'క్రాక్' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న రవితేజ.. ఆ తరువాత వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఇప్పటికే రమేష్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' సినిమాను పూర్తి చేశారు. ప్రస్తుతం కొత్త దర్శకుడు శరత్ మండవతో కలిసి 'రామారావు ఆన్ డ్యూటీ' అనే సినిమాను కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. దీంతో పాటు త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. తాజాగా సుధీర్ వర్మతో మరో సినిమాను లైన్ లో పెట్టారు. 

 

దీనికి 'రావణాసుర' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. సంక్రాంతి రోజున ఈ సినిమాను మొదలుపెట్టబోతున్నారు. అభిషేక్ అగర్వాల్ తో కలిసి ఈ సినిమాను నిర్మించబోతున్నారు రవితేజ. ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్, ఫరియా అబ్దులా లాంటి తారలు హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. వీరితో పాటు దక్ష నగర్కార్ అనే యంగ్ హీరోయిన్ ను కూడా తీసుకున్నారు. అయితే ఆమె నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపిస్తుందట. ఈ సినిమాలో రవితేజ లాయర్ గెటప్ లో కనిపించనున్నారు. 

 

ఇదిలా ఉండగా.. తాజాగా రవితేజ, కోలీవుడ్ యంగ్ హీరో విష్ణు విశాల్ కలిసి తీసుకున్న ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేయబోతున్నారట. ఆ ప్రాజెక్ట్ ఏంటనేది మాత్రం ఇంకా తెలియలేదు. ఇదివరకు రవితేజ ప్రకటించిన సినిమాల్లో విష్ణు విశాల్ నటిస్తారా..? లేక కొత్తగా ఏదైనా మొదలుపెట్టబోతున్నారా..? అనే విషయంలో క్లారిటీ రావాల్సి వుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. 'రావణాసుర' సినిమా కోసం విష్ణు విశాల్ ను తీసుకున్నట్లు టాక్. మరి దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందేమో చూడాలి!