Jagananna Vidya Deevena: జగనన్న విద్యా దీవెన నగదు విడుదల చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్
పేద విద్యార్థులు ఉన్నత చదువుకు దూరం కాకూడదని, తల్లిదండ్రుల ఆర్థిక కష్టాన్ని అర్థం చేసుకుని తన వంతు సాయంగా విద్యా దీవెన పథకాన్ని చేపట్టినట్లు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.
ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు చదువుకు అత్యంత ప్రాధాన్యం కల్పిస్తోంది. ఇందుకోసం ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం జగనన్న విద్యా దీవెన. ఇందులో భాగంగా నేడు జగనన్న విద్యా దీవెన రెండో విడత సొమ్మును ఏపీ సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ ఒక్క బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేశారు.
జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఈ ఏడాది దాదాపు 10.97 లక్షల మంది విద్యార్థులకు లబ్దిచేకూరనుంది. విద్యార్థుల తల్లుల ఖాతాలకు మొత్తం రూ.693.81 కోట్ల నగదును విడుదల చేశారు. ఇదివరకే మొదటి విడత కింద ఏప్రిల్ 19న ఏపీ సీఎం వైఎస్ జగన్ రూ.671 కోట్ల నగదును జమ చేశారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిరుపేద విద్యార్థులు పెద్ద చదువులు చదవాలని ఫీజు రీయింబర్స్‌మెంట్ లాంటి పథకం తీసుకొచ్చి విద్యా రంగంలో భారీ మార్పులు తీసుకొచ్చారు. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజులు మొత్తం ఆయా విద్యా సంవత్సరానికిగాను మూడు నెలలకోసారి జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఏపీ ప్రభుత్వం చెల్లిస్తుంది.
వైఎస్సార్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఏపీ సీఎం వైఎస్ జగన్ సైతం ఫీజు రీయింబర్స్‌మెంట్ అందించడంతో పాటు విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక చేయూత కల్పిస్తున్నారు. విద్యా దీవెన పథకం ద్వారా అర్హత ఉన్న ప్రతి విద్యార్థి తల్లి ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. నేడు విద్యా దీవెన రెండ విడత సొమ్మును విడుదల చేసిన అనంతరం సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ చదుకోవాలన్నది తన తాపత్రయమని, పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువు అని పేర్కొన్నారు. విద్యార్థి తల్లిదండ్రులకు పిల్లల చదువు భారం కాకూడదని విద్యా దీవెన పథకానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.
గత ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలులు 1,774 కోట్లను సైతం తమ ప్రభుత్వం అందించిందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీజు రియింబర్స్‌మెంట్ అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బ్రిక్స్ దేశాలతో పోల్చితే మన దగ్గర అక్షరాస్యత చాలా తక్కువగా ఉందన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే దేశంలో 33 శాతం నిరక్షరాస్యత ఉందన్నారు. పది, ఇంటర్ తరువాత చదువు మానేసే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉందని, ఈ పరిస్థితిలో మార్పు తీసుకొచ్చేందుకు వక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్ వివరించారు. ప్రతి మూడు నెలలకోసారి విద్యార్థి తల్లుల ఖాతాల్లో నగదు చేసి, వారే నేరుగా ఫీజులు చెల్లించేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
తల్లిదండ్రులకు భారం లేకుండా వసతి దీవెన అందిస్తున్నాం. ప్రతి మూడు నెలలకోసారి తల్లుల ఖాతాల్లోనే డబ్బు జమ చేస్తున్నాం. తల్లులే నేరుగా ఫీజులు చెల్లించేలా చర్యలు తీసుకున్నాం. విద్యా దీవెనతో ఇప్పటివరకు రూ.5,573 కోట్లు అందించాం. ఏపీ ప్రభుత్వం విద్యా కానుక, అమ్మ ఒడి, నాడు-నేడు కింద మొత్తం రూ.26,677 కోట్లు విడుదల చేసినట్లు ఏపీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు.