ప్రపంచంలోని అన్ని భాషల్లో యూనివర్సల్ అప్పీల్ ఉన్న సినిమా జోనర్ ‘సూపర్ హీరో’. హాలీవుడ్ సూపర్ హీరో సినిమాల కోసం ప్రపంచం ఎంత వెర్రిగా ఎదురు చూస్తుందో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మధ్యే వచ్చిన స్పైడర్‌మ్యాన్ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యక్షంగా చూశాం కూడా. చిన్న చిన్న పట్టణాల్లో కూడా స్పైడర్‌మ్యాన్ బ్యానర్లు పెట్టడం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. అయితే అదే నటుడు నటించిన మామూలు సినిమా విడుదల అయితే కలెక్షన్లు, హైప్ ఈ స్థాయిలో ఉండవు. ఇక్కడ స్టార్‌డం ఉన్నది నటుడికి కాదు. అతను పోషిస్తున్న సూపర్ హీరో పాత్రకి.
మనకి ఇంత పెద్ద దేశం ఉంది... ఇన్ని ఇండస్ట్రీలు ఉన్నాయి.. కానీ క్రిష్ తప్ప ఇంతవరకు సరైన సూపర్ హీరో సినిమా ఒక్కటి కూడా లేదు. దాదాపు అన్ని భాషల్లో ఈ జోనర్‌ను ట్రై చేసినా.. ఎవ్వరూ సక్సెస్ కాలేకపోయారు. కానీ మలయాళంలో టొవినో థామన్ హీరోగా మిన్నల్ మురళి అనే సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి మంచి పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. టీజర్లు, ట్రైలర్లు, ప్రోమోలు సినిమాపై మరింత ఆసక్తి పెంచాయి. దీంతో ఈ సినిమా కోసం ఎందరో ఆసక్తిగా చూశారు. ఈ సినిమా శుక్రవారం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అయింది. తెలుగు సహా మొత్తం ఐదు భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది. మరి మిన్నల్ మురళి మెప్పించాడా?
కథ: జేసన్ (టొవినో థామస్) ఉరవకొండలో ఒక టైలర్ షాప్ పెట్టుకుని జీవనం సాగిస్తూ ఉంటాడు. అదే ఊర్లో ఇన్‌స్పెక్టర్ కూతురిని ప్రేమిస్తాడు. కానీ తను జేసన్‌ని కాదని డబ్బున్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఇక షిబు (గురు సోమసుందరం)ది మరో కథ. తను మానసిక సమస్యతో బాధపడుతూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్న ఉష(షెల్లీ కిషోర్) కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. భర్త వదిలేసి, ఒక కూతురు ఉన్నప్పటికీ.. తననే పెళ్లి చేసుకోవాలని ఆశతో ఉంటాడు. కానీ తన సమస్యల కారణంగా ఎవరూ తనను లెక్క చేయరు. ఒకరోజు ఆ ఊరిలో ఒకేసారి జేసన్, షిబుల మీద పిడుగులు పడతాయి దీంతో. ఇద్దరికీ కొన్ని అతీత శక్తులు వస్తాయి. తమ శక్తులను వారు ఎలా ఉపయోగించారు? వారి జీవితాలు చివరికి ఏమయ్యాయి? అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
విశ్లేషణ: ముందుగా దర్శకుడు బసిల్ జోసెఫ్‌ను కచ్చితంగా మెచ్చుకుని తీరాల్సిందే. సూపర్ హీరో సినిమాలంటే కళ్లు చెదిరే యాక్షన్ సన్నివేశాలు ఉండాల్సిందేనన్న చట్రంలో నుంచి బయటకు వచ్చి ఎమోషన్, సస్పెన్స్‌తో కూడా ప్రేక్షకులను కనెక్ట్ చేయవచ్చని నిరూపించాడు. సినిమాలో కేవలం మూడు యాక్షన్ సీక్వెన్స్‌లే ఉన్నాయి. అందులో పెద్ద సీక్వెన్స్ అయితే క్లైమ్యాక్స్ మాత్రమే. నేను బాగుంటే చాలు అనుకునే ఒక సాధారణ వ్యక్తి.. ఊరంతా బాగుండాలి అనే యాటిట్యూడ్ ఉన్న సూపర్ హీరోగా ఎలా మారాడన్న అంశాన్ని చాలా బాగా చూపించారు. ఈ కోణంలో చూస్తే మాత్రం మనదేశంలో ఇప్పటిదాకా వచ్చిన బెస్ట్ సూపర్ హీరో సినిమా ఇదే. ఇంత మంచి కంటెంట్ ఉన్న సినిమా ఓటీటీ కంటే థియేటర్లలో విడుదలై ఉంటే చాలా బాగుండేది. పెద్ద సక్సెస్ కూడా అయ్యేది.
