగా చూపించే ప్రయత్నం చేశారని కేటీఆర్ (KTR) తప్పుబట్టారు. తాము రాష్ట్రంలో ఎక్కువ వేతనాలు, ఉద్యోగాలు ఇచ్చి చెప్పుకోలేకపోయామని కేటీఆర్ అన్నారు.
రావాల్సిన డబ్బులను అప్పుగా చూపించడం కరెక్టు కాదు - కేటీఆర్ (KTR)
ప్రభుత్వం వివిధ ప్రభుత్వ సంస్థలకు గ్యారంటీ ఇచ్చిన రుణాలను, గ్యారంటీ ఇవ్వని రుణాలను కూడా అప్పుల జాబితాలో కాంగ్రెస్ నేతలు చూపారని అది సరికాదని కేటీఆర్ (KTR) అన్నారు. రాష్ట్రానికి స్థూలంగా ఉన్న రుణాలు రూ.3,17,051 కోట్లు మాత్రమే అని చెప్పారు. తాము చేయని తప్పునకు అన్ని నిందలు వేస్తున్నారని అన్నారు. ఆర్టీసీ, విద్యుత్, పౌరసరఫరాల్లో లేని అప్పు ఉన్నట్లు చూపిస్తున్నారని విమర్శించారు. పౌర సరఫరాల సంస్థకు ఇప్పటి వరకు ఉన్న అప్పు రూ.21,029 కోట్లు మాత్రమే అని.. నిల్వలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులను దాచి అప్పులు ఎక్కువగా ఉన్నాయని కాంగ్రెస్ నేతలు చూపుతున్నట్లు చెప్పారు.
తెలంగాణ రాష్ట్రానికి ఆస్తులు కూడా సృష్టించామని చెప్పారు. గత 60 ఏళ్లలో రూ.4,98,053 కోట్లు ఖర్చు చేశారన్నది తప్పుడు వాదన అని అన్నారు. జనాభా ఆధారంగా తెలంగాణ వాటా అంటూ తప్పుడు లెక్కలు చూపారని.. తెలంగాణలో గత పదేళ్ల ఖర్చు రూ.13,72,930 కోట్లు అని చెప్పారు. విద్యుత్ రంగంలో తాము సృష్టించిన ఆస్తులు రూ.6,87,585 కోట్లు అని చెప్పారు. విద్యుత్ స్థాపిత సామర్థ్యాన్ని 7,778 మెగావాట్ల నుంచి 19,464 మెగావాట్లకు పెంచిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని కేటీఆర్ (KTR) స్వేద పత్రం విడుదల సందర్భంగా అన్నారు.