Flashback 2024: 2024లో అనేక క్రీడాలు జరిగాయి. గెలుపు ఓటములతో ఆటగాళ్లు, అబిమానులు రోలర్ కోస్టర్ రైడ్ ను అనుభవించారు. అయితే ఈ ఏడాది కొన్ని వివాదాలు కూడా చుట్టుముట్టాయి. అనుకోకుండా వచ్చినవి కొన్నయితే, విచిత్రమైన వివాదాలు మరికొన్ని. మొత్తానికి ఈ వివాదాలతో క్రీడా ప్రపంచం మొత్తం ఒక్కసారి ఉలిక్కిపడేలా కొన్ని సంఘటనలు జరిగాయి. ఈ రోజు వాటి గురించి విపులంగా తెలుసుకుందాం..
ఇమేన్ ఖలీఫ్ జెండర్ వివాదం..
నాలుగేళ్లకొకసారి జరిగే ఒలింపిక్స్ లో అనుకోని వివాదం అందరినీ షాక్ కు గురి చేసింది. ఇరాన్ కు చెందిన ఇమేన్ ఖెలీఫ్ అనే బాక్సర్ అసలు మహిళే కాదని, ఆమెను పోటీల నుంచి తప్పించాలని డిమాండ్లు వచ్చాయి. ఒలింపిక్ బౌట్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో ప్రత్యర్థి బాక్సర్.. ఇమేన్ పై ఇలాంటి ఆరోపణలు చేసింది. అయితే దీనిపై చర్చ అలా జరుగుతుండగానే ఇమేన్ ఒలింపిక్ చాంపియన్ గా నిలిచి, పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. ఇప్పుడు ఈ వివాదంపై న్యాయపోరాటం చేయాలని భావిస్తోంది.
వినేశ్ ఫోగాట్ హార్ట్ బ్రేక్..
ఒలింపిక్స్ లో పతకం ఖాయమని తేలిన తర్వాత సడెన్ గా డిస్ క్వాలిఫై అయితే ఎలా ఉంటుందో వినేశ్ ఫోగాట్ కు అనుభవంలోకి వచ్చింది. 50 కేజీల మహిళల రెజ్లింగ్ విభాగంతో సెమీఫైనల్ బౌట్ ముగిసిన తర్వాత గోల్డ్ మెడల్ మ్యాచ్ కు సిద్ధమవుతున్న తరుణంలో వినేశ్ 100 గ్రాములు అధికంగా బరువుందని తేలింది. దీంతో ఆమెను డిస్ క్వాలిఫై చేశారు. అంతకుముందు హాట్ ఫేవరెట్లను కంగుతినిపించిన వినేశ్ కు ఈ పరిణామం హార్ట్ బ్రేక్ లా మారింది. మొత్తానికి పతకం ఏమీ లేకుండానే వినేశ్ ఇంటిముఖం పట్టింది.
అంతిమ్ ఫంగల్ డిపోర్ట్..
ఒలింపిక్ విలేజీలోకి అక్రమంగా తన చెల్లితో ప్రవేశించినందుకుగాను భారత రెజ్లిర్ అంతిమ్ ఫంగల్ ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. తన అక్రిడేషన్ కార్డుతో అంతిమ్ .. చెల్లెలిని విలేజీలోకి తీసుకెళ్లిందని, ఫ్రాన్స్ అధికారులు తేల్చారు. దీంతో భారత ఒలింపిక్ సంఘం వెంటనే అంతిమ్ ను భారత్ కు డిపోర్ట్ చేసింది. ఈ ఘటన ఒక్కసారిగా చర్చనీయాంశమైంది.
చాంపియన్స్ ట్రోఫీ వివాదం..
2025 చాంపియన్స్ ట్రోఫీని పాక్ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అయితే టీమిండియా.. పాక్ లో పర్యటించడానికి బీసీసీఐ విముఖత చూపడంతో టోర్నీ నిర్వహణ డైలామాలో పడింది. ఎట్టకేలకు ఐసీసీ రంగంలోకి దిగి హైబ్రిడ్ మోడల్ని తీసుకొచ్చింది. దీంతో భారత్ ఆడే మ్యాచ్ లను యూఏఈలో నిర్వహించనున్నారు. అయితే పాక్ కూడా ఒక మెలిక పెట్టింది. భవిష్యత్తులో భారత్ లో తమ జట్టు కూడా పర్యటించదని, ఐసీసీ ఈవెంట్లలో తాము కూడా హైబ్రిడ్ మోడల్లోనే ఆడుతామని వెల్లడించింది. దీనికి బీసీసీఐ అంగీకరించడంతో పాక్ కూడా భవిష్యత్తులో ఇండియాలో పర్యటించకుండా తటస్థ వేదికల్లో ఆడనుంది. .
రాహుల్- సంజీవ్ గోయెంకా వివాదం..
ఈ ఏడాది ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకాతో ఆ జట్టు మాజీ కెప్టెన్ కేఎల్ రాహుల్ వివాదం వార్తల్లో నిలిచింది. సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ అనంతరం స్టేడియంలోనే రాహుల్ ను సంజీవ్ కడిగి పారేసిన వీడియో వైరలైంది. ఆ వీడియోలో జట్టు ప్రదర్శన పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశాడు. దీనికి రాహుల్ ఏదో సమాధానమిస్తూ ఇబ్బందిగా కనిపించాడు. అయితే ఈ వీడియోపై మాజీలు, క్రికెట్ లవర్స్ ఫైరయ్యారు. సంజీవ్ గోయెంకా దారుణంగా ప్రవర్తించాడని సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు. ఆ తర్వాత రాహుల్- సంజీవ్ ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో మెగావేలంలోకి రాహుల్ ని విడిచి పెట్టగా, అతడిని రూ.14 కోట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. ఇక లక్నో కూడా కొత్త కెప్టెన్ వేటలో ఉంది.