నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ (NMC) ఎన్నికల్లో టీడీపీ గెలుపుకోసం ఎక్కడో శ్రీకాకుళం నుంచి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వచ్చి వ్యూహాలు పన్నుతున్నారు. మరో మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, స్థానిక మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఇతర నేతలు టీడీపీ గెలుపుకోసం చెమటోడుస్తున్నారు. ఆర్వో ఆఫీస్ వద్ద నిరసనలు, కలెక్టరేట్ వద్ద ధర్నాలు.. ఇలా అష్టకష్టాలు పడుతున్నారు టీడీపీ నేతలు. నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున రెండేళ్ల క్రితం పోటీ చేసిన మాజీ మంత్రి నారాయణ మాత్రం ఈ ఎపిసోడ్‌లో కనిపించడం లేదు. 


2014లో చంద్రబాబు కేబినెట్‌లోకి అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చారు నారాయణ. ముందు మంత్రి పదవి, ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి అందుకున్నారు. రాజధాని ప్రాంత అభివృద్ధి కమిటీలో కూడా ఆయనది కీలక పాత్ర. ఎమ్మెల్యేలుగా ఎన్నికైనవారిని సైతం పక్కనపెట్టి నారాయణకు పెద్ద పీట వేశారు చంద్రబాబు. 2019 అసెంబ్లీ ఎన్నికలనాటికి నారాయణ ఎమ్మెల్సీ. పదవీకాలం కూడా ఉంది. అయినా కూడా ఆయన ప్రత్యక్ష ఎన్నికలవైపు మొగ్గు చూపారు. ఎమ్మెల్యేగా గెలవాలనుకున్నారు.


నెల్లూరు మాస్టర్ ప్లాన్‌పై నమ్మకం పెట్టుకున్నా..!
నెల్లూరు మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా నారాయణ మంత్రిగా ఉన్న సమయంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ వర్క్స్ పనులు మొదలయ్యాయి. దాదాపు రూ.1,100 కోట్ల రూపాయల బడ్జెట్‌తో పనులు ప్రారంభించారు. నెల్లూరు పట్టణంలో పార్క్‌ల అభివృద్ధి, పలు సుందరీకరణ పనులకు కూడా నారాయణ శ్రీకారం చుట్టారు. అవన్నీ తనకు ఎన్నికల్లో విజయం సాధించి పెడతాయని ఆయన అంచనా వేశారు. కానీ అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు నారాయణ. చివరి వరకు నారాయణదే విజయం అనే అంచనాలున్నా.. చివరికి 1,988 ఓట్ల తేడాతో అనిల్ విజయం సాధించారు, మంత్రి పదవి చేపట్టారు. ఓటమి తర్వాత నారాయణ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 


Also Read : ఎయిడెడ్‌ స్కూళ్ల నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత ! ఏపీ సర్కార్ ఏం చెబుతోంది ? ఏం జరుగుతోంది ?


నగర నియోజకవర్గంలో తాను చేపట్టిన అభివృద్ధి పనులు కూడా తనను గెలిపించలేకపోయాయని సన్నిహితుల దగ్గర ఆయన చాలాసార్లు ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం. ఆ తర్వాత టీడీపీ తరపున సిటీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాద్యతల్ని కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డికి అప్పగించినా.. నెల్లూరు సిటీకి అభ్యర్థి తానేనంటూ ఆయన ఎప్పుడూ ప్రచారం చేసుకోలేదు. ఇప్పటికీ నెల్లూరు సిటీలో 2024లో టీడీపీ తరపున బరిలో దిగేది మాజీ మంత్రి నారాయణే అనే అభిప్రాయం ఉంది.


కార్పొరేషన్ ఎన్నికలకు మొహం చాటు.. 
వైసీపీ అధికారంలోకి వచ్చాక దాదాపుగా నారాయణ టీడీపీ వ్యవహారాలకు కూడా దూరంగా ఉంటున్నారు. విద్యా సంస్థలు, ఇతర వ్యాపార లావాదేవీలు ఉండటంతో.. అధికార పార్టీతో గొడవ పడలేక ఆయన సైలెంట్‌గా ఉన్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికలను టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నా కూడా నారాయణ యాక్టివ్ కాలేదు. అచ్చెన్నాయుడు, నిమ్మకాయల చినరాజప్ప వంటి వారు నెల్లూరుకి వచ్చి అభ్యర్థులకు అండగా నిలిచారే కాని, నారాయణ మాత్రం దూరంగా ఉండటం విశేషం. స్థానిక రాజకీయాలకు ఆయన దూరంగా ఉన్నా సరే 2024 నాటికి ఆయనే నెల్లూరు సిటీ నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థి అని స్థానిక నాయకులు చెబుతున్నారు.


Also Read: పెట్రో ధరలపై అప్పుడేం చెప్పారు.. ఇప్పుడేం చేస్తున్నారు: చంద్రబాబు


Also Read: Fuel Prices: రాజకీయాల్లో నలిగిపోతున్న కామన్ మ్యాన్.. ‘దేశం’ అడుగుతోంది.. అసలు పట్టించుకోరా?


Also Read: కుప్పంలో ఎన్నికల టెన్షన్‌.. మున్సిపల్ కమిషనర్ కు పసుపు కుంకుమ అందజేసిన టీడీపీ నేతలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి