దేశంలో కరోనా పాటు ఒమిక్రాన్ వేరియంట్ కూడా విజృంభిస్తోంది. రోజురోజుకి కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా బారిన పడ్డ వారి సంఖ్య లక్ష దాటేసింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ కరోనా మహమ్మారి ఎవరినీ విడిచిపెట్టడం లేదు. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. బాలీవుడ్ లో అర్జున్ కపూర్, స్వరా భాస్కర్, ఏక్తా కపూర్ ఇలా చాలా మంది కోవిడ్ తో ఇబ్బంది పడుతున్నారు.
టాలీవుడ్ లో పేరున్న సెలబ్రిటీలు చాలా మందికి కరోనా సోకింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం కోవిడ్ బారిన పడి ఇప్పుడు ఐసోలేషన్ లో ఉంటున్నారు. తాజాగా సీనియర్ నటుడు నటకిరీటి రాజేంద్రప్రసాద్ కి కరోనా సోకింది. ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్ లో ఆయన్ను చేర్పించారు. కోవిడ్ స్వల్ప లక్షణాలతో ఆయన బాధపడుతున్నట్లు డాక్టర్లు వెల్లడించారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. రాజేంద్రప్రసాద్ త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇటీవలే ఆయన నటించిన 'సేనాపతి' సినిమా ఓటీటీలో విడుదలైంది. ఇందులో రాజేంద్రప్రసాద్ పెర్ఫార్మన్స్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. చిరంజీవి, రామ్ చరణ్ లాంటి స్టార్లు కూడా రాజేంద్రప్రసాద్ నటనను కొనియాడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టారు.
Also Read: కోలీవుడ్ హీరోకి కోవిడ్.. రిలాక్స్ అయిన రవితేజ ఫ్యాన్స్..