'పుష్ప ది రూల్' పెయిడ్ ప్రీమియర్ షోస్ నుంచి రేవతి మృతి, అల్లు అర్జున్ అరెస్ట్... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేది లేదని అసెంబ్లీలో చెప్పడం నుంచి ఇటీవల ఆయన్ను తెలుగు చలన చిత్ర పరిశ్రమ పెద్దలు కలిసే వరకు... ప్రతి రోజు ప్రతి విషయం సంచలనం అయ్యింది. ఇప్పటి వరకు ఈ ఇష్యూ మీద స్పందించనది ఎవరైనా ఉన్నారు అంటే... అది ఒక మెగా ఫ్యామిలీ మాత్రమే! మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు, ఏపీ ముఖ్యమంత్రి - జనసేన పార్టీ అధినేత - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ను ప్రశ్నిస్తే ఏం చెప్పారో తెలుసా?
మనుషులు మరణిస్తుంటే... సినిమాల గురించి ఎందుకు?
రాయలసీమ జిల్లాలో ఒకటైన కడపకు ఈ రోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ వెళ్లారు. రాజకీయ పరమైన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన రాయచోటికి వెళ్ళిన సమయంలో... అల్లు అర్జున్ ఇష్యూ (Allu Arjun Issue) గురించి ఒక విలేకరి అడిగే ప్రయత్నం చేశారు.
''ఇప్పుడు మనుషులు మరణిస్తుంటే సినిమాల గురించి ఎందుకు? ఈ సమస్యకు సంబంధించిన ప్రశ్నలు ఏమైనా అడగండి. పెద్ద పెద్ద సమస్యలకు సంబంధించిన విషయాలు అడగండి. మనస్ఫూర్తిగా చెబుతున్నాను... బియాండ్ సినిమా గురించి డిబేట్ పెట్టండి. ఇక్కడ సమస్యల గురించి మాట్లాడండి. అరాచకాలపై డిబేట్ పెట్టండి'' అని పవన్ కళ్యాణ్ తెలిపారు.
చిరంజీవి, నాగబాబును అల్లు అర్జున్ కలిసినా సరే...
అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ఆయన ఇంటికి పలువురు టాలీవుడ్ ప్రముఖులు వెళ్లి పరామర్శించారు. ఆ తీరును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మరి కొంత మంది తప్పు పట్టారు. అయితే... అల్లు అర్జున్ మాత్రం మావయ్య మెగాస్టార్ చిరంజీవి, మెగా బ్రదర్ నాగబాబు ఇళ్లకు స్వయంగా వెళ్లి కలిసి వచ్చారు. పవన్ కళ్యాణ్‌ను మాత్రం కలవలేదు.
Also Read: ట్రైలర్ రిలీజ్ చేయకుంటే ఆత్మహత్య... 'గేమ్ ఛేంజర్' టీంకు రామ్ చరణ్ అభిమాని సూసైడ్ లెటర్
జైల్లో ఒక రాత్రి అల్లు అర్జున్ గడిపి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వచ్చారు. ఆయన్ను బన్నీ కలుస్తారని ప్రచారం జరిగింది. అయితే వాళ్ళిద్దరి కలయిక మాత్రం కుదరలేదు. అంతే కాదు... అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్ ఏ వేదిక మీద స్పందించలేదు. అరెస్టు జరిగిన సమయంలో పవన్ ఏపీలో ఉన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేదిక మీద పవన్ మాట్లాడుతున్న సమయంలో అరెస్టు జరిగితే... చంద్రబాబుకు ఆయన సిబ్బంది సమాచారం అందించారు. పవన్ మాట్లాడడం పూర్తయిన తర్వాత ఆయనకు చంద్రబాబు స్వయంగా విషయం చెప్పారు. ఆ తర్వాత నుంచి మీడియా ముఖంగా పవన్ దగ్గర ఎవరూ ఈ సమస్య గురించి ప్రస్తావించలేదు. ఇకపై కూడా ఆయన స్పందించే అవకాశం లేదని అనుకోవచ్చు.
Also Read: లైంగిక వేధింపులకు పాల్పడిన టీవీ నటుడు - అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసిన కేసులో అరెస్ట్