(Source: ECI/ABP News/ABP Majha)
మళ్లీ కోత మొదలెట్టిన 'మెటా', ఈసారి 10వేల మంది ఇంటికి!
ఇప్పటికే కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 13 శాతం (11 వేల మంది) ఉద్యోగులను తొలగించగా, ఇప్పుడు కూడా ఖర్చులను తగ్గించుకునేందుకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కోత పెట్టనుంది.
ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా ప్లాట్‌ఫామ్ మరోసారి 10 వేల ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. నాలుగు నెలల క్రితం 11 వేల మందిని తొలగించిన కంపెనీ రెండో రౌండ్‌లోనూ అదే స్థాయిలో ఉద్యోగులను ఇంటికి పంపాలనుకుంటోంది. ‘మా బృందం పరిమాణం 10 వేల మందిని తగ్గించనున్నాం, 5000 అదనపు ఉద్యోగుల నియామకం కూడా ఉండదు’ అని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు.
ఇప్పటికే కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 13 శాతం (11 వేల మంది) ఉద్యోగులను తొలగించగా, ఇప్పుడు కూడా ఖర్చులను తగ్గించుకునేందుకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కోత పెట్టనుంది. మెటాలో పునర్నిర్మాణ పనులు విస్తరించడం, తక్కువ ప్రాధాన్యత ప్రాజెక్టులను రద్దు చేయడం, నియామకాల తగ్గింపు వంటి అంశాలు లేఆఫ్‌కు కారణమని కంపెనీ వెల్లడించింది.
వార్షికంగా ఖర్చులను 95 బిలియన్ డాలర్ల నుంచి 89 బిలియన్ డాలర్లకు కుదించాలన్న మార్క్ జుకర్‌బర్గ్ ఆలోచనకు అనుగుణంగానే ఉద్యోగులను మెటా తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా టెక్ పరిశ్రమలో ఉద్యోగాల కోతలు కొనసాగుతూనే ఉండగా, 2022 సంవత్సరం నుంచి ఇప్పటివరకు దాదాపు 2.90 లక్షల మందిపై వేటుపడింది. దీనిలో 40 శాతం కోతలు 2023లో జరిగాయని లేఆఫ్ ట్రాకింగ్ సైట్ లేఆఫ్స్.ఎఫ్‌వైఐ (https://layoffs.fyi/) వెల్లడించింది. మార్క్ జుకర్‌బర్గ్ నిర్ణయంతో 2023 `ఇయర్ ఆఫ్ ఎఫిషియెన్సీ`గా నిలుస్తుందని చెబుతున్నారు.
అమెరికాలో ఆర్థిక పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. ఫలితంగా అమెరికా కార్పొరేట్ కంపెనీలు సామూహికంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. వాల్‌స్ట్రీట్ బ్యాంకులుగా పేరొందిన గోల్డ్‌మాన్ సాచెస్, మోర్గాన్ స్టాన్‌లీ వంటి సంస్థలు మొదలు అమెజాన్ డాట్‌కాం, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలు కూడా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గతేడాది నుంచి ఇప్పటి వరకు టెక్ పరిశ్రమలు 2.80 లక్షల మందికి పైగా ఉద్యోగులకు లే-ఆఫ్స్ ప్రకటించాయి. ఈ ఏడాదిలో ఉద్యోగాల తొలగింపు 40 శాతానికి చేరుతుందని లే-ఆఫ్స్ ట్రాకింగ్ వెబ్‌సైట్ పేర్కొంది. గత రెండు నెలల్లోనే అమెరికా కంపెనీలు 1.80 లక్షల మందికి పైగా ఉద్యోగులను సాగనంపాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతున్నది.
Also Read:
1.5 లక్షల ఉద్యోగాలు ఉఫ్..
ద్రవ్యోల్బణ భయంతో దాదాపు బడా కంపెనీలన్నీ లేఆఫ్‌లు మొదలు పెట్టాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచే ఉద్యోగులను ఇంటికి పంపే ప్రక్రియ మొదలైంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం...ఈ ఏడాది జనవరి నుంచే టెక్ కంపెనీలు, యూనికార్న్స్, అంకుర సంస్థలు మొత్తంగా 1.53 లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి. ఈ లెక్కన చూస్తే రోజుకి 2,700 మంది లేఆఫ్‌కు గురవుతున్నారు. ఉద్యోగాలు పోయి కొందరు బాధ పడుతుంటే మరి కొందరు జీతాల్లేక అవస్థలు పడుతున్నారు.
