Breaking News Live Telugu Updates: అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
చిత్తూరు : అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం..
చిత్తూరు జిల్లా, యాదమరి మండలం, మోర్ధానపల్లె సమీపంలోని అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.. ఫ్యాక్టరీ నుండి భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి.. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం సంభవించి వుండవచ్చునని సమాచారం.. సంఘటనా స్థలానికి చేరుకున్న యాదమరి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.. భారీగా ఆస్తీ నష్టం వాటిల్లినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ విమానం గన్నవరం ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. సీఎం జగన్ ప్రయాణిస్తున్న విమానం టేకాఫ్ అయిన కాసేపటికే సాంకేతిక లోపం తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు సమాచారం. సోమవారం సాయంత్రం సీఎం జగన్ దిల్లీకి బయలుదేరారు. కానీ టేకాఫ్ అయిన తరువాత సాంకేతిక లోపం తలెత్తడంతో గన్నవరంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడంతో, సీఎం జగన్ క్షేమంగా ఉన్నారని వైసీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రామకృష్ణ పురం గ్రామం బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. విద్యార్థుల అల్పాహారంలో ఫుడ్ పాయిజన్ కావడంతో 100 మంది బాలికలకు తీవ్ర అస్వస్థత గురైయ్యారు. బాలికలు జ్వరం, విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది సృహతప్పి పడిపోయారు. దీంతో బాలికలను సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన బాలికలకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం అంకోల్ గ్రామ సమీపంలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. అంకోల్ గ్రామానికి చెందిన నీరడి శ్రీనివాస్ అనే వ్యక్తి ఆర్టీసీలో ప్రైవేటు డ్రైవర్ గా పనిచేస్తున్నారు. రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నోటిలో మద్యం సీసాలతో పొడిచి హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు డాగ్ స్క్వాడ్ తో తనిఖీ చేశారు పోలీసులు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
గవర్నర్ తమిళిసై వివాదంలో తెలంగాణ సర్కారు కాస్త వెనక్కి తగ్గింది. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందని కోర్టుకు తెలిపింది. అంతే కాకుండా కోర్టులో వేసిన పిటిషన్ వెనక్కి తీసుకుంటున్నట్టు పేర్కొంది.
హైదరాబాద్ నగరం లోని అంబర్ పేటలో ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల నేపథ్యంలో గాంధీ విగ్రహం వద్ద నుంచి అంబర్‌పేట టీ జంక్షన్ వరకు ఈ నెల 30 వ తేదీ నుంచి మార్చి 10 వ తేదీ వరకు 40 రోజుల పాటు రోడ్డు మూసి వేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఆ రూట్‌లో వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్తూ, పోలీసులకు సహకరించాలని సూచించారు. గాంధీ విగ్రహం నుంచి 6 నంబర్ బస్టాప్ వరకూ వెళ్లే మార్గంలో (ఒకవైపు) వాహనాలను అనుమతించకుండా ఆంక్షలు విధించినట్టు చెప్పారు.
ఉప్పల్ వైపు నుంచి 6 నంబర్ బస్టాప్ మీదుగా చాదర్‌ఘాట్ వెళ్లే భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు హబ్సిగూడ క్రాస్ రోడ్స్ నుంచి తార్నాక, ఉస్మానియా వర్సిటీ, అడిక్‌మెట్ ఫ్లై ఓవర్, విద్యా నగర్, ఫీవర్ దవాఖాన, బర్కత్ పురా, నింబోలి అడ్డా వైపునకు వాహనాలను మళ్లించనున్నారు.
ఇక ఇదే మార్గంలో వెళ్లే సిటీ బస్సులు, సాధారణ వాహనాలను గాంధీ విగ్రహం నుంచి ప్రేమ్ సదన్ బాయ్స్ హాస్టల్, సీపీఎల్ అంబర్ పేట్ గేట్, అలీఖేఫ్ క్రాస్ రోడ్స్, 6 నంబర్ బస్టాప్, గోల్నాక, నింబోలి అడ్డా మీదుగా చాదర్‌ఘాట్ కు వెళ్లాల్సి ఉంటుంది. ఛే నంబర్ బస్టాప్ వైపు నుంచి ఉప్పల్ వైపు వెళ్లే అన్ని వాహనాలను అనుమతిస్తారు.
