సంక్రాంతికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ యాభై శాతం అదనపు చార్జీలు వసూలు చేస్తామని ప్రకటించింది. ఆర్టీసీ చేస్తున్నది వ్యాపారమని ఉన్నతాదికారులు నిర్మోహమాటంగా ప్రకటించేశారు. బస్సు ఓ వైపు ఖాళీగా వస్తుందని అందుకని ఆ మాత్రం అదనపు చార్జీ వసూలు చేయాల్సిందేనని సమర్థించుకున్నారు. ఆర్టీసీ ఇలాంటి ప్రకటన చేయగానే అందరికీ సినిమా టిక్కెట్ రేట్లే గుర్తుకు వచ్చాయి. పండుగకు ప్రజలు సొంత ఊళ్లకు వెళ్లడం ఓ రకంగా తప్పనిసరి. కానీ సినిమాకు వెళ్లడం.. వెళ్లకపోవడం తప్పనిసరి కాదు. కానీ ప్రభుత్వం మాత్రం సినిమా టిక్కెట్ల విషయంలో పట్టుదలకు పోతూ అదే సమయంలో ఆర్టీసీ విషయంలో మాత్రం ప్రజల నుంచి అదనంగా వసూలు చేయాలని నిర్ణయించుకుంది. అందుకే ఈ అంశం చర్చనీయాంశమవుతోంది.
Also Read: జగన్ చుట్టూ ప్రమాదకర వ్యక్తులు ! ఎవరిని ఉద్దేశించి ఆర్జీవీ ఇలా చెబుతున్నారు ?
దోపిడీ అంటూ సినిమా టికెట్ రేట్లను తగ్గించిన ప్రభుత్వం !
పండగ సీజన్లలో పెద్ద సినిమాలను విడుదల చేసి టిక్కెట్ రేట్లను పెంచి అభిమానాన్ని దోచుకుంటున్నారని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అందుకే టిక్కెట్ రేట్లను తగ్గిస్తున్నట్లుగా ప్రకటించింది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం సినిమాలకు ఖరారు చేసిన టిక్కెట్ రేట్లు పదేళ్ల కిందటివి. ఏ రాష్ట్రంలోనూ అంత మొత్తం తక్కువ టిక్కెట్ ధర లేదు. అందుకే టాలీవుడ్ ఇబ్బంది పడుతోంది. పెరిగిపోయిన ధియేటర్ నిర్వహణ ఖర్చలు.. సినిమా నిర్మాణ ఖర్చు అన్నీ కలిపి టిక్కెట్ రేట్లు గిట్టుబాటు కావని అంటోంది. కానీ ప్రభుత్వం మాత్రం పెంచేదే లేదని చెబుతోంది. పేదలకు వినోదం తక్కువ ధరకే అందిస్తామని.. వారిని దోపిడీ చేసే చర్యలకు అంగీకరించబోమని అంటోంది. ప్రస్తుతం ఈ అంశం కోర్టులో ఉంది. కోర్టు సూచనల మేరకు ప్రభుత్వం కమిటీని నియమించింది.
Also Read: అడ్డంగా బుక్కైన బంగార్రాజు.. టికెట్ రేట్ ఇష్యూలో నాగార్జునపై ట్రోల్స్
వ్యాపారం అంటూ ప్రత్యేక బస్సుల్లో యాభై శాతం రేట్లను పంచిన ఏపీ ప్రభుత్వం !
ఈ వివాదం నడుస్తూండగానే ఏపీ ప్రభుత్వం సంక్రాంతి ప్రత్యేక బస్సుల్లో యాభై శాతం టిక్కెట్ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వ నిర్ణయంపై అందరూ ఒక్క సారిగా ఆశ్చర్యపోయారు. పేదల కోసం వినోదాన్ని అతి తక్కువకే అందించడానికి అతి తక్కువ ధరలను ఖరారు చేసిన ప్రభుత్వం ఆర్టీసీ విషయంలో పేదలపై భారం పడేలా యాభై శాతం చార్జీలను వడ్డించడం ఏమిటన్న అభిప్రాయం వినిపిస్తోంది. పైగా ఆర్టీసీ ప్రయాణం కొన్ని లక్షల మందికి తప్పనిసరి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ విధానం ప్రకారం చూస్తే చార్జీలు పెంచకూడదని .. పెంచదని అనుకున్నారు. కానీ అక్కడ జరిగింది వేరు. సినిమా టిక్కెట్ల వివాదం ఇంకా నడుస్తూండగానే ప్రభుత్వం ఏ మాత్రం తటపటాయించకుండా బస్ చార్జీలను యాభై శాతం అదనంగా వసూలు చేయడానికి అంగీకరించింది.
