South Korea News | సియోల్: దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. యువాన్ ఎయిర్ పోర్టులో రన్‌వే మీద అదుపుతప్పిన విమానం గోడను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. విమానంలో మొత్తం 181 మంది ఉన్నారు. వారిలో 175 మంది ప్రయాణికులు కాగా, ఆరుగురు విమాన సిబ్బంది ఉన్నారని యోన్హాప్ రిపోర్ట్ చేసింది. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కొన్ని రిపోర్టుల ప్రకారం అయితే 85 మంది మృతిచెందారని సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.


దక్షిణ కొరియా నేషనల్ ఫైర్ ఏజేన్సీ ఈ ప్రమాదంపై స్పందించింది. ఎయిర్ పోర్టు రన్ మీదకు చేరుకున్న విమానానికి పక్షి తగలడంతో ల్యాండింగ్ గేర్ లో సమస్య తలెత్తడంతో ఘటన జరిగి ఉండొచ్చునని అధికారులు తెలిపారు.


బ్యాంకాక్ వచ్చిన విమానం..


థాయ్‌లాండ్ బ్యాంకాక్ నుంచి బయలుదేరిన జేజు ఎయిర్ ఫ్లైట్ 7C2216 అనే విమానం మొత్తం 181 మందితో దక్షిణ కొరియాలోని యువాన్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. కానీ చివరి నిమిషంలో సమస్య రావడంతో విమానం రన్‌వే పక్కనున్న గోడను ఢీకొట్టడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి విషాదం చోటుచేసుకుందని అధికారులు పేర్కొన్నారు. రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో ప్రాణనష్టం అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. 






దక్షిణ కొరియా మౌలిక వసతులు, రవాణాశఆఖ మంత్రిత్వ శాఖ ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. పక్షి తగలడంతోనే ల్యాండింగ్ గేర్ సమస్య తలెత్తి ఈ ఘటన జరిగిందని నేషనల్ ఫైర్ ఏజెన్సీ తెలిపింది. దక్షిణ కొరియా ఆపద్ధర్మ అధ్యక్షుడు చోయి విమాన ప్రమాదంపై స్పందించారు. సాధ్యమైనంత త్వరగా రెస్క్యూ టీమ్ అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రమాదానికి కారణంపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.


Also Read: Pakistan Afghanistan War: తాలిబన్ల చేతిలో చావు దెబ్బ తింటున్న పాకిస్తాన్ - భారత్ పని సులువైనట్లే !