Jana Sena TDP First Meeting: నేడు టీడీపీ - జనసేన కీలక భేటీ - ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఉమ్మడి ప్రణాళిక
Andhra Pradesh News: ఏపీలో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ - జనసేన నేతల కీలక సమావేశం సోమవారం జరగనుంది. పొత్తు ఖరారైన నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.
టీడీపీ - జనసేన పార్టీల తొలి జేఏసీ సమావేశం సోమవారం జరగనుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేనాని పవన్ కల్యాణ్ అధ్యక్షతన రాజమహేంద్రవరంలోని హోటల్ మంజీరాలో మధ్యాహ్నం 3 గంటలకు జేఏసీ భేటీ కానుంది. ఇరు పార్టీల పొత్తు ఖరారైన నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అసురించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. వైసీపీ ప్రభుత్వంపై పోరాటం, సర్కారు వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా ఎలా తీసుకెళ్లాలి, ఇరు పార్టీల మధ్య సమన్వయం వంటి వాటిపై నిర్ణయం తీసుకోనున్నారు.
ప్రధాన అంశాలివే
రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, ఉద్యమ కార్యాచరణ, వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం, ఇరు పార్టీల సమన్వయం వంటి అంశాలపై ఈ జేఏసీ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. క్షేత్ర స్థాయిలో ఇరు పార్టీల కేడర్ మరింత సమర్థంగా పని చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపైనా నిర్ణయం తీసుకోనున్నారు. ఈ భేటీపై అటు రాజకీయ వర్గాలు, ఇటు ఇరు పార్టీల అభిమానులు, కార్యకర్తలు, జనసైనికుల్లోనూ ఆసక్తి నెలకొంది.
అదే లక్ష్యం
2014లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, సీఎం జగన్ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారంటూ ఇరు పార్టీలు వేర్వేరుగా పోరాడుతున్నాయి. వైసీపీ పాలన నుంచి ఏపీ ప్రజలకు విముక్తి కల్పించడమే తమ లక్ష్యమని జనసేనాని పవన్ కల్యాణ్ ప్రారంభం నుంచి చెప్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో టీడీపీ సైతం పలు కార్యక్రమాల పేరిట ప్రభుత్వంపై నిరసనలు తెలిపింది. కాగా, స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టుతో ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ నెలకొంది. అనంతరం టీడీపీ, జనసేన కలిసి పని చేస్తాయని వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంతో కలిసి వెళ్తామని పవన్ ప్రకటించడంతో ఇరు పార్టీల్లోనూ హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. అయితే, పొత్తుపై ప్రకటన చేసినా ఇప్పటి వరకూ ఇరు పార్టీలు ఉమ్మడి కార్యక్రమాలు నిర్వహించలేదు. నేటి సమావేశంలో ఐక్య పోరాటంపై స్పష్టమైన ప్రకటన ఉంటుందని పార్టీల శ్రేణులు భావిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహాలు, ఉమ్మడి పోరాటాలను దిశా నిర్దేశం చేయనున్నట్లు భావిస్తున్నారు.
'జగనాసుర దహనం' పేరిట ఆందోళన
స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా మరో వినూత్న నిరసనకు టీడీపీ పిలుపునిచ్చింది. విజయదశమి పండుగను చెడుపై మంచి విజయంగా జరుపుకొంటారని, సైకో జగన్ అనే చెడుపై చంద్రబాబు అనే మంచి సాధించబోయే విజయంగా జరుపుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రజలకు పిలుపునిచ్చారు. 'దేశం చేస్తోంది రావణాసుర దహనం - మనం చేద్దా జగనాసుర దహనం' అంటూ సోమవారం (అక్టోబర్ 23) రాత్రి 7 గంటల నుంచి 7:05 నిమిషాల మధ్య మరో నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ సమయంలో 'సైకో పోవాలి' అని రాసి ఉన్న పత్రాలను వీధుల్లో దహనం చేయాలని అన్నారు. నాలుగన్నరేళ్లుగా అరాచక పాలన సాగిస్తోన్న సైకో జగనాసురుడి పీడ పోవాలని నినదిద్దామని ట్వీట్ చేశారు. ఈ మేరకు నిరసన తెలిపిన వీడియోలు, ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయాలని కోరారు.