భారతమాల పథకం ఫేజ్-I క్రింద తెలంగాణలో ప్రతిష్టాత్మంగా నిర్మించనున్న హైదారాబాద్‌ రీజినల్ రింగ్‌రోడ్డుకు సంబంధించిన కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తర భాగంలో పనులకు సంబంధించి కేంద్రం టెండర్లను పిలిచింది. ఈ పనుల్లో భాగంగా గిర్మాపూర్‌ నుంచి యాదాద్రి వరకు నాలుగు లేన్ల ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించనున్నారు. దీన్ని నాలుగు భాగాలుగా చేసి టెండర్లు పిలించారు. ఈ ఫోర్‌లేన్ల రహదారిని 5,555కోట్లతో రెండేళ్లలో నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 


సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్‌-రెడ్డిపల్లి వరకు 34.518కి.మీ.లు మొదటి ప్యాకేజీ కింద ఉంచారు. రెడ్డిపల్లి నుంచి ఇస్లాంపూర్‌ వరకు 26 కి.మీలు రెండో ప్యాకేజీ కింద ఉంచారు. ఇస్లాంపూర్‌ నుంచి ప్రజ్ఞాపూర్‌ వరకు 23 కి.మీ మేర నిర్మాణాలను మూడో ప్యాకేజీ కింద చేపట్టనున్నారు. ప్రజ్ఞాపూర్‌ నుంచి యాదాద్రి జిల్లా రాయగిరి వరకు 43 కి.మీల రహదారిని నాల్గో ప్యాకేజీ కింద పూర్తి చేస్తారు. 


వారం రోజుల క్రితమే ఈ హైదరాబాద్‌ రీజినల్‌ రింగురోడ్డు ఉత్తర భాగానికి సంబంధించిన అలైన్‌మెంటును కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఆమోదించింది. చాలా కాలం క్రితమే ఈ అలైన్‌మెంట్‌ను ఎన్‌హెచ్‌ఏఐ ఆమోదం తెలిపినా కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉండిపోయింది. ఇన్నాళ్లకు వారం క్రితం ఆమోదించడమే కాకుండా టెండర్లను కూడా పిలిచింది. 


తెలంగాణ గేమ్ ఛేంజర్‌గా మారుతుందని భావిస్తున్న ఈ ట్రిపుల్ ఆర్‌ అనేక అవాంతరాలు దాటుకొని నేడు టెండర్ల దశకు చేరుకుంది. ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును రెండు భాగాలుగా నిర్మించనున్నారు. ఉత్తర భాగం సంగారెడ్డి నుంచి యాదాద్రి జిల్లా చౌటుప్పల్ వరకు రోడ్డు నిర్మిస్తారు. సంగారెడ్డి, నర్సాపూర్‌, గజ్వేల్‌, వర్గల్‌, మర్కూక్‌, జగదేవ్‌పూర్‌, తూప్రాన్‌, హత్నూర, శివ్వంపేట, చౌటకూర్‌, తుర్కపల్లి, యాదాద్రి, వలిగొండ, చౌటుప్పల్‌, భువనగిరి మండలాల మీదుగా ఫోర్‌లేన్ రోడ్డు వస్తుంది.  


హైదారాబాద్‌ చుట్టూ అవుటర్ రింగ్‌రోడ్డు మాదిరిగా జిల్లా రహదారులను కలుపుతూ మరో భారీ రింగ్ నిర్మాణానికి కేంద్రం నిర్ణయించింది. భారత్‌ మాల పరియోజన స్కీమ్ ఫేజ్‌ 2 కింద దీన్ని ప్రపోజల్ పెట్టింది. హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న జిల్లాలకు ఈజీగా కనెక్ట్ అయ్యేందుకు ఈ ట్రిపుల్ ఆర్ యూజ్ అవుతుందని ప్రభుత్వం అంచనా. దీన్ని రెండు భాగాలుగా నిర్మించనున్నారు. ఈ ట్రిపుల్ ఆర్‌ నిర్మాణంలో భాగంగా హైదరాబాద్ చుట్టూ ఎక్కడా సర్వీస్‌రోడ్డులు లేకుండా నాలుగు లేన్ల సరదార్లు వేయనున్నారు. రంగారెడ్డి, భువనగిరి, సిద్దిపేట, సంగారెడ్డిజిల్లాకు చెందిన చాలా గ్రామాలు ఈ పరిధిలోకి వచ్చేస్తున్నాయి. దక్షిణ భాగం 182 కిలోమీటర్లు ఉంది. ఇది భువనగిరి, చోటుప్పల్ ఇబ్రహీంపట్నం, కందుకూర్, ఆమనగల్‌, చేవెళ్ల, శంకరపల్లీ, సంగారెడ్డిని కలుపుతుంది.