Avatar Re Release: కేమరూన్ చెప్పిన 'అవతార్' కథ - మళ్లీ చూద్దాం రా!
2009లో వచ్చిన జేమ్స్ కేమరూన్ బ్లాక్‌బస్టర్ అవతార్ రీ-రిలీజ్ సందర్భంగా ఏబీపీ ఎక్స్‌క్లూజివ్ స్టోరీ!
పదమూడేళ్ల క్రితం మా తాతయ్య ఓ కథ చెప్పాడు. అప్పటివరకూ అల్లరి చేసీ ఆడుకుని అలసిపోయిన బోసి నవ్వుల బుజ్జాయిలం మేమంతా తాత చెప్పే కథ మీద మెల్లగా దృష్టి పెట్టాం. మా మొహంపై పడుతున్న ముంగురులను చిటికెన వేలితో సరి చేస్తూ తాత కథలో మరింత ముందుకు వెళ్లాడు. ఒక అందమైన ప్రపంచాన్ని పరిచయం చేశాడు. పేరు పండోరా. అక్కడ కూడా మాలాంటి పిల్లలే గంతులేస్తున్నారు. బహుశా మేమేనేమో. తల తిప్పి చుట్టూ చూస్తే పొడుగాటి చెట్లున్నాయి. వాటి రెండు చేతులు గాల్లోకి అలా చాచి ఆకాశాన్ని అర్థిస్తున్నట్లున్నాయి. కొండ అంచుల దాకా నడుచుకుంటూ వెళ్తే ఆశ్చర్యం. కళ్ల ముందు గాల్లో వేలాడుతూ పేద్ద కొండలు కనిపించాయి. వాటి పైనుంచి జలపాతాలు అలా గాల్లోకి జారిపోతున్నాయి. ఆ తుంపరలు గాలికి ఎగిరొచ్చి మా మొహాలను తాకాయి. ఆ తడిని తుడుచుకోవాలో..అనుభవించాలో తెలియని అమాయకత్వం మాది. అలాంటి కొండలు వందలు వేలున్నాయి అక్కడ. ఆ కొండను ఈ కొండను ముడివేస్తూ పెద్ద చెట్ల వేర్లు తాళ్లలా ఉన్నాయి. ఆ వేర్లను కప్పేసిన పాకుడుపై జారుతూ ఆ కొండకు ఈ కొండకు తిరిగాం మేమంతా. పట్టుతప్పి కిందపడిపోతామన్న భయం లేదు. ఈలోగా మెల్లగా చీకటి పడింది.
ఎక్కడి నుంచో గాల్లో ఎగురుతూ వచ్చాయి తెల్లగా ఉన్న పుప్పొడి పురుగులు. ఒకటి కాదు రెండు కాదు వందలుగా వచ్చి మా ఒంటి మీద వాలాయి. ఆశ్చర్యం అవి కాంతిపుంజాల్లా వెలుగుతున్నాయి. వాటి వెలుగు మమ్మల్ని కప్పుకోవటంతో మేం కూడా నక్షత్రాల్లా వెలిగిపోతున్నాం. ఈలోగా తొండ లాంటిదేదో కనపడితే మాలో ఒకడు దానితో ఆడుకుందామని పట్టుకోబోయాడు. అది ఒక్కసారిగా గాల్లోకి లేచి తన రెక్కలను గిరాగిరా చక్రంలా తిప్పింది. నోరెళ్లబెట్టాం. ఆ పక్కనే తామరఆకుల్లా పెద్దగా కొన్ని ముళ్ల పొదలు కనిపించాయి. మాలో ఇంకొకడు వాటిని ఇలా ముట్టుకున్నాడో లేదో ధగధగ మెరిసిపోయాయి. ఏదో తమలో తమకు బాగా పరిచయం ఉన్నట్లు అన్నింటిలోనూ అప్పటివరకూ చూడని మెరుపు మొదలైంది. వాటికి ఎలా తెలిసిందో తమలో ఒకడిని పలకరించామని. వాటితో అవి మాట్లాడుకున్నాయా..?
మాకు వినపడలేదే..! చూస్తుండగానే ఆ వెలుతురుతో అంతా పట్టపగలులా మారిపోయింది. ఎన్నో రంగులు..రెండు కళ్లు సరిపోవటం లేదు చూడటానికి.
ఇంతలోనే పెద్దగా అలికిడి. తల తిప్పి చూస్తే పది అడుగుల ఎత్తున్న మనిషి ఆ అడవిలాంటి ప్రాంతంలో అటూ ఇటూ అమాయకంగా తిరుగుతున్నాడు. మాకంటే కొత్తేమో ఈ ప్రపంచానికి నానా హడావిడి చేసేశాడు. కోరలు పెంచుకుని అక్కడే దాక్కున్న తోడేళ్లకు కోపమొచ్చింది. ఆ మనిషిపై దుమకబోతుంటే ఇంతలోగా మరో అడవి పిల్ల వచ్చింది. అతగాడిని ఆ అడవి తోడేళ్ల నుంచి కాపాడింది. పేరు నేయిత్రి అంట. 'నావి' అనే అంతరించి పోతున్న జాతికి చెందిన అమ్మాయినని పరిచయం చేసుకుంది. అడవికి కొత్తగా వచ్చిన ఆ అమాయకుడి బేలతనానికి జాలి పడి వాళ్ల కట్టుబాట్లు అన్నీ నేర్పింది. తమ తెగకు తీసుకెళ్లి పరిచయం చేసింది. కొంతమంది కాదన్నారు. పోరాడింది. అతగాడిని తమ మనిషిగా మార్చే బాధ్యత తీసుకుంది. గుర్రాల్లాంటి వింత జంతువులను మచ్చిక చేసుకోవటం నేర్పింది. ఈ లోగా వాడు 'మనిషి' అని తేలింది.
వాడు వచ్చిన పని వేరే ఉందిలే. అంత అందమైన అడవిని కూలదోసి అక్కడ తవ్వకాలు జరిపి విలువైన ఖనిజాలను కొట్టేయాలని వచ్చిన స్వార్థపూరిత మానవజాతిలో ఒకడు వాడు. వాళ్లు అనుకునే ప్రగతికి, వినాశనానికి ఏకకాలంలో కారణమైన యంత్రాలు, బాంబులు, యుద్ధవిమానాలతో ప్రశాంతమైన ఆ అడవి మొత్తం హోరెత్తిపోయింది. పవిత్రమైన చెట్లను నిలువునా నరికేశారు. పేలుడు పదార్థాలతో నానా విధ్వంసం చేసి అక్కడి అందమైన ప్రకృతినంతా నాశనం చేసేశారు.
తను మనిషే అయినా ఆ అడవి మనుషుల తరపున నిలబడాలనుకున్నాడు నేయిత్రి చెలికాడు. అతను సామాన్యుడు కాదు. నీలిరంగు శరీరం, పసుపు పచ్చగా మెరిసిపోయే కళ్లతో ఏకంగా తురుక్ మక్తో నే లొంగదీసుకున్నాడు. సింహం లాంటి శక్తి, డ్రాగన్లను తలదన్నే ఠీవి, డైనోసార్ల లాంటి బలం అన్నీ కలగలసిన కింగ్ బర్డ్ అది. దాన్ని పట్టాడంటేనే తమని కాపాడటానికి వచ్చిన నాయకుడని ఆ అడవి మనుషులకు తేలిపోయింది. సలామంటూ ఆ వీరుడి సైన్యంగా మారారు. యుద్ధాన్ని గెలిచారు. భూగ్రహంలానే తమ గ్రహాన్ని చెరచాలని చూసిన స్వార్థపూరిత మనుషులను బందీలుగా తిరిగి వాళ్ల సొంతగ్రహానికి తరిమేశారు. ఇక తాతయ్య కథ ముగించాడు. అప్పటికే ఆడి ఆడి అలసిపోయిన మాలో చాలా మంది నిద్రపోయారు. నాకు మాత్రం తాత చూపించిన ప్రపంచం నిద్రపట్టనివ్వలేదు. తాత కథ అసలు ఎందుకలా చెప్పాడు. ఆలోచించటానికి ప్రయత్నించినా నా వయస్సు సరిపోలేదు.
