Kakani Satires On Chandrababu: మేనిఫెస్టోని వెబ్ సైట్ నుంచి డిలీట్ చేసిన ఘనత చంద్రబాబుదే- మంత్రి కాకాణి
మహనాడులో ఫేజ్ -1 మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబు, ఇంకా ఎన్ని ఫేజ్ లు విడుదల చేస్తారో, ఇంకెన్ని వస్తాయో తెలియని పరిస్థితి ఉందన్నారు కాకాణి.

మేనిఫెస్టో ఫస్ట్ ఫేజ్ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు మరో నాటకానికి తెరతీశాడని మండిపడ్డారు మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. 2014 ఎన్నికల్లో ఇచ్చిన 650 వాగ్దానాలలో కనీసం 10 శాతం కూడా నెరవేర్చలేదన్నారు. మేనిఫెస్టోని వెబ్ సైట్ నుంచి డిలీట్ చేసిన ఘనత చంద్రబాబుదేనని ధ్వజమెత్తారు. దమ్ముంటే తాను నెరవేర్చిన వాగ్దానం ఇదీ అంటూ చంద్రబాబు ప్రజల ముందుకు రావాలన్నారు. కాపీ మేనిఫెస్టోతే ప్రజల్ని మోసం చేయాలంటే కుదరదని చెప్పారు.
ప్రజా సంక్షేమ పాలనను అందిస్తూ, నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి జగన్ కి అభినందనలు తెలుపుతూ మంత్రి కాకాణి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎన్నడూ, ఎవరూ ఆలోచన చేయని విధంగా ఏపీ సీఎం జగన్ సంక్షేమ పధకాలను అందిస్తున్నారని చెప్పారు కాకాణి. సంక్షేమ పథకాల ఫలాలను లబ్దిదారులకు అందించే విషయంలో ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా, నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నామని చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమం, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ, ప్రజారంజక పాలనను అందిస్తున్నామన్నారు కాకాణి. ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రాష్ట్రం, దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. నాలుగేళ్ల పాలనలో జగన్ ఎన్నో అవాంతరాలను, ఒడిదుడుకులను ఎదుర్కొన్నని, అయినా ప్రజలకు సంక్షేమ పాలన అందించడంలో రాజీ పడలేదని గుర్తు చేశారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చి, ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా చూశారన్నారు.
ఆ ధైర్యం జగన్ కే ఉంది..
నా వల్ల మీకు మేలు జరిగితేనే నన్ను ఆశీర్వదించండి అని ధైర్యంగా చెప్పగలిగిన వ్యక్తి సీఎం జగన్ ఒక్కరేనని చెప్పారు మంత్రి కాకాణి. చంద్రబాబు కపట నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. సొంత మామకు వెన్నుపోటు పొడిచి, మనోవేదనకు గురి చేసిన చంద్రబాబు, ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు జరపడం హాస్యాస్పదం అన్నారు. ఎన్నికల సమయంలో తప్ప చంద్రబాబు ఎప్పుడూ ఎన్టీఆర్ పేరుని పట్టించుకోలేదన్నారు. అయితే జగన్ మాత్రం ఒకజిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారని ఆయనకు గౌరవం ఇచ్చారని చెప్పారు. చివరకు శతజయంతి ఉత్సవాల్లో కూడా ఎన్టీఆర్ ఆత్మకు చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఇంకెన్ని మేనిఫెస్టోలుంటాయి..?
మహనాడులో ఫేజ్ -1 మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబు, ఇంకా ఎన్ని ఫేజ్ లు విడుదల చేస్తారో, ఇంకెన్ని వస్తాయో తెలియని పరిస్థితి ఉందన్నారు కాకాణి. చంద్రబాబు 2014 ఎన్నికల్లో మేనిఫెస్టోలో 650 వాగ్దానాలు చేస్తే, అధికారంలోకి వచ్చి, కనీసం 10 శాతమైనా అమలు చేశాడా అని ప్రశ్నించారు. జగన్ మాత్రం తాను ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ, 98 శాతం హామీలు అమలు చేశారన్నారు. DBT పద్ధతి ద్వారా 2.11లక్ష కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామన్నారు కాకాణి.
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు శంకుస్థాపనలు తప్ప, పనులు పూర్తి చేసిన దాఖలాలు ఉన్నాయా అని ప్రశ్నించారు మంత్రి కాకాణి. నెల్లూరు జిల్లాలో ఒక్క అభివృద్ధి పనినైనా పూర్తి చేసి, ప్రారంభించాడా అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు రైతు సమస్యలను ఎప్పుడైనా పట్టించుకున్నాడా అన్నారు. అసలు చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోకు విలువ ఉందా అని ప్రశ్నించారు కాకాణి.
సుదీర్ఘ అనుభవం, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు చెప్పుకోదగ్గ పథకం ఒక్కటైనా అమలు చేశాడా అన్నారు కాకాణి. చంద్రబాబు 2014లో ప్రకటించిన మేనిఫెస్టో తమ దగ్గర ఉందని, ఆ మేనిఫెస్టోని పది నిమిషాల్లోనే ఇంటర్నెట్ నుంచి మాయం చేసిన ఘనత చంద్రబాబుదని అన్నారు కాకాణి. చంద్రబాబు హయాంలో పేదల పరిస్థితి పాతాలానికి దిగజారిపోయిందన్నారు. రాజధాని పేరిట రైతుల భూములను కాజేశారని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో దళారులు, జన్మభూమి కమిటీలు ప్రభుత్వ పథకాలలో విపరీతంగా దోచుకున్నారని మండిపడ్డారు కాకాణి. అధికారంలో ఉన్నప్పుడు ఏపనీ చేయని చంద్రబాబుకు, అధికారం ఇచ్చే పరిస్థితులలో ప్రజలు లేరన్నారు కాకాణి.
చంద్రబాబు కాపీ క్యాట్
కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇచ్చిన హామీలను ఏపీలో అమలు చేస్తానంటూ చంద్రబాబు చెబుతున్నారని, ఆయన ఓ కాపీక్యాట్ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మహానాడులో అమలు చేస్తానంటున్న తల్లికి వందనం పధకం తాము ఆల్రడీ అమలు చేస్తున్న అమ్మఒడి పధకమే కదా అన్నారు కాకాణి. నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం అంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నాడని ఎద్దేవా చేశారు.





















