Mohan Babu: జర్నలిస్టుపై హత్యాయత్నం కేసులో మోహన్ బాబు ఆజ్ఞాతంలో ఉన్నారు. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. పోలీసులు ఇరవై నాలుగో తేదీ తర్వాత మోహన్ బాబుకు నోటీసులు జారీ చేస్తామని ప్రకటించారు.కానీ ఆ రోజు ముగిసి ఐదు రోజులు అయినా పట్టించుకోలేదు. బయట కనిపిస్తే అరెస్టు చేస్తారేమోనన్న ఉద్దేశంతో మోహన్ బాబు హైదరాబాద్‌లోనే ఉండటం లేదని చెబుతున్నారు. న్యాయపరమైన రిలీఫ్ వచ్చిన తర్వాతనే ఆయన మళ్లీ హైదరాబాద్‌లో కనిపించే అవకాశం ఉందని చెబుతున్నారు. హైకోర్టులో మందస్తు బెయిల్ రాకపోవడంతో ఇక సుప్రీంకోర్టుకు వెళ్లాలి. అయితే ఇంకా పిటిషన్ దాఖలు చేయలేదు.
మంచు కుటుంబంలో ఏర్పడిన వివాదం కారణంగా మంచు మనోజ్ ఓ రోజు ఇంటి గేటును తోసేసుకుని లోపలికి వెళ్లారు. తనతో పాటు మీడియా ప్రతినిధుల్ని తీసుకెళ్లారు. లోపల జరిగిన ఘర్షణ తర్వాత ఓ టీవీ చానల్ రిపోర్టర్ మోహన్ బాబును స్పందన అడిగేందుకు ప్రయత్నించారు. కోపం తెచ్చుకుని ఆయన మైక్ తీసుకుని ఆయనపైనే దాడి చేశారు. ఆ రిపోర్టర్ కు తీవ్ర గాయాలు కావడంతో హత్యాయత్నం కేసును పోలీసులు నమోదు చేశారు. నోటీసులు జారీ చేస్తే మోహన్ బాబు కోర్టుకు వెళ్లారు. ఈ నెల ఇరవై నాలుగో తేదీ వరకూ పోలీసుల ఎదుట హాజరు కాకుండా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఆ గడువు ముగిసింది. పోలీసుల ఎదుట హాజరు కాకుండా ఉత్తర్వులు పొడిగించాలని ఆయన హైకోర్టులో పిటిషన్ వేయలేదు.
మోహన్ బాబు ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నారని చెబుతున్నారు. అక్కడ మంచు విష్ణు కుటుంబం నివసిస్తోంది. ప్రస్తుతానికిఅక్కడే ఉంటున్నారని అంటున్నారు. పోలీసులు మళ్లీ నోటీసులు జారీ చేస్తే ఆయన వచ్చే అవకాశం ఉంది. నోటీసులు జారీ చేస్తే పోలీసుల ఎదుట హాజరవుతారు. అప్పుడు అరెస్టు చేయకపోవచ్చని అంటున్నారు. అదే సమయంలో న్యాయపోరాటం కూడా చేయవచ్చు. కానీ ఇప్పుడు బయట కనిపిస్తే పోలీసులు సమాచారం ఇవ్వకుండా అరెస్టు చేయడానికి అవకాశం ఉంటుంది.అందుకే వ్యూహాత్మకంగా ఆయన ఆజ్ఞాతంలో ఉంటున్నారని అంటున్నారు. మొత్తానికి మోహన్ బాబుకు ఫ్యామిలీ సమస్యలు సమసిపోకుండానే.. ఆవేశంతో మీడియా ప్రతినిధిపై చేసిన దాడి మరో సమస్యగా చుట్టుముట్టింది.
Also Read : TTD News: శ్రీవారి హుండీల్లో వేసిన సొమ్మునూ నొక్కేస్తారా ? ఈ స్కాంపై విచారణ చేయిస్తే సంచలన విషయాలు