Mahanadu 2022 Updates: అమరావతిని నాశనం చేశారు! ఏ పాపం చేసింది? పోలవరం కాపాడలేని అసమర్థులు - చంద్రబాబు
Mahanadu Ongole: మహానాడు వేదికపై చంద్రబాబు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విధానాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దూరదృష్టి లేకుండా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని అన్నారు.
Chandrababu on Amaravati: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిందని, ప్రజలంతా బాధల్లో ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఇక ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని అన్నారు. అందుకు దశ, దిశ నిర్దేశించే స్థలం ఈ మహానాడు అని చంద్రబాబు చెప్పారు. మహానాడు వేదికపై చంద్రబాబు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విధానాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దూరదృష్టి లేకుండా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని అన్నారు. అమరావతిని నాశనం చేశారని, తాము పోలవరాన్ని 72 శాతం పూర్తి చేస్తే దాన్ని కూడా కాపాడలేని అసమర్థులు అని ధ్వజమెత్తారు.
మహానాడు వేదికపై చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్‌ను నాలెడ్జ్ ఎకానమీగా చేశాం. రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని దూరదృష్టితో పనులు చేపడుతుంటాను. అదే క్రమంలో జోనోమ్ వ్యాలీని ఆనాడు ప్రారంభించాను. ఇప్పుడు ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్ అక్కడి నుంచే వచ్చింది. మొత్తానికి హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడం ద్వారా ఇప్పుడు ఆ ఫలితాలను తెలంగాణ అనుభవిస్తోంది. అలాగే రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఏపీలో విజన్ 2029 ప్రవేశపెట్టి ఆ దిశగా విధానాలు రూపొందించాం. అమరావతి కోసం పైసా ఖర్చు లేకుండా ప్రపంచంలోనే తొలిసారిగా 33 వేల ఎకరాలు సేకరించాం. అలాంటి అమరావతిని జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు. అమరావతి ఏం పాపం చేసింది? దాదాపు రెండు నుంచి మూడు లక్షల కోట్ల రూపాయల సంపద మొత్తం నాశనం చేసేశారు.’’ అని చంద్రబాబు ఆవేదన చెందారు.
పోలవరం కాపాడలేని అసమర్థ ప్రభుత్వం: చంద్రబాబు
‘‘పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లిచ్చే అవకాశం ఉంటుంది. చట్ట ప్రకారం దీనికి కేంద్రం నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. దాని ప్రకారం మేము 72 శాతం పనులు పూర్తి చేశాం. ఈ దుర్మార్గులు అధికారంలోకి వచ్చి రివర్స్ టెండరింగ్ అంటూ అమలు చేశారు. ఆ పనులకు డయాఫ్రం వాల్ కోట్టుకుపోయింది. పోలవరంలో అతి కీలకమైన డయాఫ్రం వాల్ పూర్తి చేసి, జాగ్రత్తగా పనులు పూర్తి చేశాం. దాన్ని కూడా కాపాడలేక అది కొట్టుకుపోయేలా చేశారు. అది ఎటు కొట్టుకుపోయిందో కూడా తెలియదు. ఇలాంటి అసమర్థ ప్రభుత్వం ఉంది. అసలు జగన్ కు పోలవరం గురించి ఏం తెలుసు? కనీసం కాపర్ డ్యామ్, డయాఫ్రం వాల్, స్పిల్ వే అంటే జగన్ కు తెలుసా?’’
వచ్చేది వర్షాకాలం.. ఇక రోడ్లపై చేపలు పట్టుకోవచ్చు!
‘‘రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఏంటి? మేం 25 వేల కిలో మీటర్ల మేర సిమెంట్ రోడ్లు వేస్తే మీరు వేసింది 2 కిలో మీటర్లు. 33 లక్షల ఇళ్లు కడతామని చెప్పి మీరు కట్టింది 3 ఇళ్లు. ఇంత అసమర్థ స్థితిలో ఉండి మీరు మాకు నీతులు చెప్తున్నారు. ప్రధాన రహదారులు సహా రోడ్లపై అంతా గుంతలు పడిపోతే మీరు తట్ట మట్టి అయినా వేశారా? ప్రశ్నిస్తే కేసులు! ఈ కేసులు మమ్మల్ని ఏమీ చేయలేవు. మళ్లీ వర్షాకాలం వస్తోంది. ఇక రోడ్లపై చేపలు పట్టుకోవచ్చు లేదా వరి నాట్లు వేసుకోవచ్చు! రోడ్ల విషయంలో ఏంటి ఈ అరాచకం?’’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.