పెట్రో ధరలు పెరుగుదలపై చంద్రబాబు మాట్లాడారు. దేశంలోనే అతి తక్కువ ధరలు ఉంటాయని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఇప్పుడు మాత్రం దేశంలోనే అత్యధిక ధరలు ఉన్న రాష్ట్రంగా ఏపీ ఉందన్నారు. ఇతర రాష్ట్రాలతో సమానంగా పెట్రోలు, డీజిల్‌ పై  రూ.17 తగ్గించాలి. లేకుంటే ఉద్యమించి వారికి తగిన గుణపాఠం చెబుతామని చంద్రబాబు స్పష్టం చేశారు.


ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు, డీజిల్ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని చంద్రబాబు అన్నారు. పొరుగు రాష్ట్రాలు కూడా (పెట్రోల్-డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గిస్తున్నట్లు ప్రకటిస్తూ) బోర్డులు పెడుతున్నాయని చెప్పారు. ఇక్కడ కూడా తగ్గించాలి..  ఇది చాలా దారుణమైన పరిస్థితి అని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని ప్రభుత్వాన్ని చంద్రబాబు డిమాండ్ చేశారు.






పెట్రోల్, డీజిల్‌పై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా పన్నులు తగ్గించాలన్న డిమాండ్లు, అటు రాజకీయ పార్టీలు, ఇటు సామాన్య ప్రజలు కూడా చేస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం ఆలోచిస్తున్నాయి.  సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామన్నట్లుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడల్లా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపించడం లేదు. అయితే ప్రభుత్వాలు రేట్లు తగ్గించకపోతే అటు ప్రజా వ్యతిరేకత నష్టంతో పాటు ఆర్థికంగానూ నష్టపోతాయని లెక్కలు వెల్లవుడున్నాయి.


కేంద్ర ప్రభుత్వ తగ్గింపుతో పాటు కర్ణాటక ప్రభుత్వం కూడా భారీగా పన్నులు తగ్గించింది. దీంతో తెలుగు రాష్ట్రాల రేట్లతో పోలిస్తే కర్ణాటకలో పెట్రోల్, డీజిల్ రేట్లు రూ. 12 నుంచి రూ. 18 వరకూ తక్కువగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో తగ్గింపులు లేక ముందే తెలంగాణలో రూ. నాలుగు, కర్ణాటకలో రూ. ఆరు, తమిళనాడుతో పోలిస్తే రూ. ఐదు ఎక్కువ. అందుకే అప్పట్లోనే కొంత మంది సమీపంలో ఉన్న వారు పొరుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ కొట్టించుకుని వచ్చేవారు. రాష్ట్రం మీదుగా ప్రయాణించేవాళ్లు బయటే ఫుల్ ట్యాంక్ కొట్టించుకుని వచ్చేవారు. ఈ కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గేది. అయితే ఇప్పుడు ఆ తేడా ఎక్కువగా ఉంది. ఈ కారణంగా ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న దాదాపుగా 300 పెట్రోల్ బంకులకు గిరాకీ పడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.  పెట్రోల్ పంపుల్లో పెట్రోల్ కంటే డీజిల్ అమ్మకాలు ఎక్కువగా జరుగుతాయి. రవాణా వాహనాలే దీనికి కారణం. ఈ ధరల తేడా వల్ల సరిహద్దుల్లోని పెట్రోల్ బంకుల్లో  పూర్తిగా పడిపోయాయి. ఇది పెట్రోల్ బంకుల్ని నష్టాల్లోకి నెట్టేలా చేస్తున్నాయి.


ధరలు ఎక్కువగా ఉన్న కారణంగా పెట్రోల్, డీజిల్ అమ్మకాలు తగ్గితే ఆ మేరకు వ్యాట్ ఆదాయం కూడా ప్రభుత్వానికి తగ్గుతుంది. తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తొలి బడ్జెట్‌లో  పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్‌ను భారీగా తగ్గించారు. ఈ కారణంగా ఆగస్టులోనే తమిళనాడులో పెట్రోల్ రేటు రూ. నాలుగు వరకూ తగ్గింది. ఇప్పుడు కేంద్రం మరో ఐదు రూపాయలు తగ్గించింది. వీటి కారణంగా సరిహద్దుల్లో ఉన్న వారంతా ఇక తమిళనాడు బోర్డర్‌కు వెళ్లి  పెట్రోల్ కొట్టించుకుని వస్తున్నారు. వాణిజ్య వాహనాలన్నీ ట్యాంక్ ఫుల్ చేయించుకుని ఏపీలోకి వస్తున్నాయి. ఈ కారణంగా తమిళనాడు ఆదాయం పెరిగిందని..  వ్యాట్ తగ్గించడం వల్ల ఎలాంటి ఆదాయలోటు ఏర్పడలేదని తమిళనాడు ప్రభుత్వమే ప్రకటించింది. అంటే  ఆ మొత్తం ఏపీ ఆదాయం నుంచి జమ అయిందన్నమాట. ఇదే పరిస్థితి ఇప్పుడు తెలంగాణ సరిహద్దుల్లోనూ ఏర్పడుతుంది. అదే జరిగితే ప్రభుత్వాలకూ ఆదాయం పడిపోతుంది.


Also Read: Fuel Prices: రాజకీయాల్లో నలిగిపోతున్న కామన్ మ్యాన్.. ‘దేశం’ అడుగుతోంది.. అసలు పట్టించుకోరా?