ఓవైపు కరోనా.. మరోవైపు ఒమిక్రాన్ కేసులతో దేశం అల్లకల్లోలంగా ఉంది. అయితే ఇప్పటికే థర్డ్ వేవ్ ప్రారంభమైందని కొంతమంది నిపుణులు అంటున్నారు. కానీ ఒమిక్రాన్ కారణంగా వచ్చే థర్డ్ వేవ్ పీక్ స్టేజ్‌లో ఉంటే రోజుకి 10 లక్షల కేసులు వచ్చే అవకాశం ఉందని తాజా అధ్యయనంలో తేలింది. జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి మొదట్లో థర్డ్ వేవ్ పీక్ స్టేజ్‌లో ఉండే అవకాశం ఉందని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (IISc-ISI) తెలిపింది.
IISc-ISIకు చెందిన ఫ్రొఫెసర్ శివ ఆత్రేయ, ఫ్రొఫెసర్ రాజేశ్ సుందరేశన్ నేతృత్వంలోని బృందం ఈ అధ్యయనం చేసింది. అయితే థర్డ్ వేవ్ పీక్ దశ ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉండే అవకాశం ఉందని వీరు తెలిపారు. మార్చి మొదటి నుంచి మళ్లీ కరోనా కేసులు తగ్గే అవకాశం ఉందన్నారు.
మహారాష్ట్రలో అత్యధికంగా 1,009 ఒమిక్రాన్ కేసులు నమోదుకాగా, దిల్లీ (513), కర్ణాటక (441), రాజస్థాన్ (373), కేరళ (333), గుజరాత్ (204) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
మరోవైపు దేశంలో కొత్తగా 1,59,632 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 224 రోజుల్లో ఇదే అత్యధికంగా. యాక్టివ్ కేసుల సంఖ్య 5,90,611కు చేరింది. గత 197 రోజుల్లో ఇదే అత్యధికం. గత ఏడాది మే 29న దేశంలో 1,65,553 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి