Gaza News: సంధికి సరే అంటే దాడులు ఆపేస్తాం, లేదంటే విధ్వంసమే - హమాస్‌కి ఇజ్రాయేల్ స్ట్రాంగ్ వార్నింగ్
Israel Hamas War: వారం రోజుల్లోగా సంధి కుదుర్చుకోకపోతే దాడులు మరింత తీవ్రం చేస్తామని హమాస్‌కి ఇజ్రాయేల్ వార్నింగ్ ఇచ్చింది.
Israel Gaza War: ఇజ్రాయేల్ హమాస్ మధ్య యుద్ధానికి (Israel Hamas War) ఇప్పట్లో తెరపడేలా కనిపించడం లేదు. రోజురోజుకీ ఇది తీవ్రతరమవుతోంది. ఈ క్రమంలోనే ఈజిప్ట్ సరిహద్దులో వేలాది మంది హమాస్ ఉగ్రవాదులు తలదాచుకునే రఫా ప్రాంతంపై దాడి చేస్తామని ఇజ్రాయేల్ ప్రకటించింది. ఇదే జరిగితే యుద్ధం ఇంకాస్త తీవ్రమయ్యే ప్రమాదముంది. అయితే...ఈ యుద్ధాన్ని ఆపేందుకు ఈజిప్ట్‌తో పాటు ఖతార్ కూడా ప్రయత్నిస్తున్నాయి. అటు ఇజ్రాయేల్ కూడా మరీ దూకుడుగా కాకుండా ముందు హమాస్‌కి ఓ అవకాశమిద్దాం అనే ఆలోచనలో ఉంది. అందుకే ఓ కీలక ప్రకటన చేసింది. గాజాలో కాల్పులను విరమించే విధంగా సంధి చేసుకుంటే రఫా ప్రాంతంపై దాడులు చేయబోమని స్పష్టం చేసింది. వారం రోజుల్లోగా ఏదో ఓ నిర్ణయం తీసుకోవాలని హెచ్చరించింది. లేకపోతే ఈ విధ్వంసం తప్పదని తేల్చి చెప్పింది. అటు అమెరికా కూడా ఇజ్రాయేల్‌కి నచ్చజెప్పే ప్రయత్నాలు మొదలు పెట్టడం వల్ల నెతన్యాహు కాస్తంత వెనక్కి తగ్గినట్టు సమాచారం. కానీ...హమాస్ దాడులు కొనసాగిస్తే మాత్రం ప్రతిదాడులు తీవ్రంగానే ఉంటాయని తేల్చి చెబుతున్నారు. అటు హమాస్ కూడా దీనిపై స్పందించింది. ఈజిప్ట్ రాజధాని కైరోకి తమ ప్రతినిధిని పంపించేందుకు సిద్ధమైంది. అక్కడే ఇజ్రాయేల్,హమాస్ ప్రతినిధుల మధ్య సంధి చర్చలు జరగనున్నాయి. ఒకవేళ ఈ సయోధ్య కుదిరితే కొంత వరకూ అక్కడ పరిస్థితులు అదుపులోకి వచ్చే అవకాశాలున్నాయి.
సానుకూల చర్చలు..?
ఇజ్రాయేల్ హెచ్చరికల నేపథ్యంలో సంధి కుదుర్చుకునేందుకు హమాస్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ చర్చల తరవాత కచ్చితంగా సానుకూలంగా స్పందన వస్తుందన్న అంచనాలున్నాయి. అటు అమెరికా కూడా ఈ చర్చలు సానుకులంగానే జరగాలని కోరుకుంటోంది. వీలైనంత వరకూ గాజాలో ఇజ్రాయేల్ దాడులు చేయడాన్ని తగ్గించాలని చెబుతోంది. అనవసరంగా వేలాది మంది పౌరులు బలి అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తోంది. అటు రఫాపైనా దాడి చేస్తామని ఇజ్రాయేల్ చేసిన ప్రకటన అలజడి పెంచింది. అంతే కాదు. ఇజ్రాయేల్ మిలిటరీ రఫాలో ప్రత్యేకంగా టెంట్‌లు వేసింది. అటాక్‌కి రెడీ అంటూ సంకేతాలిచ్చింది. అందుకే వెంటనే అమెరికా జోక్యం చేసుకుని యుద్ధాన్ని ఆపాలని చూస్తోంది. అందులో భాగంగానే ఇలా డీల్ కుదుర్చుకోవాలంటూ ఇజ్రాయేల్ హమాస్‌ని వార్నింగ్ ఇచ్చింది.
హమాస్‌ని అంతం చేసేంత వరకూ దాడులు కొనసాగుతాయని ఇజ్రాయేల్ ఇప్పటికే తేల్చి చెప్పింది. ఇప్పట్లో దాడులు ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈజిప్ట్ సరిహద్దులోని రఫా (Rafah)పై దాడికి సిద్ధమవుతున్నాని గతంలోనే వెల్లడించింది. వేలాది మంది హమాస్ ఉగ్రవాదులు ఇక్కడే మొహరించారని చెబుతోంది. అందుకే ఈ ప్రాంతంపైనే పూర్తిగా దృష్టి పెట్టింది. ఈ ప్రకటనతో ఈజిప్ట్ ఉలిక్కిపడింది. సరిహద్దులో అలజడి సృష్టిస్తే గట్టిగానే బదులివ్వాల్సి వస్తుందని హెచ్చరించింది. ఆ తరవాత ఇజ్రాయేల్ కూడా ఈజిప్ట్‌కి గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. హమాస్ టెర్రరిస్ట్‌లను తమకు అప్పగించేలా డీల్ కుదుర్చుకుంటేనే అటాక్‌లు ఆపేస్తామని వెల్లడించింది.
Also Read: Tesla: చెక్కతో తయారు చేసిన టెస్లా వెహికిల్‌ని చూశారా, లుక్ అదిరిపోయింది