- రోహిత్ రెడ్డి ఈడీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ
- ఈసీఐఆర్ నమోదుపై కౌంటర్ దాఖలు చేసిన ఈడీ
- కౌంటర్ కు రిప్లై ఇచ్చేందుకు సమయం కోరిన రోహిత్ రెడ్డి తరపు న్యాయవాది
- తదుపరి విచారణ ఫిబ్రవరి 20 కి వాయిదా వేసిన హైకోర్టు
- కడప జిల్లాలోని జమ్మలమడుగు గండికోటలో సందడి చేసిన ప్రముఖ నటుడు కమల్ హాసన్
- గండికోటలో డైరెక్టర్ శంకర్ నిర్మిస్తున్న భారతీయుడు 2 సినిమా షూటింగ్ కోసం రాక
- ఇక్కడ 6 రోజుల పాటు సాగనున్న షూటింగ్
- హీరో కమల్ హాసన్ ను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు, అభిమానులు
మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధి ఓఆర్ఆర్ పై తెల్లవారుజామున మహారాష్ట్ర నుండి కొత్తపేట్ పండ్ల మార్కెట్ కు ద్రాక్ష పండ్లతో వస్తున్న బొలేరో వాహనం (MH 13 DO 4765) డ్రైవర్ అనిల్ నిద్ర పోవడంతో డివైడర్ ఢీ కొట్టింది. వాహనంలో ఉన్న నల్ల ద్రాక్ష పండ్లు రోడ్డుపై పడిపోవడంతో కొద్దిపాటి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయాలైన డ్రైవర్ అనిల్ ను ఓఆర్ఆర్ అంబులెన్స్ లో ఘట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
- బడ్జెట్ ఆమోదంపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
- రాష్ట్ర బడ్జెట్ కు ఇంకా ఆమోదం తెలపని గవర్నర్ తమిళిసై
- గవర్నర్ తీరును సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన రాష్ట్ర ప్రభుత్వం
- పిటిషన్ విచారణకు స్వీకరించిన హైకోర్టు
- మధ్యాహ్నం ఒంటి గంటకు విచారణ చేస్తామన్న హైకోర్టు
- ఇందులో హైకోర్టు ఎలా జోక్యం చేసుకుంటుదన్న ధర్మాసనం
- మధ్యాహ్నం ఒంటి గంటకు విచారించనున్న హైకోర్టు
జనగామ జిల్లా రఘునాథపల్లి వద్ద పెను ప్రమాదం తప్పింది. సోమవారం ఉదయం రఘునాథపల్లి వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొట్టాయి. దీంతో నలుగురు బాగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ప్రయాణికులను ఇతర వాహనాల్లో వారి గమ్యస్థానాలకు పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో రికార్డ్ ధర నమోదు చేసుకున్న దేశీ మిర్చి క్వింటాల్. కొత్త మిర్చికి 81 వేల రూపాయలు పలికిన ధర చరిత్ర సృష్టించింది. మార్కెట్ చరిత్రలో కొత్త మిర్చికి ఇప్పటివరకు ఈ ధర నమోదు కాలేదు.
Background
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. మళ్లీ రేపు సాయంత్రం తిరిగి రాష్ట్రానికి చేరుకుంటారు. ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశంలో భాగంగా ఏర్పాటు చేసిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ వెళ్తున్నారు.
సోమవారం సాయంత్ర తాడేపల్లిలో బయల్దేరనున్న సీఎం జగన్... రాత్రికి ఢిల్లీ చేరుకుంటారు. అక్కడే జన్‌పథ్‌లో బస చేస్తారు.
