ఆంధ్రప్రదేశ్‌లో మినీ స్థానిక సంస్థల సమరం జరుగుతోంది. పెండింగ్‌లో నెల్లూరు కార్పొరేషన్ సహా మొత్తం 13 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగుతున్నాయి. అలాగే ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఉపఎన్నికలు, గుంటూరు, విశాఖ వంటి చోట్ల కార్పొరేటర్ స్థానాలకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ ప్రక్రియకే ఈ పోల్స్‌లో ఎన్నోవివాదాలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో అత్యంత కీలకమైన చోట్ల పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
నెల్లూరు కార్పొరేషన్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి "అధికార బలం" !
ప్రస్తుత మినీ లోకల్ పోల్స్‌లో ఎన్నిక జరుగుతున్న ఒకే ఒక్క కార్పొరేషన్ నెల్లూరు. ఇక్కడ పట్టు సాధించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. మొత్తం 54 డివిజన్ లలో 8 డివిజన్ లు ఏకగ్రీవం అయినట్లుగా అధికారులు ప్రకటించారు. నిబంధనలకు విరుద్ధంగా.. అక్రమంగా నామినేషన్లు తిరస్కరించేసి ఏకగ్రీవం చేసుకున్నారని టీడీపీ మండిపడింది. కొంత మంది అభ్యర్థులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో కుమ్మక్కవడంతో తెలుగుదేశానికి బలమైన డివిజన్ లలోకూడా అభ్యర్థులు బరిలో లేకుండా పోయారు. దీంతో టీడీపీ బరిలో లేని చోట జనసేనకు మద్దతివ్వాలని నిర్ణయించారు.
Also Read : రాజకీయాల్లో నలిగిపోతున్న కామన్ మ్యాన్.. ‘దేశం’ అడుగుతోంది.. అసలు పట్టించుకోరా?
పల్నాడులో భయం భయంగా టీడీపీ క్యాడర్ పోటీ !
గుంటూరు జిల్లా పల్నాడులో ఉన్న గురజాల, దాచేపల్లి మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. గురజాలలో 6 వార్డులు, దాచేపల్లిలో 1 వార్డు వైఎస్ఆర్‌సీపీకి ఏకగ్రీవం అయ్యాయి. దాచేపల్లిలో టీడీపీ చైర్మన్ అభ్యర్థి నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. గురజాల లో 13 వార్డులు, దాచేపల్లి లో 17 వార్డుల్లో టీడీపీ పోటీ చేస్తోంది. పల్నాడులో ఉన్న పరిస్థితుల కారణంగా గురజాలలో టీడీపీ పోటీ ఇచ్చేందుకు భయపడుతూండగా.. దాచేపల్లిలో మాత్రం ఆ పార్టీ నేతలు గట్టిగానే నిలబడుతున్నారు. గుంటూరు కార్పొరేషన్‌లో ఆరో వార్డుకు ఉపఎన్నిక జరుగుతోంది. చనిపోయిన కార్పొరేటర్ కుటుంబసభ్యులకు టిక్కెట్ ఇవ్వకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇక నెల్లూరులో జరుగుతున్న మరో మున్సిపల్ సమరం బుచ్చిరెడ్డి పాలెంలో జరుగుతోంది. అక్కడ అన్ని వార్డుల్లోనూ టీడీపీ బరిలో ఉంది.
కుప్పంలో తాడో పేడో తేల్చుకుంటున్న ఇరు పార్టీలు !
ఇక టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నియోజకవర్గం అయిన కుప్పం మున్సిపాలిటీకి జరుగుతున్న ఎన్నికల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. 14 వ వార్డు ఏకగ్రీవం అయినట్లుగా ఎన్నిక అధికారులు ప్రకటించారు. అయితే ఫోర్జరీ సంతకాలతో విత్ డ్రా చేశారని ఎన్నికల అధికారులను కోర్టుకు ఈడుస్తామని టీడీపీ ప్రకటించింది. కుప్పం మున్సిపాలిటీలో మొత్తం 25 వార్డులు ఉండగా టీడీపీ 24 చోట్ల, 25 చోట్ల వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సంప్రదాయగా కుప్పం కంచుకోట. అయితే వైఎస్ఆర్‌సీపీ అగ్రనేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలను ప్రలోభాలకు గురి చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో టీడీపీ తరపున ముఖ్య నేతలు కూడా అక్కడే మకాం వేశారు.
Also Read: కుప్పంలో ఎన్నికల టెన్షన్.. మున్సిపల్ కమిషనర్ కు పసుపు కుంకుమ అందజేసిన టీడీపీ నేతలు
కడపలో అన్ని స్థానాల్లో బరిలోటీడీపీ అభ్యర్థులు !
కడప జిల్లాలో రెండు మున్సిపాలిటీలు రాజంపేట, కమలాపురంలో ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ అన్ని వార్డులకు తెలుగుదేశం అభ్యర్థులు నామినేషన్లు వేశారు. కమలాపురంలో టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డి, రాజంపేటలో చెంగల్రాయుడు పార్టీ క్యాడర్‌కు అండగా నిలబడి పోరాటం చేస్తున్నారు. అధికార పార్టీ ఎంతగా ప్రలోభాలు, బెదిరింపులకు లోను చేసినా అభ్యర్థులు ఎవరూ లొంగలేదు.
Also Read : ఎయిడెడ్ స్కూళ్ల నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత ! ఏపీ సర్కార్ ఏం చెబుతోంది ? ఏం జరుగుతోంది ?
కర్నూలు, అనంతల్లో అన్ని చోట్లా బరిలో టీడీపీ !
కర్నూలు జిల్లా బేతంచెర్ల నగరపంచాయతీకి ఎన్నికలు జరుగుతున్నాయి. బేతంచర్ల ఆర్ధికమంత్రి బుగ్గన స్వగ్రామం. పంచాయతీగా ఉన్నప్పటి నుండి ఆయన కుటుంబీకులే గెలిచేవారు. ప్రస్తుతం సీపీఎంతో వైఎస్ఆర్‌సీపీ పొత్తు పెట్టుకుంది. మొత్తం 20 వార్డుల్లో 19 వైఎస్ఆర్‌సీపీ, ఒకటి సీపీఎం పోటీ చేస్తున్నాయి. ఇరవై వార్డుల్లో టీడీపీ పోటీ చేస్తోంది. అనంతపురం జిల్లా పెనుకొండ నగరపంచాయతీకి జరుగుతున్న ఎన్నికల్లో అన్ని చోట్లా టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అధికార ఒత్తిళ్లు తట్టుకుని గట్టి పోటీ ఇచ్చేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు.
ప.గో జిల్లాలో టీడీపీ, జనసేన పొత్తు !
ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో ఆకివీడు నగరపంచాయతీకి ఎన్నికలు జరుగుతున్నాయి. బేతంచర్లలో వైఎస్ఆర్‌సీపీతో పొత్తు పెట్టుకున్న సీపీఎం అకివీడులో మాత్రం తెలుగుదేశం, జనసేనతో కలిసి పోటీ చేస్తోంది. 13 వార్డుల్లో తెలుగుదేశం, 6 వార్డుల్లో జనసేన, 1 వార్డులో సిపిఎం అభ్యర్థులను బరిలో నిలాయి. 20 వార్డుల్లో వైస్సార్సీపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. పెనుగొండ జడ్పీటీసీకి జరుగుతున్న ఉపఎన్నికలో జనసేనకి మద్దతుగా టీడీపీ బరి నుండి వైదొలిగింది.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి.. అధికార పార్టీ నేతలకు పదవుల పండుగ !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి