AP Fibernet Project: ఫైబర్ నెట్ ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదు, వాస్తవాలతో పుస్తకం విడుదల చేసిన టీడీపీ
AP Fibernet Project: ఏపీ ఫైబర్‌నెట్ ప్రాజెక్టు వాస్తవాలు - జగన్ ముఠా అబద్ధపు ఆరోపణలు పేరిట టీడీపీ నేతలు ఆదివారం ఓ పుస్తకాన్ని విడుదల చేశారు.
TDP releases Book on Facts of AP Fibernet Project: ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో అవినీతి లేదంటూ నిన్న ఓ బుక్ విడుదల చేసిన టీడీపీ నేతలు నేడు ఫైబర్ నెట్ ప్రాజెక్టు వాస్తవాలతో ఆదివారం మరో బుక్ విడుదల చేశారు. ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టులో ఒక్క రూపాయి అవినీతి జరగలేదు, కానీ రాజకీయ కక్షతోనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ నేతలు చెప్పారు. ‘ఫైబర్ నెట్ పై ఖర్చు రూ. 280 కోట్లు.. కాగా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ. 900 కోట్లు నిజం అవినీతి అబద్దం’ పేరుతో టీడీపీ నేతలు ఆదివారం పుస్తకం విడుదల చేశారు.
ఈ సందర్బంగా టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... ఫైబర్ నెట్ పై ఆరోపణలు సిగ్గుమాలిన చర్య అని, ప్రజలకు మేలు చేసిన ప్రాజెక్టుపై నిందలు వేయడం రాజకీయ కుట్ర కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు నెలకు రూ.149కే ఇంటికి ఇంటర్నెట్, ఫోన్, టీవీ ఛానళ్ల సౌకర్యం కల్పించామని తెలిపారు. ఏపీ ఫైబర్ నెట్ విధానాన్ని అనుసరించాలని ఇతర రాష్ట్రాలకు సైతం కేంద్రం సూచించిందన్నారు. పైబర్ గ్రిడ్ పై చేసిన ఖర్చు ఆధారాలతో కనపడుతుంటే వైసీపీ నేతలు సిగ్గులేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
చంద్రబాబు సభలు, ప్రాజెక్టుల పర్యటనలో వస్తున్న ప్రజాస్పందన చూసి జగన్ కు ఓటమి భయం పట్టుకుందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే తనకు శ్రీలంకలో జరిగిన పరిస్ధితి తప్పదని భావించే చంద్రబాబుని అరెస్ట్ చేశారని ఆరోపించారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుని అరెస్ట్ చేసి నెల రోజులైనా పైసా కూడా అవినీతి జరిగినట్లు నిరూపించలేకపోయారు. టీడీపీ ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి జరగలేదని, మరోవైపు నాలుగున్నరేళ్ల పాలనలో జగన్ అన్ని రంగాలను భ్రష్టుపట్టించారంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ది లేదు, పరిశ్రమలు పెట్టుబడులు రావటం లేదు, యువతకు ఉపాధి లేక నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అచ్చెన్నాయుడు అన్నారు.
ఫైబర్ నెట్ ప్రాజెక్టులో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని, కాదంటే వైసీపీ ప్రభుత్వం నిరూపించాలని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సవాల్ చేశారు. ఇంటర్నెట్ ద్వారా టెక్నాలజీని గ్రామీణ ప్రాంత ప్రజలకు అందించాలనే ఫైబర్ నెట్ ప్రాజెక్టును తీసుకొచ్చాం అన్నారు. ఐఏయస్ సత్యనారాయణ ఆధ్వర్యంలో కమిటీ వేసి సాధ్య అసాధ్యాలు పరిశీలించే ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుపై ముందడుగు వేశామని తెలిపారు. ప్రపంచ మార్పులను అందిపుచ్చుకోవడానికి 350 కాలేజీల్లో మైక్రోసాఫ్ట్ తో నైపుణ్యతలో చంద్రబాబు శిక్షణ ఇప్పించారు. పల్లెల్లో సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించేందుకు నాడు చంద్రబాబు ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.
ఫైబర్ నెట్ అండర్ గ్రౌండ్ కేబుల్స్ కోసం రూ.5 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అంత ఖర్చు వద్దని కరెంట్ పోల్స్ ను వినియోగించుకుని ఫైబర్ గ్రిడ్ ఏర్పాటు చేశామన్నారు. రూ.5వేల కోట్ల ఖర్చును రూ.330కోట్లకు చంద్రబాబు తగ్గించారు. చివరకు రూ.328 కోట్లకే టెండర్ ఖరారు చేశారని, ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదని స్పష్టం చేశారు. ఫైబర్ నెట్ ఖర్చు రూ.280కోట్లు, ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.900 కోట్లు అన్నారు.