ఈ మధ్యకాలంలో మలయాళంలో హిట్ అయిన చాలా సినిమాలను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి లాంటి స్టార్ హీరోలు ఈ రీమేక్స్ లో నటిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'గాడ్ ఫాదర్' సినిమా.. మలయాళ 'లూసిఫర్'కి రీమేక్. మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ 'లూసిఫర్' సినిమాను నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ తెరకెక్కించారు. తనలో మంచి నటుడే కాదు.. దర్శకుడు కూడా ఉన్నాడని ఈ సినిమాతో నిరూపించుకున్నారు పృథ్వీరాజ్. 


ఇప్పుడు 'లూసిఫర్' సినిమాకి సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఆ విషయాన్ని పక్కన పెడితే మరోసారి మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి 'బ్రో డాడీ' అనే సినిమా చేశారు. ఈ సినిమాను డైరెక్ట్ చేయడంతో పాటు మోహన్ లాల్ కొడుకుగా నటించారు పృథ్వీరాజ్. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. 


తండ్రీకొడుకులైన వీరిద్దరూ.. చూడడానికి బ్రదర్స్ లా ఉంటారు. అందరూ అలానే అనుకుంటూ ఉంటారు. దాన్నే టైటిల్ గా 'బ్రో డాడీ' అని పెట్టారు. ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్. తన కొడుకు పెళ్లి విషయంలో పడే ఇబ్బందులను ఒక తండ్రిగా మోహన్ లాల్ ఎలా డీల్ చేశారనేదే సినిమా కథ. ఇందులో మోహన్ లాల్ కి జోడీగా మీనా నటించగా.. పృథ్వీరాజ్ సరసన కళ్యాణి ప్రియదర్శన్ నటించింది. 


ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడంతో ఈ సినిమాపై టాలీవుడ్ దర్శకనిర్మాతల దృష్టి పడింది. ఓటీటీ వేదికగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. సినిమాకి గనుక మంచి టాక్ వస్తే.. రీమేక్ రైట్స్ కొనేసి.. సినిమా స్థాయిని పెంచి తెలుగులో తీయాలనుకుంటున్నారు. మరి సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి!






Also Read: 'మీరెప్పటికీ మాతోనే ఉంటారు..' నమ్రత ఎమోషనల్ పోస్ట్..