టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు సుకుమార్. ఇటీవల ఆయన డైరెక్ట్ చేసిన 'పుష్ప' సినిమా భారీ విజయాన్ని అందుకుంది. నిన్నటి నుంచి ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుకుమార్ కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. సుకుమార్ దర్శకుడిగా మారడానికి స్ఫూర్తినిచ్చింది మణిరత్నం అట.
యంగ్ ఏజ్ లో 'గీతాంజలి' సినిమా చూసి ఫిదా అయిపోయానని.. ఆ సినిమా చూసి బయటకు వస్తుంటే గర్ల్ ఫ్రెండ్ ను విడిచిపెట్టి వచ్చేస్తున్నట్లు అనిపించిందని.. ఒక దర్శకుడు సినిమా తీస్తే ఇంతగా జనాలను ప్రభావితం చేయవచ్చా అనిపించి అప్పుడే దర్శకుడు కావాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెప్పుకొచ్చారు సుకుమార్. అలానే తనకు ఇష్టమైన నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ సైతం దర్శకుడిగా మారడంతో డైరెక్షన్ కి ఉన్న పవర్ ఏంటో బాగా అర్ధమై.. దర్శకుడిని కావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.
అయితే తనకు స్ఫూర్తిగా నిలిచిన మణిరత్నంతో చేదు అనుభవం ఉన్నట్లు సుకుమార్ వెల్లడించారు. తాను దర్శకుడ్ని కావడానికి ముందు మణిరత్నంని కలవడానికి చాలా ప్రయత్నాలు చేశానని.. కానీ కుదరలేదని చెప్పారు. అయితే 'ఆర్య' సినిమాతో తాను దర్శకుడిగా మారిన తరువాత మణిరత్నం గారిని ముంబైలో ఓ హోటల్ లో చూశానని.. అప్పుడు ఆయన నటి శోభనతో చాలా సీరియస్ గా ఏదో డిస్కస్ చేస్తూ కనిపించారని తెలిపారు.
వాళ్ల డిస్కషన్ అయిన తరువాత కలుద్దామని అక్కడే వెయిట్ చేశానని.. కానీ ఎంతకీ అది పూర్తికాకపోవడంతో.. ఉండలేక 'సార్' అంటూ దగ్గరికి వెళ్తే.. ఆయన కోపంగా తనవైపు చూస్తూ వెళ్లు అన్నట్లుగా చేతితో సైగ చేశారని.. అప్పుడు చాలా బాధపడ్డానని చెప్పుకొచ్చారు సుకుమార్. కానీ ఒక దర్శకుడు సీరియస్ డిస్కషన్ లో ఉన్నప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ఎలా ఉంటుందో తనకు తరువాత అర్థమైందని.. అదేమీ తప్పుగా అనిపించలేదని అన్నారు. ఎప్పటికైనా మణిరత్నం గారిని కలవాలనేది తన కోరిక అని తెలిపారు.