సినిమా అనేది రంగుల ప్రపంచం. ఆ వెండితెరపై కాసేపు కాలక్షేపం చేయిద్దామని సినిమాలు తీసేది కొందరైతే...ఆ చిన్న కాన్వాస్ ను ఉపయోగించి తనతోటి మనుషులతో కాసేపు ప్రేమగా మాట్లాడదామని ప్రయత్నించేది మరికొందరు. కానీ మనలో ఎవరైనా వింటారా..వినరు.! అందుకే తాతయ్య 'జేమ్స్ కేమరూన్' పండోరా అనే గ్రహాన్ని సృష్టించాడు. ఆల్ఫా సెంచురీలు, గ్యాస్ జెయింట్ లు దానికి ఉన్న మూన్ లు, పండోరా గ్రహాలు అందరికీ అర్థం కాకపోవచ్చు. 'అవతార్' అనే హ్యూమన్ హైబ్రిడ్స్, ఆర్డీఏ గా పిలుచుకునే పెట్టుబడిదారి శక్తులు, Unobtanium లాంటి విలువైన ఖనిజాలు నిజంగా లేకపోవచ్చు. నేను అవతార్ సాధించిన కలెక్షన్లు, పదమూడేళ్లు అవుతున్నా ఇంకా దాని పేరు మీదే ఉన్న చెక్కుచెదరని రికార్డుల గురించి అస్సలు మాట్లాడటం లేదు.
పండోరా అనే ఊహకు అందని ప్రపంచం మీద జేమ్స్ కేమరూన్ అనే దార్శనికుడు చూపించినంతటి అందమైన ప్రకృతి మనకు కూడా ఉంది. ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యి ఈ భూ ప్రపంచం అంతా విస్తరించిన ఎలక్ట్రో కెమికల్ లాంగ్వేజ్ ను మన భూమి మీదున్న మొక్కలు, చెట్లు కూడా అర్థం చేసుకోగలవు. ఇక్కడ కూడా పుడమి పొరల్లో నిక్షిప్తమైన ఎంతో విలువైన ఖనిజాలు, గలగలా పారే సెలయేర్లు, జీవనాధారమవుతున్న నదులున్నాయి. కానీ మనం ఏం చేస్తున్నాం. వాటి విలువ మనకు తెలుస్తోందా.? అదుగో పండోరాలో మనుషుల్లా...మనపై మనమే పడి కొట్టుకు చస్తున్నాం. దేశాలు, ప్రాంతాలు, కులాలు, మతాల పేరుతో నానా విధ్వంసం చేసుకుంటున్నాం. కేమరూన్ పండోరా పై చూపించిన నావి తెగ మనలోని మంచికి, అక్కడ చూపించిన మనుషులు మనలోని స్వార్థానికి సింబాలిజం. అందుకే మరో ఆలోచన లేకుండా ఇంత అందమైన ప్రకృతిని మనకు మనమే నాశనం చేసుకుంటున్నాం. అదే జేమ్స్ కేమరూన్ చెప్పాడు. పదమూడేళ్ల క్రితం తాత చెప్పిన కథ అర్థం కాలేదా. బహుశా నువ్వు అప్పుడు పడుకుండిపోయిన పిల్లల్లో ఉన్నావేమో. రా అదే కథను మళ్లీ తాత మరింత రంగుల తెరమీద ఇంకాస్త అందంగా చెబుతున్నాడు. చూద్దాం పద.