IT Raids: ప్రొద్దుటూరులో గోల్డ్ షాపులపై ఐటీ దాడులు, 300 కేజీల బంగారం సీజ్
IT Raids: ప్రొద్దుటూరులో నాలుగు రోజుల పాటు ఐటీ సోదాలు కలకలం రేపాయి. ఈ దాడుల్లో భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
IT Raids: తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు ఏపీలోని ప్రాంతాల్లో కొద్దిరోజులుగా ఐటీ సోదాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రోజు ఎక్కడో ఒకచోట ఐటీ అధికారులు తనిఖీలు చేస్తోన్నారు. తెలంగాణ ఎన్నికల వేళ గత వారంరోజులుగా హైదరాబాద్‌లో పలు సంస్థల్లో సోదాలు జరుగుతుండగా.. ఏపీలో కూడా చోటుచేసుకోవడం సంచలనం రేపుతోంది. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో గత నాలుగు రోజులుగా ఐటీ తనిఖీలు జరుగుతున్నాయి. బంగారం షాపులే టార్గెట్‌గా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
దసరా పండుగ కావడం, త్వరలో పెళ్లిళ్ల సీజన్ వస్తుండటంతో చాలామంది బంగారానికి విపరీతంగా డిమాండ్ పెరిగింది. కస్టమర్లు బంగారాన్ని కొనుగోలు చేస్తుండటంతో అమ్మకాలు పెరిగిపోయాయి. ఈ తరుణంలో ప్రొద్దుటూరులోని బంగారం దుకాణాల్లో వరుసగా ఐటీ దాడులు జరుగుతున్నాయి. అక్కడే మకాం వేసిన అధికారులు.. నాలుగు రోజులుగా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఆదివారంతో ఈ తనిఖీలు ముగియగా.. 300 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. బంగారానికి సంబంధించి సరైన బిల్లులు లేకపోవడంతో వీటిని సీజ్ చేశారు. నాలుగు షాపుల నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఎలాంటి బిల్లులు లేకుండా ఇతర ప్రాంతాల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకున్నట్లు ఐటీ గుర్తించింది. అక్రమంగా వివిధ ప్రాంతాల నుంచి భారీగా బంగారం దిగుమతి అవుతుందనే సమాచారంతో విజయవాడ, తిరుపతికి చెందిన ఐటీ అధికారులు ప్రొద్దుటూరులో రంగంలోకి దిగారు. నాలుగు రోజుల పాటు బంగారం షాపుల్లో సోదాలు నిర్వహించారు. దాదాపు వెయ్యి షాపుల్లో సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో బుశెట్టి జువెలరస్ డైమండ్స్, గురురాఘవేంద్ర, తల్లం షాపుల్లో డాక్యుమెంట్స్ లేని 300 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. సీజ్ చేసిన బంగారాన్ని సూట్ కేసులు, అట్టపెట్టెల్లో తిరుపతికి తరలించారు.
ఇండియాలో ముంబై తర్వాత అతిపెద్ద గోల్డ్ మార్కెట్‌గా ప్రొద్దుటూరుకు పేరుంది. ఈ టౌన్‌లో ఏకంగా రెండు వేలకుపైగా బంగారం షాపులు ఉన్నాయి. ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వెళ్లి బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు. కొన్ని షాపుల్లో ఐటీ దాడులు జరుగుతున్నాయనే సమాచారంతో మిగతా యజమానులు కూడా భయపడి షాపులను మూసివేశారు. తమ షాపుల్లో కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేస్తారేమోననే ఆందోళనతో మూసివేశారు. దీంతో ప్రొద్దుటూరులో బంగారం షాపులన్నీ బంద్ అయ్యాయి. ఈ కారణంతో బంగారం కొనుగోలు చేయడానికి వచ్చిన కస్టమర్లు నిరాశతో వెనుదిరిగారు. ఇప్పుడు పండుగ సీజన్ కావడంతో మంచి గిరాకీ ఉందని, కానీ ఐటీ అధికారుల భయంతో మూసివేసినట్లు గోల్డ్ షాపుల నిర్వాహకులు చెబుతున్నారు.
నాలుగు రోజుల పాటు మూసివేయడంతో లక్షల్లో నష్టం జరుగుతుందని గోల్డ్ షాప్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తోన్నారు. అయితే బంగారం కొనుగోలుకు సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్స్ లేకపోవడం, ట్యాక్స్ చెల్లించకపోవడం వల్ల బంగారాన్ని ఐటీ అదికారులు సీజ్ చేసినట్లు తెలుస్తోంది. వేరే రాష్ట్రాల నుంచి ప్రొద్దుటూరులోని షాపులకు బంగారం వస్తుంది. కానీ బిల్లులు లేని అక్రమ బంగారం వస్తుందనే అనుమానంతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అక్రమంగా బంగారం రవాణా చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.