Also Read: ఆర్జీవీ ట్విట్టర్ కౌంటర్స్.. ఇక కలిసే మాట్లాడుకుందామని చెప్పిన మంత్రి పేర్ని నాని.. కానీ..
ప్రభుత్వానిది వ్యాపారం... మరి సినిమా ఇండస్ట్రీదేంటి?
ప్రభుత్వ విధానం ప్రకారం చూస్తే ప్రైవేటు వ్యక్తులు వ్యాపారాలను చేయాలంటే ప్రభుత్వ ధరల ప్రకారం చేయాలి. నష్టం వచ్చినా.. కష్టం వచ్చినా చేస్తే చేయాలి లేకపోతే లేదు. కానీ ప్రభుత్వం మాత్రం యథావిధిగా వ్యాపారం చేయవచ్చు. బస్సులు ఓ ట్రిప్ ఖాళీగా వస్తాయన్న ఉద్దేశంతో యాభై శాతం అదనపు చార్జీలకు అంగీకరించామని ప్రభుత్వం చెబుతోంది. అలా చేయడం వల్ల ఆర్టీసీకి నష్టాలు రావని వాదిస్తోంది. మరి ఇదే కాన్సెప్ట్ సినిమా వ్యాపారాల విషయంలో ప్రభుత్వం ఎందుకు అప్లయ్ చేయదనే ప్రశ్నలు కొన్ని వర్గాల నుంచి వస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీని దెబ్బకొట్టడానికే ఈ వ్యవహారం నడుపుతున్నారని ఇతర వర్గాలు చేస్తున్న విమర్శలకు ప్రభుత్వ విధానం బలపరిచేలా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
Also Read: కొడాలి నాని ఎవరో తెలియదు.. నాచురల్ స్టార్ నానీ ఒక్కడే తెలుసు! ఆర్జీవీ రివర్స్ పంచ్ రేంజే వేరు
పొరుగున ఉన్న తెలంగాణ ప్రభుత్వం సినిమా టిక్కెట్ రేట్లను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీనిపై అనేక మంది సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము సినిమాలకు వెళ్లబోమని ప్రకటించారు. సినిమా అనేది నిత్యావసరం కానీ.. అత్యావసరం కానీ కాదు. సినిమాకు వెళ్లకపోయినా అనేక వినోద సాధనాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అందుకే ప్రభుత్వం కూడా లైట్ తీసుకుంది. అదే సమయంలో తెలంగాణ సర్కార్ ఆర్టీసీలో పండుగ సందర్భంగా అదనపు చార్జీలను వసూలు చేయకూడదని నిర్ణయించుకుంది. ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నామని ఒక్క రూపాయి కూడా అదనపు చార్జీ వసూలు చేయబోమని ఆ సంస్థ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ఏపీ, టీఎస్ ఆర్టీసీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఏపీ నుంచి ఎన్ని బస్సులు తెలంగాణకు వస్తే .. తెలంగాణ కూడా అన్ని బస్సులను ఏపీకి నడుపుకోవచ్చు. ప్రత్యేక బస్సుల్లోనూ ఇదే కోటా. అంటే విజయవాడకు హైదరాబాద్ నుంచి వంద బస్సులు వెళ్తే అందులో యాభై తెలంగాణ ఆర్టీసీవి ఉంటాయి. అయినప్పటికీ చార్జీలు పెంచాలని ఆ సంస్థ అనుకోలేదు.
సినిమా టిక్కెట్ రేట్లు పెంచితే .. ప్రజలకు భారం అయితే నష్టపోయేది సినిమా పరిశ్రమే. చూడటానికి ఎవరూ రాకపోతే వారికి కలెక్షన్లు రావు. తప్పనిసరిగా చూడాలన్న పరిస్థితేమీ లేదు. కానీ ప్రయాణం అలా కాదు. పండుగను ఆత్మీయులతో జరుపుకోవాలంటే ప్రయాణం తప్పనిసరి. ప్రజల గురించి ఆలోచించేవారు ఎవరైనా ప్రయాణాలు భారం కాకుండా చూస్తారు. తెలంగాణ అదే చేసింది. కానీ ఏపీ మాత్రం మాది వ్యాపారం అంటోంది. రేటు తగ్గించేది లేదని చెబుతోంది. సినిమా టిక్కెట్లతో పోల్చి నెటిజన్లు విమర్శలు చేస్తున్నా.. ఏపీ సర్కార్ లైట్ తీసుకుంటోంది.
Also Read: ఆర్జీవీ 10 ప్రశ్నలకు మంత్రి పేర్ని నాని కౌంటర్.. ‘ఆ ఫార్ములా ఏంటి వర్మగారూ’ అంటూ వరుస ట్వీట్లు