మీరు ఎక్కువ కాలం బతకాలనుకుంటున్నారా? అయితే ఎలాంటి మంత్రం అవసరం లేదు. మీ నడకే మీ ఆయుష్షును పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవును మీరు చదింది నిజమే. మీరు త్వరగా చనిపోయే ప్రమాదాన్ని తగ్గించాలి అనుకుంటే రోజుకు సుమారుగా 6.4 కి.మీ నడవడానికి సమానమైన 8,000 అడుగులు వేయడం చాలా ముఖ్యమని నిపుణులు అంటున్నారు. అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ జర్నల్‌లో ప్రచురించిన కొత్త అధ్యయనం ప్రకారం నడిచే వేగం అదనపు ప్రయోజనాలను అందిస్తుందని కూడా చెబుతున్నారు.
మీరు రోజుకు దాదాపు 10,000 అడుగులు నడిచినట్లైతే మీ ఆరోగ్యం మరింత మెరుగవుతుందని అధ్యయనంలో తేలింది. 1960లలో జపాన్ లోని కొందరు నిపుణులు ఓ పరిశోధనలో ఈ విషయాన్ని వెల్లడించారు. కానీ సైన్స్ పరంగా దీనికి ఎటువంటి ఆధారం లేదని స్పెయిన్‌లోని గ్రెనడా విశ్వవిద్యాలయం (UGR) ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ విభాగం నిపుణులు చెబుతున్నప్పటికీ, ఫిట్నెస్ కారణంగా జబ్బులు రావని వారు సైతం నిర్ధారిస్తున్నారు. చాలా మందికి రోజుకు 9,000 అడుగులు లక్ష్యంగా పెట్టుకొని వాకింగ్ చేస్తుంటారని, నిజానికి ఇది చాలా మంచి కౌంట్ అని నిపుణులు చెబుతున్నారు.
ఇటీవల కొందరు పరిశోధకులు 110,000 కంటే ఎక్కువ మందిపై పన్నెండు అంతర్జాతీయ అధ్యయనాల నుంచి డేటాను విశ్లేషించి కొన్ని సంచలన విషయాలను బయటపెట్టారు. ఈ అధ్యయనం ఫలితాలు ఇతర ఇటీవలి అధ్యయనాలకు అనుగుణంగా ఉన్నాయి. స్త్రీ, పురుషుల మధ్య ఎలాంటి తేడా లేకుండా వేగంగా నడవడం వల్ల మరణాల ప్రమాదం తగ్గుతుందని ఈ నివేదిక తెలిపింది. నిపుణుల ప్రకారం "మీరు స్మార్ట్ వాచ్, యాక్టివిటీ ట్రాకర్ లేదా మీ జేబులో స్మార్ట్‌ఫోన్ ద్వారా ఎన్ని అడుగులు వేశారు సులభంగా లెక్కించుకోవచ్చని, తద్వారా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని కూడా చెబుతున్నారు.
ఇదే విషయాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పలువురు కార్డియాలజిస్టులు కూడా నిర్ధారిస్తున్నారు. నడక వల్ల డయాబెటిస్ ప్రభావం కూడా తగ్గుతుందని సూచిస్తున్నారు. నడక అనేది బరువు తగ్గడానికి కూడా చాలా ఉపయోగపడుతుందని తద్వారా, మనిషి మరింత చురుగ్గా మారే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. నడకతో పాటు చక్కటి ఆహారం కూడా తీసుకోవడం ద్వారా మీ ఆరోగ్యం మరింత బాగుపడుతుందని తద్వారా సుదీర్ఘకాలం దీవించే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతోపాటు ప్రతిరోజు ఆరు కిలోమీటర్లు నడవడం ద్వారా శరీరంలోని టాక్సిన్స్ చెమట రూపంలో బయటకు వస్తాయని, అప్పుడు మీ శరీరంలోని మలినాలు బయటకు వచ్చి మీరు మరింత ఆరోగ్యంగా జీవించేందుకు దోహదపడుతుందని అంటున్నారు. అధిక రక్తపోటు, డయాబెటిస్, గుండె జబ్బులు ఉన్నవారు సైతం నడకను అలవాటుగా చేసుకోవాల్సి ఉంటుందని అయితే గుండె జబ్బులు ఉన్నవారు మాత్రం వేగంగా నడవకూడదని డాక్టర్లు సూచిస్తున్నారు.
Read Also : రోగి నాలుకను డాక్టర్ ఎందుకు పరీక్షిస్తారో తెలుసా? ఇదిగో ఇందుకే!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.