కొన్ని కంపెనీలు తమ ఎంప్లాయీస్‌కు జీతాలివ్వకుండా ఆపేస్తున్నాయి. మరి కొన్ని కంపెనీలు వేతనాల్లో కోత పెడుతున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం సహా అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థ కుదేలవడం వల్ల సంస్థలన్నీ ఆందోళన చెందుతున్నాయి. ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగడం లేదు. అందుకే పెద్ద మొత్తంలో లేఆఫ్‌లు కొనసాగిస్తున్నాయి. కొన్ని సంస్థలైతే రిక్రూట్‌మెంట్ ప్రక్రియను నిలిపివేశాయి. Trueup.io డేటా ప్రకారం...ప్రపంచవ్యాప్తంగా 534 కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. గతేడాదిలో 2.41 లక్షల మంది ఉద్యోగులు లేఆఫ్‌లకు బలి అయ్యారు. రోజుకి 1,535 మంది జాబ్‌లు పోయాయి.
ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలన్నీ లేఆఫ్‌లు కొనసాగిస్తున్నాయి. కొన్ని సంస్థలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. మెటాతో మొదలైన ఈ ట్రెండ్...అన్ని కంపెనీలకు విస్తరించింది. ఇప్పుడు మరోసారి మెటా కంపెనీ లేఆఫ్‌లు చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి కొద్ది రోజుల్లోనే భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించనున్నట్టు తెలుస్తోంది. Financial Times రిపోర్ట్ ప్రకారం ఫేస్‌బుక్ పేరెంట్ కంపెనీ మెటా పలు టీమ్‌లకు అవసరమైన బడ్జెట్‌ను రిలీజ్ చేయలేదు. అంటే...ఇన్‌డైరెక్ట్‌గా లేఆఫ్‌లు ప్రకటిస్తున్నట్టు సంకేతాలిచ్చింది. ఉద్యోగులను తొలగించిన తరవాతే బడ్డెట్‌లు విడుదల చేయాలని భావిస్తోంది యాజమాన్యం.
ఇప్పటికే ఉద్యోగుల్లో లేఆఫ్‌ల భయం మొదలైంది. ఎప్పుడు ఎవరికి పింక్ స్లిప్ ఇస్తారో అని కంగారు పడిపోతున్నారు. గతేడాది నవంబర్‌లో ఒకేసారి 11 వేల మందిని తొలగిస్తున్నట్టు ప్రకటించడం సంచలనమైంది. ఆ కంపెనీలోని మొత్తం ఉద్యోగుల్లో ఇది 13%. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లలో మొత్తంగా కలిపి 11 వేల మందిని ఇంటికి పంపింది మెటా. ఇటీవలే జుకర్ బర్గ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది తమకు ఎంతో కీలకమని చెప్పారు. మార్కెట్‌కు అనుగుణంగా నడుచుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని అన్నారు. ఇలా పలు మార్గాల్లో తమ డబ్బును ఆదా చేస్తున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి డిస్నీ కూడా చేరిపోయింది. ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజంగా వెలుగొందుతున్న డిస్నీ 7,000 మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్లు ప్రకటించింది. ఉద్యోగుల తొలగింపు నిర్ణయాన్ని సీఈఓ బాబ్ ఐగర్ తీసుకున్నట్టు ఆ కంపెనీ వెల్లడించింది.
గతేడాది డిసెంబరులో కంపెనీ పగ్గాలను ఆయన తీసుకున్నారు. ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను అంత తేలిగ్గా తీసుకోలేదని సీఈఓ బాబ్ ఐగర్ తెలిపారు. వినియోగదారులు ఖర్చులను తగ్గించడంతో గత త్రైమాసికంలో తమ స్ట్రీమింగ్ సబ్‌స్క్రైబర్స్ సంఖ్యలో చాలా మార్పు వచ్చిందన్నారు. భారీగా సబ్‌స్క్రైబర్స్ తగ్గిపోయారని కంపెనీ తెలిపింది. అంతకు ముందు కంపెనీ కస్టమర్ల సంఖ్య పెరిగింది.