Gudivada Politics : గుడివాడలో పోటీ చేస్తా - కొడాలి నానిని ఇంటికి పంపిస్తా !
గుడివాడలో టీడీపీ అభ్యర్థిని తానేనని రావి వెంకటేశ్వరరావు ప్రకటించుకున్నారు. కొడాలి విషయంలో ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు.

Gudivada Politics : గుడివాడలో టీడీపీ అభ్యర్దిని తానేనని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ప్రకటించుకున్నారు. ఒక్క అవకాశం ఇస్తే ప్రతి కుటుంబానికి న్యాయం చేస్తానని ప్రజలకు పిలుపునిస్తున్నారు. గుడివాడ పట్టణం 32వ వార్డులో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. వార్డులో ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని రావి వెంకటేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలకు ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయని, యువతను మోసం చేస్తూ వస్తున్నారన్నారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం ద్వారా ప్రజలందరినీ చైతన్యవంతం చేస్తున్నామన్నారు. గత 20 ఏళ్ళలో ఎమ్మెల్యే కొడాలి నాని గుడివాడ నియోజకవర్గానికి చేసిందేమీ లేదంటున్నారు.
గుడివాడ పట్టణంలోని నాగవరప్పాడు కాల్వగట్టుపై నివాసముంటున్న పేద కుటుంబాలకు ప్రత్యామ్నాయం చూపాలని అడిగినందుకు తనపై కేసులు పెట్టారన్నారు. జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారని, కోర్టులో హాజరుపర్చగా ధర్మమే గెలిచిందన్నారు. ఆక్రమంగా ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొనే దమ్ముందని చెప్పుకొచ్చారు. టీడీపీ శ్రేణులు కూడా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నాయన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని వైసీపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందన్నారు. ప్రజల స్వేచ్ఛను హరించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. పేదలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు దొంగ మాటలు చెప్పి లక్షల కోట్లు అప్పు చేసి దోచుకుంటున్నారని ఆరోపించారు.
గుడివాడలోని ప్రజలంతా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని రావి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. తాను ఇసుక అమ్ముకోనని, మట్టిని దోపిడీ చేయనని చెప్పారు. క్యాసినో వంటి అసాంఘిక వ్యవహారాల జోలికి వెళ్ళనని మాటిస్తున్నానన్నారు. కొడాలి నాని విషయంలో ప్రజలే సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. గుడివాడ నుండి తరిమి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. గత 20ఏళ్ళుగా ఎమ్మెల్యే కొడాలి నాని నియోజకవర్గ ప్రజలను తన స్వార్ధానికి వినియోగించుకున్నారన్నారు. అధికారం వచ్చిన తర్వాత రూ.వేల కోట్లు దోచుకున్నాడన్నారని ఆరోపించారు. ప్రజలతో పని లేదన్న పద్దతిలోనే కొడాలి నాని ముందుకు వెళ్తున్నారన్నారు. కొడాలి నాని చేసిన దుర్మార్గాలు, భూకబ్జాలను అరికడతానని అన్నారు.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో అర్హులందరికీ పథకాలను అందజేశామన్నారు. ప్రజల కోసం పని చేసే పార్టీలను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే రావి విజ్ఞప్తి చేశారు.
ఇటీవల గుడివాడలో పేదల ఇళ్ళ తొలగింపు వ్యవహరం తీవ్ర స్దాయిలో దుమారాన్ని రాజేసింది.దీంతో పోలీసులు రావి వెంకటేశ్వరరావు ను అరెస్ట్ చేసి జిల్లాలోని పలు చోట్లకు తిప్పారు.అర్దరాత్రి సమయంలో స్టేషన్ కు తీసుకువచ్చి,అరెస్ట్ చేసినట్లుగా ప్రకటించి,తెల్లవారు జామున న్యాయమూర్తి ఎదుట ప్రవేశ పెట్టారు.దీంతో న్యాయమూర్తి విచారణ చేసి రావికి బెయిల్ మంజూరు చేశారు.ఆ తరువాత రోజు నుండే రావి వెంకటేశ్వరరావు నియోజకవర్గంలో ఇదేం ఖర్మ కార్యక్రమం పేరుతో నియోజకవర్గంలో పర్యటించటంతో స్దానిక టీడీపీ నేతలు ఉత్సాహంగా ఆయన్ను ఫాలో అయ్యారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

