సూపర్ సార్ట్ కృష్ణ తనయుడు, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు శనివారం రాత్రి ఆరోగ్య సమస్యలతో మరణించారు. లివర్ సంబంధిత వ్యాధితో ఆయన కన్నుమూసినట్లు తెలుస్తోంది. శనివారం సాయంత్రం ఆయన తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రికి తరలించారు. కానీ ఆయన అప్పటికే మరణించినట్టు వైద్యులు పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు కృష్ణ ఫ్యామిలీకి సంతాపం తెలుపుతున్నారు. తండ్రి సూపర్ స్టార్ అయినప్పటికీ.. రమేష్ బాబు మాత్రం హీరోగా నిలదొక్కుకోలేకపోయారు. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. 


కానీ కృష్ణ గారికి మాత్రం రమేష్ బాబుని పెద్దగా హీరోగా చూడాలని ఉండేదట. అందుకే ఆయన సూపర్ స్టార్ గా ఉన్నప్పుడే రమేష్ బాబుని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. దాసరి నారాయణరావు రూపొందించిన 'నీడ' అనే సినిమాతో రమేష్ బాబుని పరిచయం చేశారు. అప్పటికి రమేష్ బాబు పదో తరగతి చదువుకుంటున్నారు. ఆ తరువాత రమేష్ యంగేజ్ లోకి వచ్చాక ఆయనకు నటనలో ట్రైనింగ్ ఇప్పించి గ్రాండ్ గా పరిచయం చేయాలనుకున్నారు. 


'సామ్రాట్' అనే సినిమా ఓకే చేశారు. వి.మధుసూధన రావు దీనికి దర్శకుడు. అప్పట్లో బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన 'బేతాబ్' సినిమాకి ఇది రీమేక్. తెలుగులో ఈ సినిమాకి 'సామ్రాట్' అనే టైటిల్ పెట్టగా.. అప్పట్లో ఈ టైటిల్ వివాదాస్పదమైంది. బాలకృష్ణ కూడా తన సినిమాకి 'సామ్రాట్' అనే టైటిల్ పెట్టుకున్నారు. దీంతో కృష్ణ గారు కోర్టుకి వెళ్లి టైటిల్ కోసం పోరాడారు. 


ఫైనల్ గా టైటిల్ కృష్ణ గారికే చెందుతుందని కోర్టు తీర్పు ఇవ్వడంతో బాలకృష్ణ తన సినిమాకి 'సాహస సామ్రాట్' అని పేరు మార్చుకోవాల్సి వచ్చింది. రమేష్ బాబు 'సామ్రాట్' 1987లో విడుదలైంది. ఆ తరువాత కోదండ రామిరెడ్డి డైరెక్ట్ చేసిన 'బజార్ రౌడీ' అనే సినిమా రమేష్ బాబుకి భారీ విజయాన్ని తీసుకొచ్చింది. అతడి కెరీర్ లో ఇదొక బ్లాక్ బస్టర్. దాసరి నారాయణ రావు, వి మధుసూధనా రావు, జంధ్యాల, కె మురళి మోహన్ రావు, ఎస్ ఎస్ రవిచంద్ర లాంటి దర్శకులతో పని చేసినా.. హీరోగా మాత్రం ఎక్కువకాలం రాణించలేకపోయారు రమేష్ బాబు. కానీ కృష్ణగారు మాత్రం ఎప్పుడూ రమేష్ బాబు గురించే ఆలోచించేవారట. 


Also Read: రామ్.. మంచి కాఫీ లాంటి అబ్బాయ్.. భర్తపై ప్రేమ కురిపించిన సునీత..


Also Read: 2022.. చప్పగా స్టార్ట్ అయిందే..