రేపు(మంగళవారం) జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఉదయం పదిన్నరకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం సాయంత్రం వరకు సాగనుంది. ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో జరిగే ఈ కార్యక్రమంలో చాలా మంది దౌత్యవేత్తలు పాల్గొంటారని... సీఎంతో సమావేశమవుతారని ప్రభుత్వం చెబుతోంది.
గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం చాలా మంది వ్యాపారవేత్తలను, పారిశ్రామికవేత్తలను, రాయబారులను పిలిచింది. ఏపీలో పెట్టబడులు పెట్టేందుకు ఉన్న అనేక వనరులను, అనుకూల పరిస్థితులను వారికి వివరించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించే ప్రయత్నం చేస్తోంది. వచ్చిన వారందరితో సీఎం జగన్ సమావశమై.. రాష్ట్రంలో చేపట్టే కార్యక్రమాలు వివరించనున్నారు.
మార్చి మూడు, నాలుగు తేదీల్లో ఏపీ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ నిర్వహిస్తోంది ఏపీ ప్రభుత్వం. విశాఖ వేదికగా ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ మీటింగ్‌లో బీటుబీ, బీటూజీ సమావేశాలు, నిర్వహించనున్నారు. మరికొన్ని కీలక సమావేశాలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఏపీ ప్రభుత్వం ప్రధానంగా ఫోకస్ చేస్తున్న సెక్టార్లలో కనిపిస్తున్న అభివృద్ధి. చేపట్టే కార్యక్రమాలను అతిథులకు వివరించనున్నారు.
ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన... పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్న వారి అనుభవాలను ఈ వేదికపై నుంచి అతిథిలకు వివరిస్తారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూలతలను వారి ద్వారానే ప్రచారం చేయాలని భావిస్తున్నారు. ఏపీ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌ను విజయవంతం చేసేందుకు ప్రధాన నగరాల్లో కార్యక్రమాలు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం అందులో భాగంగానే ఢిల్లీలో కర్టెన్ రైజర్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్‌కు 28 విదేశీ పెట్టుబడులుదారులను, 44 దేశాలకు చెందిన రాయబారులు వస్తున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఏపీ అడ్వాంటేజ్ అనే థీమ్‌తో ఏపీ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ నిర్వహించబోతున్నట్టు ప్రభుత్వం అతిథులకు వివరించనుంది. ఇలాంటి కార్యక్రమాలు అహ్మదాబాద్, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, బెంగళూరులో కూడా నిర్వహించాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. అక్కడ చిన్న చిన్న సమావేశాలు, రోడ్‌షోలు, చిట్‌చాట్‌లాంటి కార్యక్రమాలతో ఏపీ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ను విజయవంతం చేయాలని భావిస్తోంది ప్రభుత్వం.
దిల్లీ టూర్ కు ముందు ఏపీ సీఎం జగన్ పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. వరుసగా మూడో ఏడాది జగనన్న చేదోడు పథకం కింద నిధులు విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడీ అయ్యింది. రజక, నాయీబ్రాహ్మణ, దర్జీల సంక్షేమం కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తున్న కానుకగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నారు.
చేదోడు పథకం
రాష్ట్రవ్యాప్తంగా 3,30,145 మంది అర్హులైన రజక, నాయీబ్రాహ్మణ, దర్జీలకు రూ. 330.15 కోట్ల ఆర్థిక సాయాన్ని పల్నాడు జిల్లా వినుకొండలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం వైఎస్ జగన్. జగనన్న చేదోడు పథకం కింద షాపులున్న రజకులు, నాయీబ్రాహ్మణులు, దర్జీలకు ఏటా రూ. 10 వేల చొప్పున అందిస్తున్న సాయంతో కలిపి ఇప్పటికే ఒక్కొక్కరికి రూ. 30,000 ఆర్థిక సాయం అందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పుడు అందిస్తున్న సాయంతో కలిపి ఈ మూడేళ్ల కాలంలో ఈ పథకం ద్వారా ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 927.51 కోట్లు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -