Health Benefits of Walking After Eating : మీరు రోజులో ఎప్పుడు నడిచినా.. భోజనం చేసిన తర్వాత కాసేపు నడిస్తే దానికి రెట్టింపు ప్రయోజనాలు పొందుతారని చెప్తున్నారు నిపుణులు. అవును మీరు ఖాళీగా ఉన్నప్పుడు నడవడం కంటే భోజనం తిన్న తర్వాత నడిస్తే ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తున్నారు. బరువు తగ్గడం నుంచి మధుమేహం కంట్రోల్ చేయడం వరకు.. జీర్ణ సమస్యలను తగ్గించుకోవడం నుంచి గుండె సమస్యలను దూరం చేయడం వరకు ఎన్నో లాభాలు ఉంటాయని చెప్తున్నారు. అయితే తిన్న తర్వాత నడవడం వల్ల కలిగే లాభాలు ఏంటో.. ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటో చూసేద్దాం. 

బరువు తగ్గడం

తిన్న తర్వాత వాకింగ్ చేస్తే శరీరంలో కేలరీలు ఎక్కువగా బర్న్ అవుతాయి. దీనివల్ల తీసుకున్న ఆహారం ఫ్యాట్ రూపంలో కన్వెర్ట్ కాకుండా ఉంటుంది. కార్బ్ క్రేవింగ్స్ కంట్రోల్ అవుతాయి. షుగర్ క్రేవింగ్స్ అదుపులో ఉండి.. బరువు తగ్గడంలో మంచి ఫలితాలు ఇస్తుంది. మెటబాలీజం పెరిగి.. ఎనర్జిటిక్​గా ఉంచుతుంది. కేలరీలు బర్న్ చేస్తూ బరువు అదుపులో ఉండేలా చేస్తుంది.

జీర్ణ సమస్యలు దూరం.. 

ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ఇలా ఎప్పుడు ఫుడ్ తీసుకున్నా కాసేపు వాకింగ్ చేస్తే జీర్ణ సమస్యలను దూరమవుతాయని చెప్తున్నారు నిపుణులు. దీనివల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది. గ్యాస్ సమస్యలు దూరమవుతాయి. తీసుకున్న ఆహారం జీర్ణమై.. శరీరానికి పోషకాలు అందుతాయట. 

మధుమేహం కంట్రోల్

మధుమేహం సమస్యలు ఉన్నవారు భోజనం చేసిన తర్వాత కాసేపు నడిస్తే చాలు. రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నవారికి ఇది మరిన్ని ప్రయోజనాలు అందిస్తుంది. 

గుండె ఆరోగ్యానికై.. 

భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేస్తే రక్త ప్రసరణ మెరుగవుతుంది. బీపీ కంట్రోల్ అవుతుంది. రెగ్యులర్​గా చేస్తే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గి.. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. 

మెంటల్ హెల్త్​కై..

తిన్న తర్వాత శరీరానికి వాకింగ్​ రూపంలో ఫిజికల్ మూమెంట్స్ ఇవ్వడం వల్ల ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి. సెరోటోనిన్ కూడా విడుదలై ఒత్తిడిని, యాంగ్జైటీని దూరం చేస్తాయి. పనిపై ఫోకస్ పెరుగుతుంది. 

నిద్ర నాణ్యత

తిన్న తర్వాత కాసేపు నడవడం వల్ల శరీరం రిలాక్స్ అవుతుంది. ముఖ్యంగా త్వరగా డిన్నర్ చేసి ఆపైనా కాసేపు నడిస్తే రాత్రి మీరు పడుకునే సమయానికి మంచి నిద్ర మీ సొంతమవుతుంది. నిద్ర సమస్యలు దూరమై, నాణ్యత పెరుగుతుంది. 

ఫాలో అవ్వాల్సిన టిప్స్

తిన్న తర్వాత వాకింగ్ చేస్తే మంచిదే. కానీ కొన్ని టిప్స్ ఫాలో అయితే మరిన్ని మంచి ఫలితాలుంటాయి. మీరు తిన్న తర్వాత 10 నుంచి 30 నిమిషాలు నడిస్తే చాలు. ఎక్కువ టైమ్ లేదనుకుంటే 10 నుంచి 15 నిమిషాలు అయినా నడవాలి. వేగంగా నడవాల్సిన పని లేదు. జస్ట్ సింపుల్​గా నడిచినా చాలు. నడిచే ముందు తర్వాత ఎక్కువ మోతాదులో కాకుండా కాస్త నీరు తీసుకుంటే మంచిది. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.