Live Updates: మెగాస్టార్ చిరంజీవికి సీఎం జగన్ నుంచి ఆహ్వానం

ABP Desam Last Updated: 14 Aug 2021 07:49 PM
మెగాస్టార్ చిరంజీవికి సీఎం జగన్ నుంచి ఆహ్వానం

మెగాస్టార్ చిరంజీవికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ నుంచి ఆహ్వానం అందింది. మంత్రి పేర్ని నాని చిరంజీవితో ఫోన్ లో మాట్లాడారు.

దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న రాష్ట్రపతి

75వ సాతంత్య్ర  దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్ నాథ్ ప్రసంగిస్తున్నారు. 

కోటి రూపాయల విలువైన శ్రీ గంధం చెక్కలు పట్టివేత

అనంతపురం జిల్లా అమరాపురం మండలం బసవనపల్లెలో ఉన్న యునైటెడ్ ఆయిల్ ఇండస్ట్రీ లో శ్రీ గంధం చెక్కలను అక్రమంగా నిల్వ ఉంచారు. అక్రమ నిల్వలను అమరాపురం పోలీసులు పట్టుకున్నారు. వాటి విలువ దాదాపు రూ. కోటి 27 లక్షల 3500 ఉంటుందని అంచనా వేశారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచి అక్రమంగా చెక్కలను నిందితులు తరలించినట్టు తెలుస్తోంది. పోలీసులకు పట్టుబడకుండా.. ఆయిల్ ఇండస్ట్రీలోని అండర్ గ్రౌండ్లో శ్రీ గంధం చెక్కలను నిల్వ ఉంచారు. నిందితుల నుంచి దాదాపు 3,983 కిలోల శ్రీ గంధం చెక్కలు, 16 కిలోల శాండిల్ వుడ్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. కేరళ రాష్ట్రానికి చెందిన కృష్ణన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. 

దళితబంధుపై హుజూరాబాద్‌లో ఆందోళన

దళిత బంధు విషయంలో హుజూరాబాద్‌లో ఆందోళన జరుగుతోంది. అర్హులైన వారందరికీ దళిత బంధు రావట్లేదని ఎస్సీలు డిమాండ్ చేస్తూ నిరసన చేశారు. పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం, పెద్దపాపయ్యపల్లి క్రాస్ రోడ్ వద్ద ఎస్సీలు ఆందోళన చేపట్టారు. వీరి ఆందోళనతో వరంగల్-కరీంనగర్ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి.

రాహుల్ గాంధీ ట్విటర్ అకౌంట్ పునరుద్ధరణ

కాంగ్రెస్‌ పార్టీ కీలక నేత రాహుల్‌ గాంధీ ట్విటర్‌ అకౌంట్‌ తిరిగి పని చేస్తోంది. రాహుల్ అకౌంట్‌ను బ్లాక్ చేసిన ట్విటర్ ఇప్పుడు మళ్లీ పునరుద్ధరించింది. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో అత్యాచారం, హత్యకు గురైన బాధితురాలి కుటుంబ సభ్యుల ఫోటోలను రాహుల్ గాంధీ ట్విటర్‌లో ఉంచారు. దానిపై వివాదం రేగడంతో ట్విటర్‌ ఆ అకౌంట్‌ను స్తంభింపజేసింది. తాజాగా ఆయన ఖాతాను ట్విటర్‌ అన్‌లాక్‌ చేసినట్లు కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. రాహుల్‌ అకౌంట్‌తో పాటు పార్టీ నేతల అందరి ఖాతాలు కూడా తిరిగి పని చేస్తున్నాయని కాంగ్రెస్ ప్రకటించింది.





సీఎం సభపై సీఎస్ సమీక్ష

ఈ నెల 16న కరీంనగర్ జిల్లా శాలపల్లి ఇందిరానగర్‌లో నిర్వహించే ముఖ్యమంత్రి కేసీఆర్ సభపై సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష చేస్తున్నారు. కరీంనగర్ చేరుకున్న సీఎస్.. కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎస్ సోమేశ్​ కుమార్‌తో పాటు జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సభలోనే కేసీఆర్.. దళిత బంధు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. సీఎం సభ జనసమీకరణ కోసం ప్రభుత్వ ఉపాధ్యాయులకు బాధ్యతలు అప్పగించారు. బస్సుల్లో జనాలను తరలించేలా వారికి సూచనలు చేశారు. ఈ నెల 16న మధ్యాహ్నం 2 గంటలకు సమావేశానికి రావాలని కరీంనగర్ డీఈవో ఆదేశాలిచ్చారు.

