YS Viveka Murder case CBI: వివేకా హత్య కేసులో కీలక మలుపు - కడపలో ఆ ఇద్దరి విచారణ
వైఎస్ వివేకా హత్య కేసులో నవీన్, కృష్ణమోహన్ రెడ్డిలను సీబీఐ విచారణ జరపనుంది. కడప సెంట్రల్ జైలుకు సీబీఐ ప్రత్యేక అధికారుల బృందం చేరుకుంది.
YS Viveka Murder case CBI: వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు కడప సెంట్రల్ జైల్ గెస్ట్ హౌస్‌లో విచారణ ప్రారంభించారు. విచారణకు సీఎం జగన్ ఓఎస్డీగా పని చేస్తున్న కృష్ణమోహన్ రెడ్డి, అలాగే తాడేపల్లిలో సీఎం క్యాంప్ ఆఫీసులో పని చేసే నవీన్ అనే వ్యక్తి హాజరు కానున్నారు. ముందుగా కృష్ణమోహన్ రెడ్డి సీబీఐ ఎదుట హాజరైనట్లుగా తెలుస్తోంది. సెంట్రల్ జైల్ గెస్ట్ హౌస్ లో భారీ భద్రత నడుమ విచారణ జరుగుతోంది. కృష్ణమోహన్ రెడ్డితో పాటు కడప సెంట్రల్ జైల్లో ఇప్పటికే రిమాండ్ లో ఉన్న దేవిరెడ్డి శంకర్ రెడ్డి, యాదాటి సునీల్, ఉమా శంకర్ రెడ్డి లను సిబిఐ విచారించే అవకాశం ఉంది.
అవినాష్ రెడ్డి కాల్ డేటా ఆధారంగా నోటీసులు
వైఎస్ వివేకా హత్య జరిగిన రోజు.. ఎంపీ అవినాష్ రెడ్డి కాలే డేటాను సీబీఐ పరిశీలించినట్లుగా తెలుస్తోంది. ఇటీవల అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఆ తర్వాత విచారణలో వెల్లడైన అంశాలను బట్టి నవీన్ , కృష్ణమోహన్ రెడ్డిలకు నోటీసులను సీబీఐ జారీ చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి ఫోన్లను నవీన్ అటెండ్ చేస్తూంటారని చెబుతున్నారు. గతం నుంచి జగన్ వద్ద పని చేస్తున్న కృష్ణమోహన్ రెడ్డికి వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓఎస్డీగా నియమించారు.
ఫిబ్రవరి పదో తేదీన సీబీఐ కోర్టులో విచారణ
వివేకా హత్య కేసు విచారణను ఇప్పటికే హైదరాబాద్ కోర్టుకు తరలించారు. వైఎస్ వివేకా హత్య కేసు అధికారికంగా సీబీఐ కోర్టుకు బదిలీ అయింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వైఎస్ వివేకా హత్య కేసులో విచారణ ప్రక్రియ సీబీఐ కోర్టు ప్రారంభించింది. వైఎస్ వివేకా హత్య కేసులో ప్రధాన, అనుబంధ ఛార్జ్ షీట్ విచారణకు స్వీకరించింది. వైఎస్ వివేకా హత్య కేసుకు SC/01/2023 నంబరు కేటాయించింది. హత్య కేసులో ఐదుగురు నిందితులకు సమన్లు జారీ చేసింది. ఎర్ర గంగిరెడ్డి, వై.సునీల్ యాదవ్, జి.ఉమాశంకర్ రెడ్డి, షేక్ దస్తగిరి, డి.శివశంకర్ రెడ్డికి ఈ సమన్లు వెళ్లాయి. వీరిలో నలుగురు జైల్లో ఉండగా.. ఒక్క ఎర్ర గంగిరెడ్డి మాత్రం బెయిల్ పై ఉన్నారు. ఆయన బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. ఫిబ్రవరి 10న విచారణకు హాజరు కావాలని నిందితులను ఆదేశించింది.
నిందితులందర్నీ హైదరాబాద్ తరలించే అవకాశం
అలాగే నిందితుల్ని కూడా కడప జైలు నుంచి హైదరాబాద్ తరలించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో అరెస్టు చేసిన దేవిరెడ్డి శంకర్ రెడ్డి, గజ్జల ఉమాశంకర్ రెడ్డితో పాటు మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం కడప జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వీరికి కడప జైల్లో ముప్పు పొంచి ఉందని సీబీఐ అనుమానిస్తోంది. ఇదే విషయాన్ని వివేకా కుమార్తె సునీతారెడ్డి కూడా కోర్టుకు చెప్పారు. దీంతో సీబీఐ అధికారులు నిందితుల్ని హైదరాబాద్ లోని చంచల్ గూడ లేదా చర్లపల్లి జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.