Memories Of Nellore City: నెల్లూరులో వెంకయ్య నాయుడు పెన్నులు ఎక్కడ కొనేవారో తెలుసా?
సుబ్రహ్మణ్యం పెన్ కార్నర్ సృష్టికర్త. అప్పట్లో మద్రాస్ లో కేవలం పెన్నులకు ఓ షాపు ఉండటం గమనించిన ఆయన.. అలాంటిదే నెల్లూరులో పెట్టాలనుకున్నారు. నెల్లూరులోని ట్రంక్ రోడ్ లో 1945లో దాన్ని స్థాపించారు.
ఐదు పదేళ్ల తర్వాత ఏదైనా ఊరికెళ్లి చూస్తే అంతా కొత్తగా ఉంటుంది. భలే మారిపోయిందే అనుకుంటాం. ఇళ్లు, షాపులు, వ్యాపార సంస్థలు.. అన్నిట్లో మార్పు సహజం. అలాంటిది 73 ఏళ్ల తర్వాత నెల్లూరులో ఒకే ఒక్క షాపు ఏమాత్రం మారకుండా అలాగే ఉంది. దాని పేరు పెన్ కార్నర్. కేవలం పెన్నులు మాత్రమే అమ్ముతారక్కడ. తరాలు మారినా, కాలం మారినా.. అక్కడ ఇప్పటికీ పెన్నులు మాత్రమే అమ్ముతున్నారు.
ఆ పాత జ్ఞాపకాలు..
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విద్యార్థిగా ఉన్నప్పుడు ఆ షాపుకే వచ్చి పెన్నులు కొనేవారట. ఆనం రామనారాయణ రెడ్డి, ఆయన సోదరుడు వివేకానందరెడ్డి, వారి కుటుంబ సభ్యులందరికీ అక్కడే పెన్నులు కొనడం అలవాటు. అంతేకాదు ఆ షాపుతో అనుబంధం ఉన్న చాలామంది ఇప్పుడు దేశ విదేశాల్లో ఉన్నారు. ఎక్కడెక్కడో వ్యాపారాల్లో స్థిరపడ్డారు. ఎప్పుడైనా నెల్లూరుకి వస్తే ఇదిగో ఈ షాపులోనే చిన్నప్పుడు తాము కలం ఖరీదు చేసేవాళ్లం అంటూ మనవళ్లకు, మనవరాళ్లకు చెప్పుకుని పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు.
మద్రాస్ ఇన్స్ పిరేషన్..
చక్రాల సుబ్రహ్మణ్యం ఈ పెన్ కార్నర్ సృష్టికర్త. అప్పట్లో మద్రాస్ లో కేవలం పెన్నులకు ఓ షాపు ఉండటం గమనించిన ఆయన.. అలాంటిదే నెల్లూరులో పెట్టాలనుకున్నారు. నెల్లూరులోని ట్రంక్ రోడ్ లో 1945లో దాన్ని స్థాపించారు. ఆ తర్వాత ఆయన కొడుకు చక్రాల జయదేవ్ దాన్ని కొనసాగిస్తున్నారు. తన స్నేహితులంతా వివిధ ఉద్యోగాల్లో స్థిరపడినా, తండ్రికిచ్చిన మాటకోసం తాను మాత్రం ఇంకా పెన్ కార్నర్ నడుపుతున్నానని అంటారు జయదేవ్. తన తర్వాత పెన్ కార్నర్ నిర్వహణ సాధ్యం కాదేమోనని, పిల్లలు సాఫ్ట్ వేర్ రంగంలో స్థిరపడ్డారని ఒకింత బాధగా చెబుతారు.
అబ్బో ఎన్నిరకాలో..
అప్పట్లో పెన్నులన్నీ ముంబై నుంచి తయారై వచ్చేవి. మొదట్లో ఇంకు పెన్నులు, ఆ తర్వాత చెక్కతో తయారు చేసిన రీఫిల్ పెన్నులు, ఇప్పుడు ప్లాస్టిక్ పెన్నులు ఇలా రూపాంతరం చెందాయి. హీరో, పార్కర్, బ్రహ్మం, రత్నం అనే పెన్స్ ఉండేవి అప్పట్లో. పైలట్, రైటర్, స్వామ్ అనే కంపెనీలు కూడా ఇంకు పెన్నుల్ని ఉత్పత్తి చేసేవి. గోల్డ్ నిబ్స్ అంటే బంగారంతో చేసిన పాళీతో తయారైన పెన్నులు అప్పట్లో బాగా ఫేమస్. ఆరోజుల్లోనే 100నుంచి 120 రూపాయలు ఆ పెన్ను ఖరీదు. ఒకసారి బంగారం నిబ్ పెన్ను కొంటే.. జీవితాంతం దాంతో రాయొచ్చట. ఇప్పట్లో బట్టల షాపింగ్ లాగే అప్పట్లో పెన్స్ చూసి కొనుక్కునేవారు. పెన్నుల షాపింగ్ కోసం గంట, గంటన్నర సమయాన్ని వెచ్చించేవారు.
తయారీ, రిపేర్ వర్క్..
పెన్నులు ముంబై నుంచి తెచ్చి అమ్మడంతోపాటు.. నెల్లూరులోనే చెక్క పెన్నుల్ని తయారు చేసేవారు. పెన్నులను రిపేర్ కూడా చేసేవారు. ఇద్దరు మనుషుల్ని పెన్నుల తయారీకి, మరో ఇద్దర్ని పెన్నుల రిపేర్ కోసం నెల్లూరు పెన్ కార్నర్ లో పనికి కుదుర్చుకున్నారట. 1980 తర్వాత బాల్ పెన్నుల రాకతో పెన్నుల ఇండస్ట్రీలో కొత్త విప్లవం వచ్చిందని చెబుతారు జయదేవ్. రెడ్ లీఫ్ పేరుతో మొదట్లో బాల్ పెన్స్ వచ్చాయి. ఆ తర్వాత విల్సన్, రెనాల్డ్స్ కంపెనీలు జతచేరాయి.
1945లో స్థాపించిన పెన్ కార్నర్ ఇంకా అదే పేరుతో, అదే ప్లేస్ లో, అదే కుటుంబ నిర్వహణలో ఉందంటే అతిశయోక్తి అనిపించక మానదు. వ్యాపారం కేవలం సంపాదనకోసం మాత్రమే కాదు, అదో సంతృప్తినిచ్చే వ్యాపకం అని జయదేవ్ లాంటి వారిని చూస్తే తెలుస్తుంది.