కృష్ణా నదిలో చిక్కుకుపోయిన లారీలు

కృష్ణా నదికి అకస్మాత్తుగా వరద పెరగడంతో ఇసుక లారీలు నదిలో చిక్కుకుపోయాయి. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం చెవిటికల్లు ఇసుక ర్యాంపులో వందకు పైగా లారీలు నిలిచిపోయాయి. వరద పెరగడంతో ఇసుక ర్యాంపులోకి వెళ్లే రహదారి కొట్టుకుపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. 


 

దేశంలో తాజాగా 38 వేల కరోనా కేసులు, 478 మరణాలు

దేశంలో గడిచిన 24 గంటల్లో కరోనా కేసులు, మరణాలు స్వల్పంగా తగ్గాయి. తాజాగా 22,29,798 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 38,667 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ముందు రోజుతో పోల్చితే ఈ కేసుల్లో 3.6 శాతం తగ్గుదల కనిపించింది. నిన్న మరో 478 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసులు 3.21 కోట్లకు చేరగా, మరణాలు 4.30 లక్షలు దాటాయి. నిన్న 35 వేల మంది కరోనా నుంచి కోలుకున్నట్లు ప్రకటించింది. క్రియాశీల కేసులు 3,87,673గా ఉన్నయి. ఆ రేటు 1.21 శాతానికి చేరింది. ఇప్పటివరకు కోవిడ్ ను జయించిన వారి సంఖ్య 3,13,38,088. దేశంలో 53 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి.


Also Read: Jagitial: పెద్దపులిని చూపిస్తానని ఆశపెట్టి పిల్లల్ని తీసుకెళ్లిన తల్లి.. ఏడుస్తూ తిరిగొచ్చిన చిన్న కొడుకు.. గ్రామస్తులు షాక్

భీమవరంలో వరుస పేలుళ్లు.. ఇవాళే సీఎం జగన్ పర్యటన..

భీమవరంలో వరుసగా రెండుసార్లు పేలుళ్లు చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. ఉండి రోడ్‌లో శుక్రవారం సాయంత్రం బాంబ్ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలోనే ఆవుకు వెనుక వైపు రెండు కాళ్లు తెగిపడ్డాయి. శనివారం సీఎం జగన్ పర్యటన ఉండడంతో హుటాహుటిన కలెక్టర్, డీఎస్పీ కలిసి బాంబు పేలిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఇదిలా ఉండగా.. మళ్లీ శనివారం ఉదయం స్థానిక బైపాస్ రోడ్డులో కెమికల్ లారీ ట్యాంకర్‌కు వెల్డింగ్ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. అక్కడి నుంచి దూరంగా ఉన్న చర్చి వరకూ ట్యాంకర్ విడి భాగాలు ఎగిరిపడ్డాయి. ట్యాంకర్ విడి భాగం విద్యుత్ తీగలపై పడటంతో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. కరెంటు లేకపోవడంతో సహాయ కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడింది.



జగన్ భీమవరం పర్యటన ఇలా..

ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహానికి సీఎం జగన్ శనివారం హాజరు కానున్నారు. ఉదయం 11.15 గంటలకు కల్యాణ వేదిక కె–కన్వెన్షన్‌కు జగన్ చేరుకుంటారు. ఇందుకోసం అధికారులు కల్యాణ మండపానికి కొంత దూరంలో హెలీప్యాడ్‌ ఏర్పాటు చేశారు. హెలీప్యాడ్ నుంచి 11.20 గంటలకు రోడ్డు మార్గంలో బయలుదేరి 11.25 గంటలకు కల్యాణ మండపానికి జగన్ చేరుకుంటారు. నూతన వధూవరులను ఆశీర్వదించి తిరుగు ప్రయాణం కానున్నారు.

సాగర్‌కు పెరిగిన వరద

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు మళ్లీ వరద కొనసాగుతోంది. కొన్ని రోజులుగా ఇన్‌ఫ్లో తగ్గగా తాజాగా పెరుగుతోంది. దీనివల్ల అధికారులు రెండు గేట్లను ఎత్తి నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 40,406 క్యూసెక్కులు కాగా.. అవుట్ ఫ్లో 68,703 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 589.5 అడుగులకు చేరినట్లు ఎన్ఎస్పీ అధికారులు తెలిపారు. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 311.5 టీఎంసీలుగా ఉన్నట్లు చెప్పారు.

Background

శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని గార మండలానికి చెందిన ముగ్గురు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి ఆచూకీ లేకుండా పోయారు. గారకు చెందిన పలువురు మత్స్యకారులు శనివారం తెల్లవారుజామున చేపల వేటకు సముద్రంలోకి వెళ్లారు. ఈ క్రమంలోనే ముగ్గురు గల్లంతయ్యారు. తోటి మత్స్యకారులు గాలించగా ఒకరి మృతదేహం దొరికినట్లు స్థానికులు తెలిపారు. మిగతా ఇద్దరి కోసం వెతుకుతున్నారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.