ఒక సూపర్ హీరో ఎలివేట్ అవ్వాలంటే తన స్వభావానికి పూర్తి విరుద్ధమైన, అంతే బలమైన సూపర్ విలన్ కూడా ఉండాలి. షిబు పాత్రను సరిగ్గా జేసన్ పాత్రకు పూర్తి విరుద్ధంగా దర్శకుడు జోసెఫ్ మలిచాడు. తనకు కావాల్సింది దక్కడం కోసం ఊరిని నాశనం చేయడానికి కూడా వెనుకాడని ఒక సూపర్ విలన్ పాత్రను జోసెఫ్ రాసుకున్నాడు. హీరో, విలన్‌ల మధ్య జరిగే సన్నివేశాలు, వారిద్దరి మధ్య వచ్చే కాన్‌ఫ్లిక్ట్.. ఆడియన్స్‌ను చూపు తిప్పనివ్వకుండా చేస్తుంది. ఒకరి గురించి ఒకరికి తెలిసే సన్నివేశాలు కూడా చాలా గ్రిప్పింగ్‌గా, థ్రిల్లింగ్‌గా చూపించారు. క్లైమ్యాక్స్‌లో యాక్షన్ సీక్వెన్స్ కూడా అద్భుతంగా వచ్చింది.
తన సూపర్ పవర్స్ ఏవో జేసన్ తెలుసుకునే సన్నివేశాలు చాలా ఫన్నీగా ఉంటాయి. అయితే క్యారెక్టర్లను ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో ప్రథమార్థం కొంచెం స్లో అయిన ఫీలింగ్ వస్తుంది. అయితే సెకండాఫ్ మాత్రం స్క్రీన్ ప్లే పరిగెడుతుంది. కథలో ప్రత్యేకంగా హీరోయిన్, లవ్‌ట్రాక్ లాంటివి లేకపోవడం పెద్ద రిలీఫ్.
ఇక నటీనటుల విషయానికి వస్తే.. జేసన్ పాత్రలో టొవినో థామస్, షిబు పాత్రలో గురు సోమసుందరం నటించారనడం కంటే జీవించారని చెప్పవచ్చు. రెండు పాత్రల్లోనూ చాలా షేడ్స్ ఉన్నాయి. ముఖ్యంగా ప్రీ-క్లైమ్యాక్స్, క్లైమ్యాక్స్‌లో గురు సోమసుందరం నటనతో కట్టిపడేస్తాడు. ఒక సాధారణ వ్యక్తి సూపర్ హీరోగా, ఒక మానసిక రోగి సూపర్ విలన్‌గా మారడానికి కారణమైన సన్నివేశాలు అంత పండాయంటే వీరి నటన కూడా కారణమే. ఇక టొవినో థామస్ మేనల్లుడిగా నటించిన బాల నటుడు వశిష్ట్ ఉమేష్, తనకు సాయం చేసే కరాటే టీచర్‌గా నటించిన ఫెమినా జార్జ్‌లు తమ పాత్రలకు న్యాయం చేశారు. సినిమాలో హీరో, విలన్ తర్వాత వీరివే ప్రధాన పాత్రలు.
సమీర్ తాహిర్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సుచిన్ శ్యామ్, షాన్ రహమాన్ అందించిన పాటలు ఎప్పుడు వచ్చాయి, ఎప్పుడు వెళ్లాయో కూడా తెలియదు. ఎందుకంటే సినిమాలో అన్ని పాటలూ కథలో భాగంగా బ్యాక్‌గ్రౌండ్‌లోనే వస్తాయి. సుచిన్ శ్యామ్ నేపథ్య సంగీతం కూడా అద్భుతంగా అందించాడు. అయితే సినిమా ఎడిటింగ్ కొంచెం క్రిస్ప్‌గా ఉంటే బాగుండేది. నెమ్మదిగా సాగిన ప్రథమార్థంలో కొంత నిడివి తగ్గేది.
ఓవరాల్‌గా చెప్పాలంటే.. కథ, కథనాల పరంగా మనదేశంలో బెస్ట్ సూపర్ హీరో సినిమా ఇదే. క్రిష్ కూడా పెద్ద సక్సెస్ అయినప్పటికీ.. అందులో కథ, క్యారెక్టరైజేషన్ల మీద కంటే యాక్షన్ సన్నివేశాలు, గ్రాండియర్ మీదనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సూపర్ హీరో జోనర్ మీకు నచ్చితే మిన్నల్ మురళి మీరు కచ్చితంగా చూడాల్సిన సినిమాల్లో ఒకటి. కాబట్టి ఆలస్యం చేయకుండా ఖాళీ ఉన్నప్పుడు చూసేయండి మరి!
Also Read: మహేష్ బాబుకు ఇష్టమైన కో-డైరెక్టర్... దర్శకుడిగా కోలీవుడ్‌లో సత్తా చాటాడోయ్!
Also Read: భీమ్లా నాయక్... పవన్ కల్యాణ్ కోసం త్రివిక్రమ్ స్పెషల్ క్లైమాక్స్!
Also Read: నా చేతుల్లో ఏమీ లేదు... ఫ్యాన్స్‌కు క్షమాపణలు - 'భీమ్లా నాయక్' నిర్మాత
Also Read: ఏపీలో టికెట్ రేట్స్ ఎఫెక్ట్... ఇండియాలో భారీ స్క్రీన్ మూసివేత
Also Read: అర్ధరాత్రి ఆ హీరో ఇంటి దగ్గర కెమెరా కంటికి చిక్కిన హీరోయిన్
Also Read: వందల వేల లక్షల కోట్లు ఎలా వస్తున్నాయ్? రాజకీయ అవినీతిని టార్గెట్ చేసిన 'గాడ్సే'
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి