Dwakra groups : పొదుపు సంఘాలకు గుడ్ న్యూస్, రేపే ఖాతాల్లో నగదు జమ
Dwakra groups : వైఎస్సార్ సున్నా వడ్డీ కింద పొదుపు సంఘాలు బ్యాంకులకు చెల్లించాల్సిన వడ్డీ రేపు ఖాతాల్లో జమచేయనుంది ప్రభుత్వం. శుక్రవారం సీఎం జగన్ బటన్ బ్యాంకు ఖాతాల్లో రూ.1261 కోట్లు జమ చేయనున్నారు.
Dwakra groups : వరసగా మూడో ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 9.76 లక్షల స్వయం సహాయక సంఘాలలోని 1,02,16,410 మహిళలు బ్యాంకులకు కట్టవలసిన రూ. 1,261 కోట్ల వడ్డీని ప్రభుత్వం జమ చేయనుంది. పొదుపు సంఘాల తరఫున బ్యాంకు ఖాతాల్లో రేపు (శుక్రవారం) ఒంగోలులో బటన్ నొక్కి సీఎం వైఎస్ జగన్ జమ చేయనున్నారు. వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రేపటి రూ. 1,261 కోట్లతో కలిపి ఇప్పటివరకు వైసీపీ ప్రభుత్వం రూ. 3,615 కోట్ల సాయం అందింది. బ్యాంకుల నుండి రూ. 3 లక్షల వరకు రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన పొదుపు సంఘాలకు వడ్డీ భారం పడకుండా, అక్కచెల్లెమ్మల తరపున పూర్తి వడ్డీ భారాన్ని వైఎస్సార్ సున్నావడ్డీ కింద నేరుగా పొదుపు సంఘాల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది.
అక్కచెల్లెమ్మలకు అదనపు ఆదాయం
మహిళలు రిటైల్ రంగంలో వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడానికి ఐటీసీ, హెచ్‌యూఎల్, పీ అండ్ జీ, రిలయెన్స్ రిటైల్, అమూల్, ఇతర బహుళజాతి సంస్థలతో బ్యాంకులకు అనుసంధానం చేసుకుని చేయూత, ఆసరా, సున్నావడ్డీ వంటి పథకాల ద్వారా వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యమని ప్రభుత్వం అంటోంది. బ్యాంకుల సహకారంతో అక్కచెల్లెమ్మలకు నెలకు రూ. 7000 నుంచి రూ. 10000 వరకు అదనపు ఆదాయం అందిస్తుమని తెలిపింది. అమూల్‌తో ఒప్పందం కారణంగా మార్కెట్లో పోటీ పెరిగి లీటర్ పాలపై రూ. 5 నుంచి రూ. 15 వరకు అదనపు ఆదాయం కూడా లభిస్తోందని వెల్లడించింది.
మహిళలకే 70 శాతం వాటా
బ్యాంకులతో చర్చలు జరిపి పొదుపు సంఘాలకు ఎటువంటి పూచీకత్తు లేకుండా రుణాలు ఇప్పించడంతో పాటు రుణాలపై వడ్డీ రేట్లు సైతం 13.50 శాతం నుంచి 9.50 శాతం, 8.50 శాతానికి తగ్గించేలా చేశామని ప్రభుత్వం తెలిపింది. ఏటా రూ. 25 వేల కోట్లకు పైగా రుణాలు తీసుకోవడంతో పాటు రికవరీలో 99.27 శాతంతో దేశంలోనే ప్రథమ స్ధానంలో ఏపీ నిలుస్తోందని తెలిపింది. గర్భిణీల నుంచి అవ్వల వరకు అక్కచెల్లెమ్మలకు అండగా నిలబడుతూ ఇప్పటివరకు వివిధ పథకాల ద్వారా మొత్తం రూ. 1,77,391.49 కోట్లు అందిస్తే అందులో మహిళల వాటా రూ. 1,20,083.80 కోట్లు అని ప్రభుత్వం వెల్లడించింది. మొత్తంగా వివిధ ప్రభుత్వ పథకాలలో మహిళల వాటా దాదాపు 70 శాతం అని పేర్కొంది. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు గత ప్రభుత్వం చెల్లించని వడ్డీ కూడా వైసీపీ ప్రభుత్వం చెల్లిస్తోందని పేర్కొంది.
వైసీపీ ప్రభుత్వంలో
- 2019–20 పొదుపు సంఘాలు చెల్లించాల్సిన వడ్డీ మొత్తం రూ. కోట్లలో – 1258, పొదుపు సంఘాల తరపున గత ప్రభుత్వం చెల్లించిన వడ్డీ మొత్తం రూ. కోట్లలో – 1258
- 2020–21 పొదుపు సంఘాలు చెల్లించాల్సిన వడ్డీ మొత్తం రూ. కోట్లలో – 1096, పొదుపు సంఘాల తరపున గత ప్రభుత్వం చెల్లించిన వడ్డీ మొత్తం రూ. కోట్లలో – 1096
- 2021–22 పొదుపు సంఘాలు చెల్లించాల్సిన వడ్డీ మొత్తం రూ. కోట్లలో – 1261, పొదుపు సంఘాల తరపున గత ప్రభుత్వం చెల్లించిన వడ్డీ మొత్తం రూ. కోట్లలో – 1261